టెక్నాలజీ దినదినాభివృద్ధి చెందుతోంది. ఈ టెక్నాలజీని అందిపుచ్చుకుని ప్రపంచ దేశాలు సైతం అంతకంటే వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. గత కొన్నేళ్లుగా మన దేశంలోనూ సాంకేతిక విప్లవం నడుస్తోంది. ముఖ్యంగా ఇంటర్నెట్ సౌకర్యం దేశంలో మారుమూల గ్రామాలకు సైతం విస్తరించింది. ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ ఉండటం, ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఏం జరిగినా ఇట్టే తెలిసిపోతోంది. అయితే, ఈ ఇంటర్నెట్ సమాచార ప్రసారానికి ఎంత ఉపయోగపడుతుందో.. వ్యక్తుల భద్రతకు అంతకు మించిన ముప్పుగా పరిణమిస్తోంది. ఇంటర్నెట్ ఆధారంగా.. కొందరు సైబర్ క్రిమినల్స్ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దోచుకుంటున్నారు. ఇలాంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉండేందుకు.. ప్రజలకు కీలక సూచనలు చేస్తున్నారు సాంకేతిక నిపుణులు. ఇందులో ముఖ్యంగా.. మొబైల్ యూజర్లు రాత్రివేళ పడుకునే సమయంలో మొబైల్ డేటాను ఆఫ్ చేయాలని సూచిస్తున్నారు.
వై ఫై లేదా అపరిమిత డేటా ప్లాన్‌ను కలిగి ఉన్నవారు.. మొబైల్ డేటాను 24 గంటల ఆన్‌లోనే ఉంచుతారు. కానీ, అలా చేయొద్దని సూచిస్తున్నారు నిపుణులు. మొబైల్‌లోని యాప్‌లు ఇంటర్నెట్ ఆధారంగానే రన్ అవుతుంటాయి. అయితే, డేటా ఆన్ చేసి ఉండటం వలన నైట్ టైమ్‌లో కూడా అవి పని చేస్తుంటాయి. ఇక కొన్ని యాప్‌లలో బ్యాక్‌గ్రౌండ్ మైక్రోఫోన్‌ను ఉపయోగిస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. ఇదే అంశంపై ట్విట్టర్ ఇంజనీర్ ట్వీట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ముఖ్యంగా వాట్సాప్ బ్యాక్‌గ్రౌండ్ మైక్రోఫోన్‌ను ఉపయోగించడం చర్చనీయాంశమైంది. అయితే, ఈ సమస్యకు కారణం ఆండ్రాయిడే అని వాట్సాప్ యాజమాన్యం ఆరోపించింది. ఇక గూగుల్ ఈ బగ్‌ను గుర్తించినట్లు వెల్లడించింది. సో.. వాట్సాప్ మాత్రమే కాదు, మీరు వినియోగించే ఏ యాప్ అయినా సరే బ్యాక్‌గ్రౌండ్ మైక్రోఫోన్ వినియోగిస్తే, బ్యాక్‌గ్రౌండ్ కెమెరా రికార్డింగ్‌ను వినియోగిస్తే.. మీ పర్సనల్ డేటా మొత్తం చోరీకి గురవడం ఖాయం. అందుకే నైట్ టైమ్‌లో మొబైల్ నెట్ లేదా వై ఫైని ఆఫ్ చేయడం ఉత్తమం.
రాత్రివేళ డేటాను ఆఫ్ చేయడం వలన గోప్యతను కాపాడుకోవడమే కాకుండా, ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మొదటగా మీ ప్రైవసీకి రక్షణ ఉంటుంది. రెండవి మీ డేటా కూడా సేవ్ అవుతుంది. ఎలాంటి పని లేకుండా డేటాను వినియోగించడం కంటే.. డేటాను సేవ్ చేసుకోవడం ఉత్తమం. సోషల్ మీడియా యాప్‌ల నోటిఫికేషన్ల సమస్య ఉండదు. ప్రశాంతంగా నిద్రపోవచ్చు.
రాత్రివేళ డేటా ఆఫ్ చేయడం వలన ఆరోగ్యం కూడా మెరగువుతుంది. అదెలాగంటే.. డేటా ఆన్‌లో ఉంటే ఆయా యాప్‌ల నోటిఫికేషన్లు మీ నిద్రను పాడు చేస్తాయి. సరైన నిద్ర లేకపోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే.. రాత్రి వేళ మర్చిపోకుండా డేటాను ఆఫ్ చేయడం ఉత్తమం.
మరిన్ని టెక్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..