అధిక కమిషన్‌కు ఆశపడి స్వైపింగ్ మిషన్లతో డబ్బులు చెల్లిస్తున్నారా.. జాగ్రత్త! డెబిట్, క్రెడిట్ కార్డుల లావాదేవీలు జరిపే స్వైపింగ్ మెషీన్ (పీఓఎస్ యంత్రాలు)లోని ఆప్షన్లను వాడుకుని కేటుగాళ్లు టోకరా వేస్తున్నారు. స్వైపింగ్ మెషీన్‌లతో పెట్రోల్ బంకుల్లో పనిచేసే అమాయక పంపు బాయ్‌లను మోసం చేసి టోకరా వేస్తున్న కేటుగాళ్లను నల్గొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామానికి చెందిన వేముల శ్రీనివాసరావు, నీలటూరి రవి, మాలపాటి శౌరి, నరసరావుపేట మండలం రావిపాడు గ్రామానికి చెందిన అనాల శివ, కారంపుడి మండలం కొమిడిపాడు గ్రామానికి చెందిన కాడితం సిద్దార్ధరెడ్డి ఈజీ మనీ కోసం ముఠాగా ఏర్పడ్డారు. దర్జాగా అందిన కాడికి దోచేస్తున్నారు. తాజాగా నల్లగొండ జిల్లాలో బారీ మోసం వెలుగులోకి వచ్చింది.
గతంలో పెట్రోల్ బంకుల్లో పంపు బాయ్‌లుగా, మేనేజర్లుగా పనిచేసిన ఈ ముఠా.. అక్కడ వినియోగించే స్వైపింగ్ మిషన్లలోని ఆప్షన్లపై పూర్తి అవగాహన పెంచుకున్నారు. టూ వీలర్స్‌పై తిరుగుతూ ఏపీ సరిహద్దుల్లోని పెట్రోల్ బంకుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. పెట్రోల్ బంకులోకి వెళ్లి తమ బంధువు ఆస్పత్రిలో ఉన్నారని, అత్యవసరంగా నగదు కావాలని, తమ క్రెడిట్ కార్డు నుంచి నగదు డ్రా చేసి ఇస్తే కొంత కమీషన్ గా ఇస్తామని సాయం చేయమని వేడుకుంటారు. బంక్ నిర్వాహకులు అంగీకరిస్తే తమ క్రెడిట్ కార్డు నుంచి రూ. 20వేల నుంచి రూ. 30వేల వరకు డ్రా చేస్తారు. ఈ క్రమంలో ముఠా సభ్యులు బంక్ ఆపరేటర్లను మాటల్లో పెట్టి స్వైపింగ్ మిషన్‌ను తమ చేతుల్లోకి తీసుకుని మెషీన్‌లోని ‘వాయిడ్’ VOID అనే ఆప్షన్ వాడి తాము చేసిన లావాదేవీని రద్దు చేస్తారు. దీంతో డ్రా చేసిన సొమ్ము తిరిగి వారి క్రెడిట్ కార్డులో జమయ్యేది. అలాగే, బంకు నిర్వాహకులు నుంచి నగదు కూడా తీసుకుని ఉడాయిస్తున్నారు.
కొన్ని నెలలుగా తెలంగాణ రాష్ట్రంలోని నేరేడుచర్ల, వాడపల్లి, మిర్యాలగూడ పట్టణం, వేముపల్లి, మాడుగులపల్లి, తిప్పర్తి, నల్లగొండ పట్టణంలో పలు పెట్రోల్ బంకుల్లో మోసాలకు పాల్పడింది ఈ ముఠా. ఈ మోసాన్ని గుర్తించిన పెట్రోల్ బంక్ ల నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన వేములపల్లి పోలీసులు శెట్టిపాలెం ఎక్స్ రోడ్డు వద్ద నార్కట్‌పల్లి- అద్దంకి రహదారిపై వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా స్వైపింగ్ మోసం బయటపడింది. వారి వద్ద నుంచి రూ.1.80లక్షల నగదు, రెండు సెల్‌ఫోన్లు, క్రెడిట్ కార్డుతో పాటు బైక్ స్వాధీనం చేసుకున్నట్లు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..