AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైల్వేలో 1688 ఉద్యోగాలకు RRB NTPC అండర్ గ్రాడ్యుయెట్‌ నోటిఫికేషన్‌.. ఇంటర్ పాసైతే చాలు!

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) NTPC అండర్‌గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి CEN 07/2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 1,688 పోస్టులను భర్తీ చేయనుండగా, సికింద్రాబాద్‌ జోన్‌లో 72 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్మీడియట్‌ అర్హత కలిగిన అభ్యర్థులు కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్ పోస్టులకు నవంబరు 13, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు..

రైల్వేలో 1688 ఉద్యోగాలకు RRB NTPC అండర్ గ్రాడ్యుయెట్‌ నోటిఫికేషన్‌.. ఇంటర్ పాసైతే చాలు!
RRB NTPC Undergraduate Posts
Srilakshmi C
|

Updated on: Oct 16, 2026 | 6:45 AM

Share

రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ మరో తీపికబురు అందించింది. రైల్వే శాఖ ఆధ్వర్యంలోని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నాన్‌-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్‌ (అండర్‌ గ్రాడ్యుయేట్‌) పోస్టుల భర్తీకి CEN 07/2026 అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో మొత్తం 1688 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సికింద్రాబాద్‌ రైల్వే జోన్‌ పరిధిలో 72 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్మీడియట్‌ అర్హత కలిగిన అభ్యర్థులు నవంబరు 13, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు

  • కమర్షియల్‌ కమ్‌ టికెట్‌ క్లర్క్‌ పోస్టుల సంఖ్య: 700
  • అకౌంట్స్‌ క్లర్క్‌ కమ్‌ టైపిస్ట్‌ పోస్టుల సంఖ్య: 200
  • జూనియర్‌ క్లర్క్‌ కమ్‌ టైపిస్ట్‌ పోస్టుల సంఖ్య: 600
  • ట్రైన్స్‌ క్లర్క్‌ పోస్టుల సంఖ్య: 188

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి (+2 స్టేజ్‌) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం 50 శాతం మార్కులు సాధించాలి. అయితే, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు, 12వ తరగతి కంటే ఉన్నత విద్యార్హత కలిగిన అభ్యర్థులకు నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనల ప్రకారం కనీస మార్కుల విషయంలో మినహాయింపులు వర్తించవచ్చు. అభ్యర్ధుల వయోపరిమితి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. వయస్సును లెక్కించే తేదీ, వయోసడలింపుల వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

RRB NTPC అండర్ గ్రాడ్యుయెట్‌ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

అభ్యర్థుల ఎంపికను కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు (CBT-1, CBT-2), ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా నిర్వహిస్తారు. అభ్యర్థులు రెండు దశల కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలకు సిద్ధం కావాలి. సీబీటీ 1, సీబీటీ 2 పరీక్షలు నిర్వహిస్తారు. ఎంపికైన వారికి కమర్షియల్‌ కమ్‌ టికెట్‌ క్లర్క్‌ పోస్టులకు నెలకు రూ.21,700, అకౌంట్స్‌ క్లర్క్‌ కమ్‌ టైపిస్ట్‌ పోస్టులకు నెలకు రూ.19,900, జూనియర్‌ క్లర్క్‌ కమ్‌ టైపిస్ట్‌ పోస్టులకు నెలకు రూ.19,900, ట్రైన్స్‌ క్లర్క్‌ పోస్టులకు నెలకు రూ.19,900 చొప్పున జీతంగా చెల్లిస్తారు. ప్రాథమిక వేతనంతో పాటు నిబంధనల ప్రకారం వర్తించే ఇతర అలవెన్సులు కూడా లభిస్తాయి.

పరీక్ష విధానం

మొదటి దశ పరీక్ష (CBT-1). ఇది స్క్రీనింగ్‌ పరీక్షగా ఉంటుంది. మొత్తం 100 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయిస్తారు. గణితం – 30 ప్రశ్నలు, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ – 30 ప్రశ్నలు, జనరల్‌ అవేర్‌నెస్‌ – 40 ప్రశ్నలు చొప్పున ప్రశ్నలు అడుగుతారు. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు చొప్పున నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.

రెండో దశ పరీక్ష (CBT-2). మొదటి దశలో అర్హత సాధించిన వారిని రెండో దశ పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు. మొదటి దశలో సాధించిన మార్కులు, నార్మలైజేషన్‌, సంబంధిత ఎంపిక నిబంధనల ఆధారంగా అభ్యర్థులను రెండో దశకు ఎంపిక చేస్తారు. ఈ పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలు, 120 మార్కులు ఉంటాయి. గణితం – 50 ప్రశ్నలు, రీజనింగ్‌ – 35 ప్రశ్నలు, జనరల్‌ అవేర్‌నెస్‌ – 35 ప్రశ్నలు చొప్పున ఇస్తారు. ఈ పరీక్షలోనూ ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు చొప్పున కోత విధిస్తారు.

దరఖాస్తు ఫీజు కింద జనరల్‌ / యూఆర్‌ / ఇతర అభ్యర్థులు రూ.500 చొప్పున చెల్లించాలి. మొదటి దశ CBTకు హాజరైన తర్వాత బ్యాంకు ఛార్జీలు మినహాయించి రూ.400 తిరిగి చెల్లించాలి. ఎస్సీ / ఎస్టీ / మాజీ సైనికోద్యోగులు / దివ్యాంగులు / మహిళలు / ట్రాన్స్‌జెండర్లు / మైనారిటీలు / ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (EBC) అభ్యర్ధులు రూ.250 చొప్పున చెల్లించాలి. మొదటి దశ CBTకు హాజరైన తర్వాత బ్యాంకు ఛార్జీలు మినహాయించి పూర్తి ఫీజును తిరిగి చెల్లిస్తారు.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభ తేదీ: అక్టోబరు 15, 2026.
  • దరఖాస్తులకు చివరి తేదీ: నవంబరు 13, 2026.
  • ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: నవంబరు 15, 2026.
  • దరఖాస్తుల సవరణ విండో: నవంబరు 16 నుంచి 25, 2026 వరకు
  • దరఖాస్తు సవరణ ఫీజు: రూ.250

RRB NTPC అండర్ గ్రాడ్యుయెట్‌ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us