Ancovax: మనుషులకు మాత్రమే కాదు, ఇప్పుడు జంతువులకు కూడా కోవిడ్ -19 టీకాలు వచ్చేశాయి. కోవిడ్ బారిన పడి జంతువు సైతం చనిపోయిన దాఖలాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జంతువుల సంరక్షణ కోసం పరిశోధకులు కోవిడ్ 19 వ్యాక్సీన్‌ను తయారు చేశారు. ప్రత్యేకంగా జంతువుల కోసం తయారు చేసిన మొట్ట మొదటి స్వదేశీ కోవిడ్ 19 వ్యాక్సీన్ ‘అనోకోవాక్స్’ను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రారంభించారు. హర్యానాకు చెందిన అగ్రి రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(ICAR), నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్విన్స్(NRC) ఈ వ్యాక్సీన్‌ను అభివృద్ధి చేసింది. అలాగే, జంతువుల్లో SARS-CoV-2 కి వ్యతిరేకంగా యాంటీబాడీలు పెరిగాయా? లేదా? అనేది తెలుసుకోవడం కోసం రూపొందించిన ‘CAN-CoV-2 ELISA’ కిట్‌ను కూడా తయారు చేశారు పరిశోధకలు. ఈ కిట్‌ను కూడా కేంద్ర మంత్రి తోమర్ విడుదల చేశారు.
అనోకోవాక్స్ అంటే ఏమిటి?
అనోకోవాక్స్ జంతువుల కోసం క్రియారహితం చేయబడిన SARS-CoV-2 డెల్టా కోవిడ్-19 వ్యాక్సిన్. అనోకోవాక్స్ ద్వారా ప్రేరేపించబడిన రోగనిరోధక శక్తి SARS-CoV-2 రూపాంతరాలైన డెల్టా, ఓమిక్రాన్ వేరియంట్‌లను సమర్థంగా ఎదుర్కొంటుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) ఒక ప్రకటనలో తెలిపింది.
జంతువుల కోసం రూపొందించి తొలి స్వదేశీ వ్యాక్సీన్ ప్రత్యేకత ఇదే..
కొత్త వ్యాక్సిన్‌లో ఆల్హైడ్రోజెల్‌తో క్రియారహితం చేయబడిన SARS-CoV-2 (డెల్టా) యాంటిజెన్‌ను అనుబంధంగా కలిగి ఉంది. ICAR ప్రకటన ప్రకారం ఇది కుక్కలు, సింహాలు, చిరుతలు, ఎలుకలు, కుందేళ్ళకు కూడా సురక్షితం.
కేంద్ర మంత్రి కామెంట్స్..
కోవిడ్-19 వ్యాక్సిన్, డయాగ్నస్టిక్ కిట్‌లను వర్చువల్ లాంచ్ చేసిన తర్వాత తోమర్ మాట్లాడారు. ‘‘విజ్ఞానవేత్తల అవిశ్రాంతమైన కృషి, పరిశోధనల కారణంగా భారతదేశం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేకుండా, స్వంత వ్యాక్సీన్‌లను అభివృద్ధి చేయడంలో స్వయం ప్రతిపత్తిని కలిగి ఉంది’’ అని పేర్కొన్నారు. ఇది నిజంగా పెద్ద విజయం అని పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం యాంటీజెన్ కిట్‌ల తయారీకి అవసరమైన వసతులు దేశంలో లేవు. భారత్‌లో తొలిసారి తయారు చేసిన ఈ టిక్‌పై పేటెంట్ పొందేందుకు ఇప్పటికే అప్లై చేయడం జరిగింది. ఇక ICAR ప్రకటన ప్రకారం.. కుక్కల్లో యాంటీబాడీస్‌ను గుర్తించడానికి సరైన కిట్‌లు మార్కెట్‌లో అందుబాటులో లేవు.
ఇక సుర్రా ELISA కిట్ ద్వారా బహుళ జంతు జాతులలో ‘ట్రిపనోసోమా ఎవాన్సీ’ ఇన్ఫెక్షన్‌కు తగిన రోగనిర్ధారణ పరీక్ష కూడా ప్రారంభించారు. ట్రిపనోసోమా ఎవాన్సీ వల్ల పశువులు, జంతువుల్లో సుర్రా వ్యాది.. హేమోప్రొటోజోవాన్ వ్యాధులలో ఒకటి. భారతదేశంలోని అన్ని వ్యవసాయ-వాతావరణ ప్రాంతాలలో ఈ వ్యాధి ప్రబలంగా ఉంది. దేశంలో, సుర్రా కారణంగా పశువుల ఉత్పాదకతకు సంవత్సరానికి రూ. 44,740 మిలియన్ల నష్టం వాటిల్లుతుందని ICAR పేర్కొంది. ఇకపోతే గుర్రాల మధ్య తల్లిదండ్రుల విశ్లేషణ కోసం శక్తివంతమైన జెనోమిక్ టెక్నాలజీ అయిన ఈక్విన్ DNA పేరెంటేజ్ టెస్టింగ్ కిట్‌ను కూడా మంత్రి తోమర్ ప్రారంభించారు.