కొత్త టీవీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా.. అతి తక్కువ ధరలో Thomson 65 అంగుళాల 4K QLED
పండుగల సీజన్లో కొత్త స్మార్ట్ టీవీ కొనాలనుకునేవారికి Thomson సంస్థ శుభవార్త అందించింది. భారత మార్కెట్లో 40 అంగుళాల నుంచి 65 అంగుళాల వరకు కొత్త టీవీ మోడళ్లను పరిచయం చేసింది. రూ.11,999 ప్రారంభ ధరతో వస్తున్న ఈ లైనప్‌లో Full HD, 4K QLED, Mini-QD డిస్ప్లే ఆప్షన్లు ఉన్నాయి. పెద్ద స్క్రీన్, మెరుగైన సౌండ్, స్మార్ట్ ఫీచర్లు కోరుకునేవారిని ఆకట్టుకునేలా వీటిని రూపొందించారు.

తక్కువ బడ్జెట్లో టీవీ కొనాలన్నా, ఇంట్లోనే హోమ్ థియేటర్ అనుభూతిని పొందాలన్నా మార్కెట్లో పలు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ పోటీని దృష్టిలో పెట్టుకుని Thomson కొత్త స్మార్ట్ టీవీలను తీసుకొచ్చింది. ఇందులో 55 అంగుళాల Mini-QD 4K మోడల్, 65 అంగుళాల 4K QLED టీవీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ టీవీల ధరలు, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం.
80W సౌండ్ ప్రత్యేకత!
Thomson కొత్త లైనప్‌లో 55 అంగుళాల Mini-QD 4K టీవీ ప్రీమియం ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఇందులో 1.1 బిలియన్ రంగులకు సపోర్ట్ ఇచ్చే డిస్ప్లే, గరిష్ఠంగా 550 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి. HDR10+, Dolby Vision సపోర్ట్‌తో వీడియోలు, సినిమాలను మెరుగైన రంగులు, కాంట్రాస్ట్‌తో వీక్షించే అవకాశం ఉంటుంది. అలాగే 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఉందని సంస్థ పేర్కొంది.
ఆడియో విషయానికి వస్తే, నాలుగు స్పీకర్లతో కూడిన 80W స్టీరియో సౌండ్ సిస్టమ్‌ను అందించారు. Dolby Audio సపోర్ట్ కూడా ఉంది. ఈ టీవీ Google TV ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. Google Assistant ద్వారా వాయిస్ కమాండ్లు ఇవ్వవచ్చు. Chromecast, AirPlay సదుపాయాలతో ఫోన్లోని కంటెంట్‌ను టీవీపై ప్రసారం చేసుకోవచ్చు. ఈ 55 అంగుళాల Mini-QD 4K టీవీ ధర రూ.34,999గా ప్రకటించారు.
65 అంగుళాల QLED
పెద్ద స్క్రీన్ టీవీ కోరుకునేవారి కోసం Thomson 65 అంగుళాల 4K QLED JioTele OS మోడల్‌ను తీసుకొచ్చింది. ఇందులో 1.1 బిలియన్ రంగులకు సపోర్ట్, బెజెల్-లెస్ డిజైన్, AirSlim డిజైన్, 450 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి. JioTele OSతో పనిచేసే ఈ టీవీలో 300కు పైగా ఉచిత లైవ్ టీవీ ఛానళ్లు, 300కు పైగా JioGames అందుబాటులో ఉంటాయని సంస్థ తెలిపింది.
సౌండ్ కోసం 48W స్పీకర్లు, స్పోర్ట్స్ మోడ్, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, Bluetooth 5.0 సదుపాయాలు ఉన్నాయి. వాయిస్ కంట్రోల్ రిమోట్‌తో పాటు మూడు HDMI పోర్టులు, రెండు USB పోర్టులను అందించారు. ఈ మోడల్ ధర రూ.42,999.
బడ్జెట్ వినియోగదారుల కోసం 40, 43 అంగుళాల Full HD స్మార్ట్ టీవీలను కూడా పరిచయం చేశారు. వీటిలో FHD LED డిస్ప్లే, A+ గ్రేడ్ ప్యానెల్, 300 నిట్స్ బ్రైట్నెస్, 178 డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్ ఉన్నాయి. రెండు మోడళ్లలోనూ 36W స్టీరియో సౌండ్, HDMI, USB, VGA, AV పోర్టులు, చైల్డ్ లాక్ ఫీచర్లు ఉన్నాయి.
