యూట్యూబ్ లో వీడియోలను అందరూ ఉచితంగా చూడవచ్చు. అయితే మధ్యలో ప్రకటనలు వస్తుంటాయి. ఈ ప్రకటనలు లేకుండా చూడాలంటే కొంత సొమ్ము చెల్లించి ప్రీమియం సబ్ స్క్రిప్షన్ తీసుకోవాలి. కానీ యూజర్లు డబ్బులు కట్టకుండా ప్రకటన రహిత వీడియోలు చూడటానికి యూట్యూబ్ యాజమాన్యమైన గూగుల్ చర్యలు తీసుకుంటోంది. యూట్యూబ్ యూజర్లకు మెరుగైన సేవలు అందించేందుకు, సభ్యులను పెంచుకునేందుకు గూగుల్ కార్యాచరణ ప్రారంభించింది. దీనిలో భాగంగా ప్రకటన రహిత (ప్రకటనలు లేని) వీడియోలు చూసే అవకాశం కల్పిస్తుంది. ఈ ప్రయోగాత్మక ఫీచర్ ను అర్జెంటీనా, కెనడా, బ్రెజిల్, మెక్సికో, టర్కీ, అమెరికా దేశాల్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ దేశాల్లో వచ్చిన ఫీడ్ బ్యాక్ నుంచి మరింత విస్తరించేందుకు సన్నాహాలు చేస్తోంది.
యూట్యూబ్ ప్రీమియం సబ్ స్క్రైబర్లు నెలకు పది వరకూ ప్రకటన రహిత వీడియో వీక్షణలను పంచుకోవచ్చు. ఈ భాగస్వామ్య వీక్షణలను స్వీకరించేవారు ఎటువంటి ప్రకటనలు లేకుండా వీడియో కంటెంట్ ను చూడవచ్చు. తద్వారా వారికి యూట్యూబ్ ప్రీమియం ప్రయోజనాలపై అవగాహన కలుగుతుంది. అయితే గూగుల్ ఈ ప్రకటన రహిత వీడియోలను ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చు.