మానవత్వం మంట కలిసింది.. మాటలు నేర్చిన మనిషే తప్పులు చేస్తుంటే మాటలు రాని మూగజీవాలు తప్పులు చేస్తున్నాయని వాటిని బంధించి, చావు దెబ్బలు కొట్టి పైగా పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన ఘటన మంచిర్యాల జిల్లాలో వెలుగు చూసింది. మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని ఎమ్మెల్యే కాలనీకి చెందిన అట్టెం మధు అనే వ్యక్తికి చెందిన ఎద్దు కత్తెరసాల గ్రామంలో ఓ పంట చేనులో మేసింది. ఆ పంట యజమాని అయిన సర్ధార్ ఎద్దుని బందించి చావు దెబ్బలు కొట్టాడు. అక్కడితో ఆగకుండా ఇంట్లోనే నిర్బందించాడు. ఈ విషయం తెలుసుకున్న ఎద్దు యజమాని మధు.. సర్దార్తో గొడవకు దిగారు. మూగ జీవిని ఎలా బందించి కొడుతావ్ అంటూ నిలదీశాడు. నా పంట చేనును పాడు చేసిన ఎద్దును కొట్టక ముద్దు పెట్టుకోవాలా.. ఎక్కువ తక్కువ అయితే చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో అన్నంత పని చేసేలా ఉన్నాడంటూ ఎద్దును విడిపించాలంటూ పోలీసులను ఆశ్రయించాడు మధు.
పొలం యజమాని సర్దార్ సైతం తన పంట నష్టపోయానని.. పంట చేనులో మేసిన ఎద్దుపై చర్యలు తీసుకోవాలంటూ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అక్కడితో ఆగకుండా న్యాయం జరిగేంత వరకు ఎద్దును వదిలి పెట్టేదే లేదంటూ.. పోలీస్ స్టేషన్లో ఎద్దును అప్పగించాడు పొలం యజమాని సర్దార్. ఎద్దు పంచాయితీని ఎటు తేల్చలేక పోలీస్ స్టేషన్లోనే నిర్బందించారు పోలీస్ సిబ్బంది. అయితే ఎద్దును పోలీస్ స్టేషన్లో కట్టేయడంతో వివాదస్పద మైంది. ఎద్దును అరెస్ట్ చేశారంట అని స్థానికులు చర్చించుకోవడంతో అలర్ట్ అయిన పోలీసులు అర్థరాత్రి ఎద్దును యజమాని మధుకు అప్పగించారు. ఇరువురి ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు ఎద్దు పంచాయితీని పెద్దల సమక్షంలో తేల్చుకోవాలంటూ సూచించడంతో పంచాయితీ మరో మలుపు తీసుకుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..