AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీటెక్ మధ్యలో ఆపేసి.. ఇప్పుడు ఏకంగా బ్లాక్ హోల్‌పై అధ్యాయనం చేస్తున్న హైదరాబాదీ సైంటిస్ట్!

హైదరాబాద్‌లో జన్మించిన రోహన్ పి. నాయుడు 18 ఏళ్లకే ఇంజినీరింగ్ చదువు వదిలి ఖగోళ శాస్త్రం వైపు అడుగుపెట్టారు. ప్రస్తుతం ఎంఐటీలో పరిశోధకుడిగా ఉన్న ఆయన నేతృత్వంలోని అధ్యయనం, బిగ్‌బ్యాంగ్‌ తర్వాత 660 మిలియన్ సంవత్సరాల నాటి MoM-BH-1 అనే వస్తువును పరిశీలించింది.

బీటెక్ మధ్యలో ఆపేసి.. ఇప్పుడు ఏకంగా బ్లాక్ హోల్‌పై అధ్యాయనం చేస్తున్న హైదరాబాదీ సైంటిస్ట్!
Rohan P Naidu
SN Pasha
|

Updated on: Aug 17, 2026 | 8:39 PM

Share

హైదరాబాద్‌లో జన్మించి 18 ఏళ్లకే ఇంజినీరింగ్ చదువును మధ్యలోనే వదిలేసిన రోహన్ పి.నాయుడు ఇప్పుడు విశ్వం పుట్టిన తొలినాళ్లను అధ్యయనం చేస్తున్న ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్తగా ఎదిగారు. ఎంఐటీ పప్పలార్డో ఫెలోగా ఉన్న ఆయన నేతృత్వంలోని తాజా పరిశోధన.. బిగ్‌బ్యాంగ్‌ తర్వాత కేవలం 660 మిలియన్ సంవత్సరాల వయసున్న విశ్వంలో ఉన్న ఓ అసాధారణ వస్తువుపై కొత్త విషయాలను వెల్లడించింది.

హైదరాబాద్ నుంచి ఎంఐటీ వరకు అసాధారణ ప్రయాణం

రోహన్ నాయుడు హైదరాబాద్‌లో పెరిగారు. 18 ఏళ్ల వయసులో ఇంజినీరింగ్ చదువును కొనసాగించకుండా కొత్త దారిని ఎంచుకున్నారు. తన తొలి విమాన టికెట్ కొనుగోలు చేసి సింగపూర్‌లోని యేల్-ఎన్‌యూఎస్ కాలేజీలో చేరారు. అక్కడే ఖగోళ శాస్త్రంపై ఆయన ఆసక్తి మరింత పెరిగింది. తర్వాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఖగోళ శాస్త్రవేత్త చార్లీ కాన్రాయ్ వద్ద పీహెచ్‌డీ చేశారు. ఆయన పరిశోధనలో పాలపుంత సుదూర ప్రాంతాలు, మన గెలాక్సీలో విలీనమైన పురాతన గెలాక్సీలపై అధ్యయనం కూడా ఉంది. ప్రస్తుతం ఎంఐటీలో ఆయన ప్రధానంగా బిగ్‌బ్యాంగ్ తర్వాత ఏర్పడిన తొలి గెలాక్సీలు, తొలి బ్లాక్‌హోల్స్‌పై పరిశోధనలు చేస్తున్నారు.

660 మిలియన్ సంవత్సరాల నాటి రహస్య వస్తువు

నాయుడు నేతృత్వంలోని తాజా అధ్యయనం MoM-B H-1 అనే అసాధారణ వస్తువుపై దృష్టి పెట్టింది. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ పరిశీలనల్లో ఇది అత్యంత ఎరుపుగా, ప్రకాశవంతంగా కనిపించింది. దీని కాంతి లక్షణాలు సాధారణ యువ గెలాక్సీకి భిన్నంగా ఉండటంతో శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన నమూనాను పరిశీలించారు. పరిశోధకుల అంచనా ప్రకారం.. ఈ వస్తువు మధ్యలో వేగంగా పెరుగుతున్న బ్లాక్‌హోల్ ఉండవచ్చు. దాని చుట్టూ అత్యంత దట్టమైన, అల్లకల్లోలమైన వాయు పొర ఉండటంతో మనకు కనిపించే కాంతిలో నక్షత్రాల కంటే బ్లాక్‌హోల్ చుట్టూ ఉన్న పదార్థం ప్రధాన పాత్ర పోషిస్తుండవచ్చు.

‘బ్లాక్‌హోల్ స్టార్’ అంటే ఏమిటి?

శాస్త్రవేత్తలు దీనిని బ్లాక్ హోల్ స్టార్ అనే నమూనాతో అనుసంధానిస్తున్నారు. ఇది సాధారణ నక్షత్రం కాదు. భారీ బ్లాక్‌హోల్ చుట్టూ దట్టమైన వాయువు, పదార్థం ఉండి, ఆ వ్యవస్థ మొత్తం అత్యంత ప్రకాశవంతంగా కనిపించే ఒక సైద్ధాంతిక నిర్మాణం. ఇలాంటి పరిస్థితులు బ్లాక్‌హోల్ చాలా వేగంగా పెరగడానికి అనుకూలంగా ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. విశ్వం పుట్టిన కొద్దికాలానికే బిలియన్ల సూర్యుల ద్రవ్యరాశికి సమానమైన భారీ బ్లాక్‌హోల్స్ ఎలా ఏర్పడ్డాయన్న ప్రశ్నకు ఇది ఒక సంభావ్య వివరణను అందించవచ్చు.

లిటిల్ రెడ్ డాట్స్ రహస్యానికి క్లూ?

జేమ్స్ వెబ్ టెలిస్కోప్ గుర్తించిన లిటిల్ రెడ్ డాట్స్ అనే చిన్న, ఎర్రటి ఖగోళ వస్తువులు శాస్త్రవేత్తలకు ఇప్పటికీ పెద్ద పజిల్‌గా ఉన్నాయి. MoM-BH-1 వంటి బ్లాక్‌హోల్ ఆధిపత్యం ఉన్న వ్యవస్థలు ఈ వస్తువుల స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. రోహన్ నాయుడు సహ రచయితగా ఉన్న మరో 2026 అధ్యయనం కూడా ఇలాంటి బ్లాక్ హోల్ స్టార్ నమూనాలు విశ్వంలోని వివిధ కాలాల్లో కనిపించే అవకాశాన్ని పరిశీలించింది.

Follow Us