
విధి ఆ బాలుడి పట్ల అత్యంత క్రూరంగా మారింది. పగబట్టినట్లుగా రెండు విష సర్పాలు ఒకేసారి ఆ పసి ప్రాణాన్ని కబళించాయి. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం లక్ష్మణ్ తండాలో జరిగిన ఈ విచారకర ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. లక్ష్మణ్ తండాకు చెందిన బాలాజీ, కవిత దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమారుడు శ్రీయాన్ (4) అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. శుక్రవారం రాత్రి ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు తల్లిదండ్రులతో కలిసి ఆరుబయట నిద్రిస్తున్నాడు. అర్ధరాత్రి రెండు గంటల సమయం.. గాఢనిద్రలో ఉన్న ఆ చిన్నారిని ఒకే సమయంలో ఒక కట్లపాము, ఒక రక్తపింజర కాటేశాయి. పాములు కరవడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచిన బాలుడు, తల్లిదండ్రులకు విషయం చెప్పాడు.
ఏ పాము కరిచిందో తెలిస్తేనే వైద్యం సులభమవుతుందని భావించిన తండ్రి బాలాజీ, చీకట్లోనే ఆ పాముల కోసం గాలించాడు. ఆ రెండు పాములను వెతికి పట్టుకుని కసితీరా హతమార్చాడు. వెంటనే ఆ పసివాడిని హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు బాలుడి ప్రాణాలు కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, అప్పటికే శరీరం అంతా అప్పటికే విషం పాకడంతో పరిస్థితి విషమించింది. చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం శ్రీయాన్ కన్నుమూశాడు.
ముద్దులొలికే కుమారుడు కళ్లముందే విగతజీవిగా పడి ఉండటంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. “రెండు పాములు పగబట్టి మా బిడ్డను పొట్టనబెట్టుకున్నాయా?” అంటూ వారు గుండెలు పగిలేలా ఏడుస్తుంటే, తండా మొత్తం కన్నీరుమున్నీరైంది. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు ఇక లేడన్న నిజాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.