
ఇప్పటికే ఆ జాతీయ రహదారి అంటేనే వాహనదారులకు హడల్..! పగలు, రాత్రి తేడా లేకుండా నిత్యం రద్దీగా ఉండే రహదారిపై ఓ ట్రాక్టర్ డ్రైవర్ చేసిన రచ్చ మామూలుగా లేదు. మిగతా వాహనదారులను తెగ భయాందోళనకు గురిచేసింది. జోగులాంబ గద్వాల్ జిల్లా మానవపాడు మండల పరిధిలో 44వ జాతీయ రహదారిపై ఓ ట్రాక్టర్‌తో ఓ యువకుడు ప్రమాదకర స్టంట్ చేశాడు. మానవపాడు నుండి ఉండవల్లి వరకు నేషనల్ హైవేపై ట్రాక్టర్‌ను వేగంగా నడుపుతూ.. తాపీగా పడుకుని డ్రైవింగ్ చేశాడు. అలా ఏదో అలా చేసి ఇలా ఊరుకున్నాడు అనుకుంటే పొరపాటే. కిలో మీటర్ల దూరం అదే విధంగా పడుకుని డ్రైవింగ్ చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఒళ్లు గగుర్పాటుకు గురి చేస్తున్నాయి.
ఓ యువకుడు ట్రాక్టర్ డ్రైవింగ్ సీటు మీదుగా ఇంజిన్ కు ఉండే పెద్ద టైర్ పైన అటూ.. ఇటూ పడుకొని చేతులతో స్టీరింగ్ ను కంట్రోల్ చేశాడు. అయితే చెప్పుకోవడానికి, చూడడానికి ఇదంతా బాగానే ఉన్నా.. ప్రయాణిస్తున్న రహదారి దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన హైవేల్లో ఒకటి. పొడవైనది కూడా. ఈ జాతీయ రహదారి 44 జమ్మూ-కాశ్మీర్ లోని శ్రీనగర్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు విస్తరించి ఉంది. నిత్యం వాహనాలతో ఈ రహదారి రద్దీగా కనిపిస్తుంటుంది. ప్రతిరోజూ వివిధ కారణాలతో ఈ NH 44 పై ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
అయితే ఈ యువకుని స్టంట్లతో తోటి వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదం జరిగితే వేరే కానీ, ఇలాంటి చేష్టలతో ఇతరుల ప్రాణాలతో చెలగాటం ఆడడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు. సడన్ బ్రేక్ వేయాల్సి వస్తే, సదరు ట్రాక్టర్ డ్రైవర్ ఏం చేస్తాడని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వారితో రహదారులపై ప్రయాణించే వారు రిస్క్ లో పడతారని చెబుతున్నారు. డ్రైవింగ్ వచ్చు కదా అని రోడ్లపైకి రావడం కాకుండా ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలిగించకుండా ఉండేలా బాధ్యతగా ఉండాలని తోటి వాహనదారులు సూచిస్తున్నారు. ఇలాంటి స్టంట్లు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు. ఇక ఇంత ప్రమాదకరంగా ట్రాక్టర్ నడిపిన యువకుడు ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామానికి చెందిన వ్యక్తిగా పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..