Seven Volcanic Summits: సెవెన్ సమ్మిట్స్ ఛాలెంజ్.. ప్రపంచ రికార్డ్‌లను సాధించిన భూపతిరాజు అన్మిష్ వర్మ
Bhupathiraju Anmish Verma: తెలుగు కుర్రాడు అగ్ని పర్వతాల అధిరోహించాడంలో ప్రపంచ రికార్డు సృష్టించాడు. 91 రోజుల్లో ఏడు అగ్నిపర్వత శిఖరాలను అధిరోహించిన ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వ్యక్తిగా చరిత్ర నెలకొల్పాడు.ఏడు అగ్నిపర్వత శిఖరాలు & ఏడు శిఖరాలను పూర్తి చేసిన ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ పర్సన్‌గా నిలిచాడు. ఈ రెండు రకాల శిఖరాలు అధిరోహించడం ప్రపంచంలో పర్వతారోహకులకు అత్యంత ప్రతిష్టాత్మకమైన అచీవ్‌మెంట్ అని చెబుతారు.

విశాఖకు చెందిన భూపతిరాజు అన్మిష్ వర్మ అద్భుతాలు చేస్తున్నాడు. మార్షల్ ఆర్ట్స్‌లో ప్రపంచ చాంపియన్ అయిన అతడు.. పర్వతారోహణలోనూ కొత్త రికార్డులు లిఖిస్తూ ముందుకు సాగుతున్నాడు. తాజాగా ఒక గొప్ప చారిత్రాత్మక ఘనత సాధించాడు భూపతిరాజు అన్మిష్ వర్మ.. ప్రఖ్యాత 7 వోల్కానిక్ సమ్మిట్స్( 7 ఖండాలలో ఎత్తైన అగ్ని పర్వాతాలు) అధిరోహణ చేసి, కొత్త ప్రపంచ రికార్డులను సృష్టించారు. అతి చిన్న వయస్సులో, అతి తక్కువ సమయంలో… 7 వాల్కానిక్ సమ్మిట్ చాలెంజ్ పూర్తి చేసిన వ్యక్తిగా తన పేరును చరిత్రలో లిఖించుకున్నాడు. కేవలం 91 రోజుల్లోనే ఈ సమ్మిట్స్‌ను పూర్తి చేసి, ఇంతకుముందు ఉన్న 183 రోజుల రికార్డును అన్మిష్ వర్మ బ్రేక్ చేశారు. అంతకు ముందే 7 సమ్మిట్స్ (7 పర్వత శిఖరాలు) కంప్లీట్ చేశాడు. దీంతో సెవెన్ వోల్కానిక్ సమ్మిట్స్ అండ్ సెవెన్ సమ్మిట్స్ రెండింటినీ అత్యంత వేగంగా పూర్తి చేసిన వ్యక్తిగా, అలాగే రెండు అత్యంత కష్టమైన మౌంటెనీరింగ్ ఛాలెంజ్‌లను అత్యంత తక్కువ సమయంలో పూర్తి చేసిన రికార్డ్ భూపతిరాజు అన్మిష్ వర్మ పేరుపై నమోదైంది. ఈ ఘనతకు గానూ త్వరలో ఆయన గిన్నీస్ బుక్ అందుకునే అవకాశం ఉంది.
View this post on Instagram
అచంచల సంకల్పంతో విజయాల శిఖరాలను అధిరోహించిన అన్మిష్ వర్మ.. ఈ అసాధారణ సాహసాలతో మౌంటెనీరింగ్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఎన్నో కఠిన పరిస్థితులను ఎదుర్కొంటూ, అన్మిష్ వర్మ తన అంకితభావం, సంకల్పంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకున్నారు.
7 సమ్మిట్స్ (7 శిఖరాలు):
ప్రపంచంలోని ఏడు ఖండాల్లో అత్యంత ఎత్తైన పర్వత శిఖరాలను “7 Summits” అని అంటారు. ఇవి:
- ఏషియా – మౌంట్ ఎవరెస్ట్ (8,848 మీటర్లు)
- దక్షిణ అమెరికా – ఆకోంకాగువా (6,961 మీటర్లు)
- ఉత్తర అమెరికా – డెనాలి (మౌంట్ మెక్‌కిన్లీ) (6,190 మీటర్లు)
- ఆఫ్రికా – కిలిమంజారో (5,895 మీటర్లు)
- యూరప్ – ఎల్‌బ్రస్ (5,642 మీటర్లు)
- ఆస్ట్రేలియా/ఓషియానియా – కొస్సియూజ్కో (2,228 మీటర్లు) లేదా కర్జెన్స్ పిరమిడ్ (4,884 మీటర్లు)
- అంటార్కిటికా – విన్సన్ మాస్ (4,892 మీటర్లు)
7 వొల్కానిక్ సమ్మిట్స్ (7 అగ్నిపర్వత శిఖరాలు):
ప్రపంచంలోని ఏడు ఖండాల్లో అత్యంత ఎత్తైన అగ్నిపర్వతాలను “7 Volcanic Summits” అంటారు. ఇవి:
- ఆసియా – డామావాండ్ (ఇరాన్, 5,671 మీటర్లు)
- దక్షిణ అమెరికా – ఓజోస్ డెల్ సలాడో (చిలీ/అర్జెంటీనా, 6,893 మీటర్లు)
- ఉత్తర అమెరికా – పికో డి ఓరిజాబా (మెక్సికో, 5,636 మీటర్లు)
- ఆఫ్రికా – కిలిమంజారో (టాంజానియా, 5,895 మీటర్లు)
- యూరప్ – ఎల్‌బ్రస్ (రష్యా, 5,642 మీటర్లు)
- ఓషియానియా – గిలువె (పాపువా న్యూ గినియా, 4,367 మీటర్లు)
- అంటార్కిటికా – సిడ్లీ (4,285 మీటర్ల)

వీటితో పాటు, అన్మిష్ వర్మ దక్షిణ ధ్రువానికి స్కీయింగ్ చేసి, ఈ వచ్చే ఏప్రిల్‌లో ఉత్తర ధ్రువానికి యాత్రకు రెడీ అవుతున్నాడు. అచంచల ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న ఈ తెలుగు కుర్రాడికి మనం కూడా ఆల్ దీ బెస్ట్ చెప్పేద్దామా…!
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
