Mobile Recharge Prices: న్యూ ఇయర్ వేళ ప్రజలకు షాక్.. భారీగా పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు.. ఎంతంటే..?
కొత్త ఏడాదిలో మొబైల్ రీఛార్జ్ ధరల మోత మోగనుంది. భారీగా రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచేందుకు టెలికాం కంపెనీలు సిద్దమవుతున్నాయి. 5జీ నెట్‌వర్క్‌ను అన్ని ప్రాంతాలకు విస్తరించాల్సిన అవకాశం ఉన్న క్రమంలో టెలికాం కంపెనీలపై భారం పడుతుంది. దీనిని కవర్ చేసుకునేందుకు ప్రజలపై భారం వేయనున్నాయి.

కొత్త సంవత్సరం వస్తున్న క్రమంలో టెలికాం కంపెనీలు తమ ప్లాన్ల ధరల్లో అనేక మార్పులు చేస్తున్నాయి. న్యూ ఇయర్ సందర్భంగా కస్టమర్లను ఆకర్షించేందుకు బంపర్ ఆఫర్లు తీసుకొస్తున్నాయి. వివిధ రకాల ప్లాన్లను కస్టమర్లకు అందుబాటులోకి తెస్తున్నాయి. తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలు కల్పించే ప్లాన్లను కొత్త ఏడాది ఆఫర్ కింద లాంచ్ చేస్తున్నాయి. దీంతో పాటు నూతన సంవత్సరంలో తమ వ్యాపారాన్ని పెంచుకునేందుకు టెలికాం కంపెనీలన్నీ సిద్దమైనట్లు తెలుస్తోంది. అందులో భాగంగా మొబైల్ వినియోగదారులపై భారీగా భారం మోపేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నాయి. అందేంటో ఇప్పుడు చూద్దాం.
ప్రజలపై మరింత భారం
కొత్త ఏడాదిలో మొబైల్ రీఛార్జ్ ధరలు పెరగనున్నాయి. ఈ మేరకు టెలికాం కంపెనీలు సూచనలు జారీ చేస్తున్నాయి. పలు యూపీఐ ఫ్లాట్‌ఫామ్స్‌లో త్వరలో రీఛార్జ్ ధరలు పెరగనున్నాయనే అలర్ట్‌లు వస్తున్నాయి. త్వరలో రీఛార్జ్ ధరలు పెరుగుతాయని, ఇప్పుడే రీఛార్జ్ చేసుకుంటే డబ్బులు ఆదా అవుతాయంటూ యూపీఐ యాప్స్‌లో అలర్ట్‌లు వస్తున్నాయి. దీంతో త్వరలోనే రీఛార్జ్ ధరలు పెరుగుతాయనే వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. 5జీ విస్తరణ, నిర్వహణ భారం కారణంగా టెలికాం కంపెనీలు రీఛార్జ్ ధరలను ఎప్పటినుంచో పెంచాలని ప్రణాళికలు వేసుకుంటున్నాయి. ఇప్పుడు కొత్త ఏడాది వస్తుండటంతో ప్రజలపై భారం వేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
12 శాతం వరకు పెంపు
రీఛార్జ్ ధరలను 10 నుంచి 12 శాతం వరకు టెలికాం కంపెనీలు పెంచనున్నాయని తెలుస్తోంది. ప్రముఖ టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలన్నీ రీఛార్జ్ ధరలను భారీగా పెంచనున్నాయి. డిసెంబర్ చివరి వారంలో లేదా జనవరి తొలివారంలో రీఛార్జ్ ధరల పెంపును ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఏడాది రీచార్జ్ ధరలను భారీగా పెంచిన కంపెనీలు.. ఆ తర్వాత కాస్త శాంతించాయి. ఇప్పుడు మరోసారి ఛార్జీల మోత వేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ రోజుల్లో ప్రతీఒక్కరి దగ్గర మొబైల్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఇప్పటికే ప్రైవేట్ కంపెనీల రీఛార్జ్ ధరలు అధికంగా ఉండటంతో సామాన్యులకు భారంగా మారింది. ఇప్పుడు మరింత పెంచితే రీఛార్జ్ ధరలు సామాన్యులకు గుదిబండగా మారే అవకాశముంది.




