స్కూల్‌కు వెళ్లి వస్తున్న ఓ బాలుడి కోసం పది మంది.. మూడు కార్లలో వచ్చి దాడి చేసి ఎత్తుకుపోయారు. సినీ ఫక్కీలో రెక్కీ చేసి బాలుడిని తమ వెంట తీసుకువెళ్ళారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు కూడా చేజ్ చేశారు. అయితే వారు చిక్కినట్లే చిక్కి పారిపోయారు. ఆ బాలుడిని ఎవరూ ఎత్తుకు వెళ్లారు? ఎందుకు కిడ్నాప్ చేశారు. వివరాల్లోకి వెళితే..
సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన సైదేశ్వర్ రావు కూతురు పృథ్వి రమణను హైదరాబాద్‌కు చెందిన ప్రవీణ్‌తో పెళ్లి చేశారు. వీరికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ తర్వాత వీరి మధ్య విభేదాలు రావడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కొంతకాలంగా భర్త ప్రవీణ్, భార్య పృథ్వి రమణల మధ్య మనస్పర్థలతో దూరంగా ఉంటున్నారు. భార్య రమణ తన కుమారుడు కార్తికేయను కోదాడలోని తల్లితండ్రుల వద్ద విడిచి ఉద్యోగరీత్యా కెనడాకు వెళ్ళింది. అప్పటి నుండి కార్తికేయ అమ్మమ్మ, తాతయ్యల వద్ద ఉంటున్నాడు. పృధ్వి రమణ ప్రవీణ్ ల మధ్య ఉన్న గొడవల నేపథ్యంలో కార్తికేయను.. తండ్రి ప్రవీణ్‌తో కలవకుండా అత్తమామలు చేస్తున్నారు. దీంతో తండ్రి ప్రవీణ్ కోర్టును ఆశ్రయించాడు. వారానికి ఒక సారి కుమారుడిని చూసేలా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. తన కుమారుడు కార్తికేయను కలవనీయకుండా అత్తామామలు అడ్డుపడుతున్నారంటూ ఈ ఏడాది మార్చిలో కోదాడలోని అత్తమామలు ఇంటి ముందు ప్రవీణ్ ధర్నా చేశాడు.
అయితే ఇటీవల కోర్టు కుమారుడు కార్తికేయ సంరక్షణ బాధ్యతను తండ్రి ప్రవీణ్ కు ఇచ్చింది. దీంతో సినీ ఫక్కీలో పదిమంది మూడు కార్లల్లో వచ్చి స్కూల్ వద్దకు వచ్చారు. ఇంటికి వెళ్తున్న అమ్మమ్మ తాతయ్యలపై దాడి చేసి కార్తికేయను ఎత్తుకెళ్లారు. ఇదంతా సమీప సీసీ టీవీ లో రికార్డ్ అయ్యింది. ప్రస్తుతం ఆ వీడియో కోదాడలో వైరల్ గా మారింది. ఘటన నేపథ్యంలో మామ సైదేశ్వర్ రావు పోలీసులకు ఫిర్యాదు చేయగా, సినీ ఫక్కీలో కార్లను చేజ్ చేసి నల్లగొండ జిల్లా కేతేపల్లి టోల్ దగ్గర పట్టుకున్నప్పటికి తండ్రి ప్రవీణ్ పోలీసులకు చిక్కలేదు. దీంతో దాడి చేసిన కారణంగా ప్రవీణ్ పై కోదాడ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..