Twitter CEO Jack Dorsey: సోషల్ మీడియా విస్త్రృతి పెరిగినప్పటి నుంచి ఎవరైనా తమ అభిప్రాయాలను నేరుగా పంచుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో ఎవరికి నచ్చిన అంశాలను వారు నెట్టింట్లో పెట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్న సోషల్ మీడియాలో కొన్ని సందర్భాల్లో కత్తికి రెండు వైపులా పదునే అన్నట్లు.. మంచితో పాటు చెడు కూడ చోటుచేసుకుంటుంది. ఓవైపు ప్రపంచంలో ఏ మూలన ఉన్న సమాచార మార్పిడి జరుగుతుందని సంతోషించాలా..? ఫేక్ న్యూస్, అభ్యంతరకర కంటెంట్ ప్రజల్లోకి వెళుతోందని బాధపడాలా అన్న పరిస్థితులు ఎదురవుతున్నాయి.
ఈ నేపథ్యంలో భారత్‌లో జరిగిన రైతు అల్లర్ల అనంతరం ట్విట్టర్‌లో అసత్య ప్రచారాలు జరిగాయంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అభ్యంతకరక కంటెంట్‌పై సోషల్ మీడియా సైట్లు తక్షణం స్పందించే యంత్రంగాన్ని ఏర్పాటు చేయాలని భారత్ నూతన ఐటీ నిబంధనలను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే భారత్ ఈ ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే ఈ విషయమై ట్విట్టర్ సీఈఓ స్పందించడం గమనార్హం.
ఇంతకీ ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సే ఏమన్నాడంటే.. తమ వెబ్‌సైట్‌లో కంటెంట్ నియంత్రణ ప్రక్రియ మరింత పారదర్శకతతో ఉండేలా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికల పట్ల నమ్మకం తగ్గుతున్న నేపథ్యంలో ఈ దిశగా ముందుకు వెళతామని డోర్సే శుక్రవారం తెలిపారు. ఇక తమ పొరపాట్లను గుర్తిస్తూ.. చర్యలు చేపట్టడంలో ట్విట్టర్ పురోగతి సాధించిందని డోర్సే పేర్కొన్నారు. మరింత పారదర్శకత, జవాబుదారీ తనం పెంచే దిశగా ట్విట్టర్ ముందుకుసాగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. ట్విట్టర్ మొదలైన గత 12 ఏళ్లుగా ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం ప్రజలు విశ్వాసంతో లేరని తాము అంగీకరిస్తున్నామి, ఇది కేవలం ట్విట్టర్ సమస్య మాత్రమే కాదని.. ప్రతీ సోషల్ మీడియా సంస్థ తమ విశ్వాసాన్ని కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తుందని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే భారత ప్రభుత్వం.. నూతన ఐటీ నిబంధనలను ప్రకటించిన నేపథ్యంలోనే ట్విట్టర్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.