Telangana Heavy Rain: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుల వర్షం.. ముగ్గురు మృతి , 30 వేల ఆస్తి నష్టం..
Heavy Rain: మళ్లీ ఉరుముల మెరుపుల మోతలు మొదలయ్యాయి. ఎండతో అల్లాడుతున్న ప్రజలకు చల్లని కబురు అందించింది వాతావరణ శాఖ. వానాకాలమే అయినా ఎండాకాలం మాదిరిగా కొద్దిరోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో వరుణుడి జాడ కోసం ఆశగా ఎదురుచూస్తున్న తెలుగురాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు వాన కబురు ప్రకటించారు. వాలనతోపాడుగు పడుతుండటంతో జనం భయపడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా భారీగా నష్టంతోపాటు ఒక్క రోజులో కురిసిన పిడుగులు ముగ్గురిని బలి తీసుకుంది.

అడవుల జిల్లాలో పిడుగులవాన ముగ్గురు మృతి.. ఒకరికి తీవ్ర గాయాలు 30 వేల ఆస్తినష్టం ఉమ్మడి ఆదిలాబాద్ లోని కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో పిడుగుల వర్షం విషాదాన్ని నింపింది. అడవుల జిల్లాలో బడుగులపై పిడుగుల వాన ముగ్గురిని బలి తీసుకుంది. కొమురంభీం జిల్లా బెజ్జూర్ మండలం పోతపల్లిలో ఒకరు, వాంకిడి మండలం ఎనగొంది లో ఒకరు, మంచిర్యాల జిల్లా భీమారం మండలంలో మరొకరు పిడుగుల దాడికి అక్కడికక్కడే మృతి చెందారు. మరో మహిళ తీవ్రగాయాలతో మంచిర్యాల ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పిడుగుల వాన కొమురంభీం , మంచిర్యాల జిల్లాలను వణికించింది.
కొమురం భీం జిల్లా బెజ్జూరు మండలం పోతెపల్లికి చెందిన తోడ్యం పోశక్క (21) అనే యువతి మంచిర్యాల పట్టణంలో బీఎస్సీ నర్సింగ్ ఫైనల్ ఈయర్ చదువుతోంది. మూడు రోజుల క్రితం సొంత గ్రామానికి వెళ్లిన ఆమె మిర్చి పంట మొక్కలు నాటేందుకు చేనులోకి వెళ్లింది. గ్రామ సమీపంలోని పంట చేనులో మిరప మొక్కలు నాటుతుండగా ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో చేనులో పని చేస్తున్న బూదక్క అనే వృద్ధురాలితో కలిసి ఇంటికి బయల్దేరింది యువతి. ఇంటికి వెళ్తున్న క్రమంలో వారిద్దరికి సమీపంలో ఒక్కసారిగా పిడుగుపడడంతో ఇద్దరు అస్వస్థతకు గురై కుప్పకూలారు.
వైద్యం కోసం కాగజ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రి తరలిస్తుండగా పోశక్క మృతి చెందింది. తీవ్రగాయాలపాలైన బూదక్కను మెరుగైన వైద్యం కోసం బెల్లంపల్లికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన జరిగిన గంట వ్యవదిలోనే ఇదే జిల్లాకు చెందిన వాంకిడి మండలం ఎనగొంది గ్రామానికి చెందిన ఆత్రం గోవింద్ రావు అనే వ్యక్తిపై (28) పిడుగు పడింది.
తీవ్ర గాయాల పాలైన గోవింద్ రావు అక్కడికక్కడే చనిపోయాడు. మరో వైపు కుశ్నపల్లి గ్రామ పంచాయతీలోని ఇందుర్గాం గ్రామానికి చెందిన నికాడి అశోక్ కు చెందిన ఎద్దు శనివారం పిడుగుపాటుకు మృతి చెందింది. దీని విలువ 30 వేలకు ఉంటుందని రైతు తెలిపారు. ఇలా ఒకటి కాదు రెండుకాదు మూడు గంటల వ్యవదిలో ఐదు చోట్ల పిడుగుల వాన భీభత్సం సృష్టించింది.
కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని ఇప్పల్ నవ్ గాం సబ్ స్టేషన్ పై సైతం పిడుగు పడటంతో 18 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇటు మంచిర్యాల జిల్లాలోను పిడుగుల వాన ఓ వ్యక్తిని బలి తీసుకుంది. మంచిర్యాల జిల్లా భీమారం మండలం ముదిరాజ్ కాలనీకి చెందిన బండారి లింగయ్య (64) అనే రిటైర్డు సింగరేణి కార్మికుడు పిడుగు పాటుకు గురై మృతి చెందాడు. వర్షం పడి తగ్గడంతో బ్యాంకు పని మీద వయటకు వెళ్ళి తిరిగి ఇంటికి నడుచుకుంటూ వస్తుండగా.. ఇంటికి వంద అడుగుల దూరంలో ఒక్క సారిగా లింగయ్యపై పిడుగు పడింది. అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయాడు లింగయ్య. ఇలా ముగ్గురిని బలి తీసుకున్న పిడుగుల వర్షం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం