
ఈమధ్య కాలంలో సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గతంలో ప్రతి జేబులో రంగుంది అని ఒక యాడ్ వచ్చేది. అంటే ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందన మాట. ఇక ఫోన్‌లో సిమ్ యూసేజ్ ఎక్కువైపోయింది. అవసరం అయిన వారు, అవసరం లేని వారు అందరూ సిమ్ కార్డులను ఉపయోగిస్తున్నారు. దీంతో సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు ఎక్కవైపోయాయి. వీటిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఎలాంటి స్మార్ట్ ఫోన్ ఉపయోగించినా వారికి ఒక యూనిక్ ఐడీని ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో అతను ఎన్ని సిమ్ కార్డులు అందులో వేస్తున్నారో ఇట్టే పట్టేసేలా ఇది దోహద పడుతుంది. ఈ సంవత్సరం చివరి నాటికి దీనిని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. మన దేశంలో ప్రస్తుతం ఉన్న జనాభా కంటే సిమ్ కార్డులే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. టెలికాం సేవలు విస్తరించే కొద్దీ సైబర్ నేరగాళ్లలు దీనిని అసాంఘీక చర్యలకు, ఆన్లైన్ నేరాలకు పాల్పడేందుకు వినియోగిస్తున్నారు. మన దేశంలో 2022 డిశంబర్ నాటికి 114 కోట్ల మొబైల్ ఫోన్లు ఉన్నట్లు గుర్తించారు అధికారులు.
ప్రైవేట్ టెలికాం కంపెనీల సిమ్ కార్డులు 102కోట్లు కాగా, ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డు ఉపయోగిస్తున్న వారు 10.7 కోట్లుగా గుర్తించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన టెలికాం సంస్థల నిబంధనల ప్రకారం ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్ మినహా మిగిలిన రాష్ట్రాల్లో ఒక్కో వ్యక్తి సగటున 9 సిమ్ కార్డులు వినియోగించవచ్చు. అదే జమ్మూ కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో అయితే వీటి పరిమితి 6గా నిర్ణయించారు. సాధారణంగా సైబర్ నేరగాళ్లు ప్రైవేట్ కంపెనీల సిమ్ కార్డులను కొనుగోలు చేసి నేరాలకు పాల్పడుతున్నారు. దీనికి కారణం ప్రైవేట్ టెలికాం సంస్థలు ప్రభుత్వ నిబంధనలను పాటించకపోవడమే అంటున్నారు సాంకేతిక నిపుణులు. మన దేశంలో 2022 సంవత్సరంలో నమోదైన సైబర్ నేరాల్లో 65శాతం నకిలీ సిమ్ కార్డుల ద్వారా జరిగినవే అని గుర్తించారు. సోషల్ మీడియా ద్వారా 12 శాతం ఆన్లైన్ మోసాలకు పాల్పడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అందుకే 14 అంకెలతో యూనిక్ ఐడీ నంబర్‌ను తీసుకురావాలని నిర్ణయించింది కేంద్రం.
సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే వేధింపులు, ఈ కామర్స్ సేవల ద్వారా జరిగే ఆన్లైన్ మోసాలను అడ్డుకట్ట వేయడం కోసం కేంద్ర హోం శాఖ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగానే 14 అంకెల యూనిక్ ఐడీని తీసుకురావాలని నిర్ణయించింది. ఒక వ్యక్తికి ఎన్ని ఫోన్లు ఉన్నా ఒకే యూనిక్ ఐడీని కేటాయించాలని ప్రణాళికలు రచిస్తోంది. స్మార్ట్ ఫోన్ ఉపయోగించే ముందు వినియోగదారుల ఫోన్‌కు మెసేజ్ పంపించి ఓటీపీ వచ్చిన తరువాత యూనిక్ ఐడీని జారీ చేయాలని భావిస్తోంది. అలాగే సిమ్‌కార్డు మోసాలను అరికట్టేందుకు కేంద్ర టెలికాం రంగానికి చెందిన ‘అస్త్ర’ సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేయనున్నారు. మొబైల్ కనెక్షన్ తీసుకునే సమయంలో ఇచ్చిన గుర్తింపు ఐడీ కార్డులు, ఫొటోలు సరగ్గా ఉన్నాయో, లేదో గుర్తించడంతోపాటు ఆ వ్యక్తికి ఇదివరకూ ఎప్పుడైనా యూనిక్ ఐడీ నంబరు కేటాయించారా అన్నది ఈ సాఫ్ట్ వేర్ గుర్తిస్తుంది. తద్వారా సైబర్ నేరగాళ్లు ఎక్కడ నుంచి ఏ స్మార్ట్ ఫోన్ నుంచి ఏ సిమ్ కార్డు సహాయంతో నేరాలకు, వేధింపులకు పాల్పడుతున్నారో అతి సులువుగా గుర్తించేందుకు అవకాశం ఉంటుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..