Telangana: 100 ఏళ్లుగా మద్యం సీసా అడుగుపెట్టని స్ఫూర్తిదాయక గ్రామం..
మద్యం మనిషిని నాశనం చేస్తుంది... కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తుంది... సమాజాన్ని కలుషితం చేస్తుంది. మద్యపానాన్ని అరికట్టేందుకు ప్రభుత్వాలు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. కానీ ఓ చిన్న గ్రామం మాత్రం... వందేళ్ల క్రితమే ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి నేటికీ తలవంచ లేదు. తరాలు మారాయి... కాలం మారింది... కానీ ఆ గ్రామంలోకి మద్యం సీసా మాత్రం రాలేదు. అక్కడ మత్తుకు బదులు మానవత్వానికి విలువ ఉంది. ఆ గ్రామమేదో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

మద్యం లేకుండా గ్రామం నడవదని భావించే కాలం ఇది. ప్రతి ఊరిలో బెల్ట్ షాపులు… ప్రతి వీధిలో మద్యం దుకాణాలు కనిపిస్తున్నాయి. కానీ సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీలో విలీనమైన తమ్మర బండపాలెం మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా నిలుస్తోంది. ఈ ఊరిలో మొత్తం 91 కుటుంబాలు నివసిస్తున్నాయి. అందులో 60 ముస్లిం కుటుంబాలు, 30 ముదిరాజ్ కుటుంబాలు ఉన్నాయి. గ్రామ ప్రజల్లో ఎక్కువ మంది వ్యవసాయం, కూలీ పనులు, వెల్డింగ్ వృత్తి, చిన్న వ్యాపారాల ద్వారా జీవనం సాగిస్తున్నారు. మతాలు, కులాలు వేరైనా … కానీ గ్రామ ప్రయోజనం విషయంలో మాత్రం అందరూ ఒక్కటే. సామాజిక ఐక్యతకు ఈ గ్రామం నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.
వందేళ్ళుగా మద్యం సీసా అడుగు పెట్టని గ్రామం..
వందేళ్లుగా మద్యం సీసా గ్రామంలోకి అడుగుపెట్టకుండా సామాజిక క్రమశిక్షణతో జీవిస్తోంది. గ్రామంలోకి అడుగుపెడితే ప్రశాంతత కనిపిస్తుంది. గొడవలు లేవు… మద్యం మత్తులో అల్లర్లు లేవు… బెల్ట్ షాపుల హడావిడి లేదు. ఇక్కడ మద్యం అమ్మడం నిషేధం… తాగడం కూడా నిషేధమే. ఎవరైనా మద్యం సేవించాలంటే గ్రామం బయటకే వెళ్లాల్సిన పరిస్థితి. శతాబ్దం క్రితం గ్రామ పెద్దలు తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయమే దీనికి కారణం. మద్యం కుటుంబాలను నాశనం చేస్తుందని.. గ్రామాభివృద్ధికి అడ్డుగా మారుతుందని భావించిన పెద్దలు స్వచ్ఛందంగా మద్యనిషేధాన్ని అమలు చేశారు. ఆ నిర్ణయాన్ని తరతరాలుగా గ్రామ ప్రజలు గౌరవిస్తూ వస్తున్నారు. కాలక్రమంలో గ్రామంలో బెల్ట్ షాపులు ఏర్పాటు చేయాలని కొందరు ప్రయత్నించినా… గ్రామస్తులంతా ఒక్కటై వాటిని అడ్డుకున్నారు. “మద్యం వద్దు… ప్రశాంతతే మాకు ముఖ్యం” అనే నినాదాన్ని చేతల్లో చూపించారు.
కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి కుటుంబ అవసరాలకే ఖర్చవుతోంది. మద్యం కోసం సంపాదన వృథా కావడం లేదని గ్రామస్తులు గర్వంగా చెబుతున్నారు. మద్యం లేకపోవడంతో కుటుంబ కలహాలు, దాడులు, నేరాలు చాలా అరుదుగా జరుగుతున్నాయని గ్రామ పెద్దలు చెబుతున్నారు. గ్రామంలో పరస్పర సహకారం, ప్రశాంత వాతావరణం, సామాజిక ఐక్యత కొనసాగడానికి ఇదే ప్రధాన కారణమని చెబుతున్నారు. మద్యపానం నిషేధ సంప్రదాయాన్న కేవలం పెద్దలే కాదు… యువత కూడా అదే బాధ్యతతో ముందుకు తీసుకెళ్తోంది. కొత్త తరానికి మద్యం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తూ… గ్రామ నిర్ణయాన్ని భవిష్యత్ తరాలకు కూడా అందిస్తున్నారని స్థానిక నేతలు చెబుతున్నారు.
వందేళ్లుగా మద్యం సీసా గ్రామంలోకి రానివ్వకుండా… కుటుంబాలను కాపాడుకుంటూ… ప్రశాంతతను పరిరక్షిస్తూ… సామాజిక ఐక్యతకు సజీవ సాక్ష్యంగా నిలిచింది ఈ గ్రామం. మద్యానికి నో చెప్పి… శాంతికి జై కొట్టిన ఈ గ్రామం… అందరికీ ఆదర్శప్రాయం. నిజంగా తెలంగాణకు కూడా గర్వకారణమే.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
