నాలుగు రోజులుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులోకి కొత్త నీరు వచ్చి చేరుతోంది. కొత్తనీరు వచ్చి చేరే సందర్భంలో చేరువుల్లోని చేపలు ఎదురెక్కడం సహజం. అలా చేపల కోసం వలవేసిన మత్స్యకారుడికి భారీ చేప చిక్కింది. భారీ వర్షాలు, వరదలతో మత్స్యకారుడికి ఎలా కలిసి వచ్చింది..? అతడి వలలో చిక్కిన భారీ చేప ఏంటీ..? పూర్తి వివరాల్లోకి వెళితే..
నల్లగొండ జిల్లా శాలిగౌరారం ప్రాజెక్టులోకి భారీ వరద నీరు వచ్చి చేరింది. కొత్త నీరు వస్తుండటంతో ప్రాజెక్టులోని చేపలు కొత్తనీటికి ఎదురెళ్తున్నాయి. చేపలు బయటకి వస్తున్నాయని తెలిసి తెలియడంతో సమీప గ్రామాల ప్రజలు భారీగా వచ్చి చేపలు పట్టేందుకు ఎగబడ్డారు. బయటకి వస్తున్న చేపలను వడిసిపట్టి ఇంటికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో పడాల వెంకన్న అనే మత్స్యకారుడు చేపలు పట్టేందుకు వలవేశాడు. అదృష్టవశాత్తు అతని వలకి భారీ చేప చిక్కింది.
వలను బయటకు తీసి చూడగా, అతి భారీ చేప కనిపించడంతో ఎగిరి గంతేశాడు వెంకన్న. ఆలుగా జాతికి చెందిన చేపగా గుర్తించి తూకం వేయగా ఆ చేప 16కేజీలు బరువుతో తూగింది. దాన్ని సమీప మార్కెట్లో అమ్మగా మూడు వేల రూపాయలు ధర పలికింది. సరదాగా చేపలు పడితే పెద్ద చేప చిక్కడంతో షాక్ కు గురయ్యానని, సరదాకు పట్టిన చేప కాసుల పంట పండించడంతో చాలా సంతోషంగా ఉందన్నారు వెంకన్న. భారీ చేప చిక్కిందన్న విషయం బయటకి పొక్కడంతో చుట్టుపక్కల వారు వచ్చి భారీ చేపతో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు.
మత్స్యకారులకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం మత్స్య సహకార సోసైటీల పరిధిలోని చేరువుల్లో ఉచితంగా చేప పిల్లలు వదిలిందని , భూగర్భ జలాలు మెండుగా ఉండటంతో చేపలు మంచి సైజ్ లో పెరిగాయని మత్స్యకారులు చెబుతున్నారు. సాధారణంగా 5 నుండి 10 కేజీల బరువు మాత్రమే పెరుగుతాయని అక్కడక్కడా ఇలాంటి భారీ చేపలు వలకు చిక్కుతాయని స్థానికులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..