Poonam Kaur: పూనమ్‌ రాజకీయాల వైపు అడుగులు..? నటి సంచలన కామెంట్స్‌తో తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ

|

Mar 07, 2023 | 6:28 PM

తెలంగాణ గవర్నర్‌ తమిలిసై నిర్వహించిన మహిళా దినోత్సవం వేడుకల సాక్షిగా..సినిమాల నుంచి పాలిటిక్స్‌ వరకు అన్నింటినీ ఏకరవు పెట్టింది పూనమ్‌.  తమిళిసైని కలిసిన తర్వాత తనదైన శైలిలో విమర్శలు ఎక్కుపెట్టింది పూనమ్‌కౌర్‌.

Poonam Kaur: పూనమ్‌ రాజకీయాల వైపు అడుగులు..? నటి సంచలన కామెంట్స్‌తో తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ
Poonam Kaur
Follow us on

తెలంగాణలో ఆడబిడ్డల్ని తొక్కేస్తారా? ఆడవాళ్లపై రాళ్లేసేవారికి పూలదండలు బహుమానం ఇస్తారా? తెలంగాణ తెచ్చింది తెలంగాణ బిడ్డల కోసం కాదా? మీ బిడ్డలు ఎదిగితే సరిపోతుందా? నేనూ తెలంగాణ బిడ్డనే.. ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా.. ఈ వ్యాఖ్యలు చేసింది ఏ ప్రతిపక్ష నేతనో.. తెలంగాణలో సెటిలైన ఆంధ్రా లీడరో అనుకుంటే పొరపాటు పడ్డట్టే. టాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ పూనమ్‌కౌర్‌ నుంచి వచ్చిన తూటాల్లాంటి మాటలివి. తెలంగాణ గవర్నర్‌ తమిలిసై నిర్వహించిన మహిళా దినోత్సవం వేడుకల సాక్షిగా..సినిమాల నుంచి పాలిటిక్స్‌ వరకు అన్నింటినీ ఏకరవు పెట్టింది పూనమ్‌.  తమిళిసైని కలిసిన తర్వాత తనదైన శైలిలో విమర్శలు ఎక్కుపెట్టింది పూనమ్‌కౌర్‌. రాష్ట్రంలో మహిళలకు అన్నింటా అన్యాయమే అని విమర్శించింది. దీంతో రాజ్‌భవన్‌ నుంచే పూనమ్‌ రాజకీయాలవైపు అడుగులేస్తున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

నేను తెలంగాణ బిడ్డని. తెలంగాణలో పుట్టాను.. తెలంగాణాలో పెరిగా ! మతం పేరుతో నన్ను వేరు చేస్తారా. సినిమా పరంగానూ నష్టపోయాను అనే చెప్పే ఉద్దేశంలో పూనమ్‌ కౌర్ అన్నమాటలివి. మీకు నచ్చినవాళ్లను, ముంబై నుంచి వచ్చినవాళ్లకే ఆఫర్లా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పూనమ్‌కౌర్‌ సినిమాల నుంచి దూరమై చాలాకాలమైంది. అలాంటిది ఇప్పుడు ఇండస్ట్రీ గురించి మాట్లాడటంపై పెద్దగా చర్చ లేదు. కానీ ఇతర అంశాలపై సందించిన ప్రశ్నలు రాజకీయంగా రచ్చ చేసేటివే.

ఇటీవల మెడికో ప్రీతి ఇన్సిడెంట్‌ కలచివేసిందని, వాళ్ల అమ్మానాన్న రోదన వింటే ఏడుపు వచ్చిందని చెప్పిన పూనమ్‌ కౌర్.. ఏకంగా ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. భరించలేనప్పుడు రుద్రమదేవిలా మారండి అంటూ సూచించారు. స్వయంగా గురుగోవిందే చెప్పారంటూ సపోర్ట్ చేసుకున్నారు. వేధించే మగాళ్లు సింహాల్లా ఫీలయితే.. తిరగబడడంలో తప్పులేదు.. మనం కూడా సివంగులం.. గుర్తుంచుకోండి అంటూ మాట్లాడారు పూనం

ఇవి కూడా చదవండి

పూనమ్‌ కామెంట్‌ చేసింది ఎక్కడో అయితే పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు. కొద్ది కాలంగా ప్రగతిభవన్‌తో ఢీ అంటే ఢీ అంటున్న రాజ్‌భవన్‌ లో పూనమ్‌ శివంగిలా మారారు. అదికూడా తమిళిసైతో కలిసి వచ్చిన తర్వాత నేరుగా ప్రగతి భవన్‌కు తాకేలా తూటాల్లాంటి బాణాలు ఎక్కుపెట్టారు. ఇదే ఇప్పుడు పొలిటికల్‌గా రచ్చ చేస్తుంది. ఏ పొలిటికల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ లేని పూనమ్‌కు ఇప్పుడు గవర్నర్‌ బ్యాక్‌బోన్‌గా మారిందా అనే విశ్లేషణలు ఊపందుకున్నాయి.

పూనం ఈ మాటలు అనడానికి ముందు అదే వేదికపై మాట్లాడారు తెలంగాణ గవర్నర్‌ తమిళి సై. తెలంగాణ గడ్డపై ఆమె ఇప్పటికే అనేక అవమానాలు భరించినట్లు చెప్పారు. ఆ మాటలకు సంఘీభావం తెలుపుతూ.. పూనమ్‌ కూడా తన ఆవేదన వెళ్లగక్కారు. ఇంతకీ పూనమ్‌లో భావోద్వేగాన్ని రేకెత్తించేలా అంతకుముందు గవర్నర్ మాట్లాడారు.

వాస్తవానికి ఆ కార్యక్రమంలో ఇటు గవర్నర్‌ మాటలు, అటు పూనమ్‌ కామెంట్స్‌ ఒకే తీరుగా ఉన్నాయి. పరోక్షంగా బీఆర్‌ఎస్‌ను టార్గెట్‌గా చేసుకునే మాట్లాడినట్లు స్పష్టమవుతుంది. సో.. సినిమాల్లో లక్‌ కలిసి రాని పూనమ్‌కు రాజకీయాలైనా కలిసొస్తాయేమో చూడాలి మరి.