పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయుడు వక్రబుద్ధి ప్రదర్శించాడు. పాఠశాలలోని విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం తెలిసిన తల్లిదండ్రులు, గ్రామస్థులు శుక్రవారం అతనికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బిచ్కుంద మండలం ఫత్లాపూర్ ప్రభుత్వ పాఠశాలలో సంజీవ్ అనే ఉపాధ్యాయుడు విద్యార్థులకు పాఠాలు చెబుతున్నాడు. అయితే, ఆయన గారి బుద్ధికి చెదలు పట్టింది. తన పిల్లల వయస్సున్న విద్యార్థులపై కామంతో కన్నేశాడు. పాఠశాలలో విద్యార్థుల పట్ల వికృతచేష్టలు చేయడం మొదలుపెట్టాడు. అతని చేష్టలకు విసిగిపోయిన విద్యార్థినులు విషయాన్ని తమ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గ్రామస్థులు శుక్రవారం పాఠశాలకు వెళ్లి సదరు ఉపాధ్యాయుడిని నిలదీశారు. ఈ క్రమంలో ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.
ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. అయితే, ఈ ఘటనపై ఎవరూ లిఖిత పూర్వక ఫిర్యాదు ఇవ్వలేదని, ఫిర్యాదు వస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. ఎవరూ ముందుకు రాకపోతే.. సుమోటోగా కేసు నమోదు చేస్తామని చెప్పారు పోలీసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..