
అమెరికాలో సోషల్ మీడియా వ్యసనంపై దాఖలైన కీలక కేసులో టెక్ దిగ్గజాలు గూగుల్, మెటాకు లాస్ ఏంజిల్స్ జ్యూరీ గట్టి షాక్ ఇచ్చింది. ఈ కేసులో బాధితురాలికి 3 మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని జ్యూరీ బుధవారం తీర్పు వెలువరించింది. ఈ తీర్పు భవిష్యత్తులో టెక్ కంపెనీలపై నమోదవుతున్న వేలాది ఇలాంటి కేసులపై ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. ఈ కేసులో భాగమైన 20 ఏళ్ల యువతి చిన్న వయసులోనే సోషల్ మీడియా యాప్‌లకు బానిస అయ్యానని వాదించింది. ముఖ్యంగా యాప్‌లలో వినియోగదారులను ఎక్కువసేపు ఆకర్షించే విధంగా రూపొందించిన డిజైన్ కారణంగానే ఈ వ్యసనం పెరిగిందని ఆమె ఆరోపించింది. విచారణలో వాదులు కంటెంట్ కంటే ప్లాట్‌ఫారమ్‌ల డిజైన్‌పై దృష్టి సారించడం గమనార్హం. దీంతో కంపెనీలు బాధ్యత నుంచి తప్పించుకోవడం కష్టమైందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఈ కేసులో స్న్యాప్ ఇంక్, టిక్‌టాక్ కూడా ప్రతివాదులుగా ఉన్నప్పటికీ, విచారణ ప్రారంభానికి ముందే అవి బాధితురాలితో రాజీ కుదుర్చుకున్నాయి. అయితే ఆ ఒప్పందాల వివరాలు వెల్లడించలేదు. తీర్పు వెలువడిన తర్వాత మార్కెట్‌లో పెద్దగా ప్రభావం కనిపించకపోయినా, మెటా షేర్లు స్వల్పంగా పెరగగా, ఆల్ఫాబెట్ షేర్లు కూడా స్థిరంగా నిలిచాయి. ఈ తీర్పుతో టెక్ కంపెనీలపై ఉన్న విమర్శలు మరింత పెరిగే అవకాశముంది. గత కొన్నేళ్లుగా అమెరికాలో పిల్లలు, టీనేజర్ల భద్రత విషయంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదిక ప్రకారం అమెరికాలో కనీసం సగం మంది టీనేజర్లు ప్రతిరోజూ యూట్యూబ్ లేదా ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగిస్తున్నారు.
ఇదే సమయంలో సోషల్ మీడియా వినియోగంపై నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను తీసుకువస్తున్నాయి. పాఠశాలల్లో సెల్‌ఫోన్ వినియోగంపై పరిమితులు విధించడం, సోషల్ మీడియా ఖాతాలు తెరవడానికి వయస్సు ధృవీకరణను తప్పనిసరి చేయడం వంటి చర్యలు అమల్లోకి వస్తున్నాయి. అయితే టెక్ కంపెనీల మద్దతు ఉన్న నెట్ ఛాయిస్ వంటి వాణిజ్య సంస్థలు ఈ నియమాలను కోర్టులో సవాల్ చేస్తున్నాయి. మొత్తంగా ఈ తీర్పు సోషల్ మీడియా కంపెనీల బాధ్యతపై కీలక మలుపుగా భావిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని కఠిన నియంత్రణలు, చట్టపరమైన చర్యలకు ఇది దారితీయవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి