AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుర్రంపై స్వారీ.. ‘దేశ గురువు’గా ఎంట్రీ.. గ్రామస్థుల అనుమానాలతో పరార్..!

రాజన్న సిరిసిల్ల జిల్లాలో తనను తాను "దేశ గురువు"గా పరిచయం చేసుకుంటూ గ్రామాల్లో సంచరించిన ఓ వ్యక్తి వ్యవహారం కలకలం రేపింది. గ్రామస్థుల నుంచి అనుమానాలు వ్యక్తం కావడంతో అతడు తన అనుచరులతో కలిసి పరారైన ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామస్థుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు.

గుర్రంపై స్వారీ.. ‘దేశ గురువు’గా ఎంట్రీ.. గ్రామస్థుల అనుమానాలతో పరార్..!
Horse Baba
G Sampath Kumar
| Edited By: |

Updated on: Jun 16, 2026 | 11:16 AM

Share

రాజన్న సిరిసిల్ల జిల్లాలో తనను తాను “దేశ గురువు”గా పరిచయం చేసుకుంటూ గ్రామాల్లో సంచరించిన ఓ వ్యక్తి వ్యవహారం కలకలం రేపింది. గ్రామస్థుల నుంచి అనుమానాలు వ్యక్తం కావడంతో అతడు తన అనుచరులతో కలిసి పరారైన ఘటన వెలుగులోకి వచ్చింది.

వేములవాడ గ్రామీణ మండలంలోని వెంకటంపల్లి, అచ్చన్నపల్లె గ్రామాల్లో కొద్దిరోజులుగా ఓ వ్యక్తి సంప్రదాయ వేషధారణలో గుర్రంపై స్వారీ చేస్తూ తిరిగాడు. దీంతో కొందరు అతడిని ఆధ్యాత్మిక గురువుగా భావించి స్వాగతించారు. అనంతరం అతడు చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామానికి చేరుకుని ఓ సంఘ భవనంలో మకాం వేసినట్లు తెలిసింది.

గ్రామంలోకి ప్రవేశించే ముందు అతడి అనుచరులు ఇంటింటికీ తిరుగుతూ “స్వామి వస్తున్నారు.. నీళ్లు, కొబ్బరికాయలు సిద్ధంగా ఉంచండి.. స్వామి కాళ్లు కడిగితే ఇంట్లోని దోషాలు తొలగిపోతాయి” అంటూ ప్రచారం చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో కొందరు భక్తి భావంతో స్వాగతం పలకగా, మరికొందరు అనుమానంతో గమనించారు.

ఇళ్లకు వెళ్లిన అనంతరం కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే ప్రత్యేక పూజలు చేయాలని, అదృష్టం కలిసొస్తుందని అతడి అనుచరులు గ్రామస్థులను నమ్మించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో పూజల పేరుతో కొందరి నుంచి నగదు కూడా వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే గుర్రంపై స్వారీ చేస్తూ గ్రామంలో తిరుగుతున్న సమయంలో ఆ వ్యక్తి మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని, వెకిలి చేష్టలకు పాల్పడ్డాడని పలువురు గ్రామస్థులు ఆరోపించారు. దీంతో అతడి అసలు ఉద్దేశాలపై అనుమానాలు మరింత బలపడ్డాయి.

గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, విషయం తెలుసుకున్న ఆ వ్యక్తి తన అనుచరులతో కలిసి అక్కడి నుంచి పరారైనట్లు తెలిసింది. పోలీసులు గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించి విచారణ చేపట్టారు. ఆధ్యాత్మిక గురువుల పేరుతో ప్రజలను మోసం చేసే వారిపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తుల గురించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us