
చికిత్స కోసం కుమార్తెను ఆస్పత్రికి తీసుకెళ్లన ఓ మహిళ తానే ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. ఆస్పత్రి ఆవరణలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే అప్రమత్తమైన ఆస్పత్రి సూపరింటిండెట్ మహిళకు గుండెపోటు వచ్చిందని గ్రహించి వెంటనే సీపీఆర్ చేసి మహిళ ప్రాణాలు కాపాడారు. ఈ సంఘటన నిర్మల్ జిల్లా భైంసాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే భైంసా పట్టణం ముధోల్‌కు చెందిన శోభ అనే 45 ఏళ్ల మహిళ తన కుమార్తెను చికిత్స కోసం భైంసా ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లింది.
ఓపీలో తమ వంతు కోసం ఎదురు చూస్తున్న శోభ ఉన్నట్టుండి ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఒక్కసారిగా కుప్పకూలిపోయిన మహిళను చూసి అక్కడున్న మిగతా వారు భయంతో కేకలు వేశారు. ఏం జరిగిందా అని అక్కడికి వచ్చిన ఆస్పత్రి సూపరింటిండెంట్ కాశీనాథ్ మహిళను పరిశీలించి గుండెపోటు వచ్చినట్టు గుర్తించారు. వెంటనే ఆమెకు సీపీఆర్ చేశారు. దాంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. క్షణాల్లో స్పందించి సీపీఆర్ నిర్వహించి మహిళ ప్రాణాలు కాపాడిన ఆస్పత్రి సూపరింటిండెంట్‌పై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం శోభ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..