Virat Kohli : విరాట్ విశ్వరూపం.. 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. ఫోర్లు, సిక్సర్లతోనే 50 కొట్టిన కోహ్లీ
Virat Kohli : సుమారు 15 ఏళ్ల తర్వాత విజయ్ హజారే ట్రోఫీలోకి అడుగుపెట్టిన టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ, దేశవాళీ క్రికెట్లో పరుగుల సునామీ సృష్టిస్తున్నాడు. మొదటి మ్యాచ్‌లోనే అద్భుతమైన సెంచరీతో పలకరించిన కోహ్లీ, రెండో మ్యాచ్‌లోనే అంతకు మించిన జోరును ప్రదర్శించాడు.

Virat Kohli : సుమారు 15 ఏళ్ల తర్వాత విజయ్ హజారే ట్రోఫీలోకి అడుగుపెట్టిన టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ, దేశవాళీ క్రికెట్లో పరుగుల సునామీ సృష్టిస్తున్నాడు. మొదటి మ్యాచ్‌లోనే అద్భుతమైన సెంచరీతో పలకరించిన కోహ్లీ, రెండో మ్యాచ్‌లోనే అంతకు మించిన జోరును ప్రదర్శించాడు. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ కేవలం 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి స్టేడియాన్ని హోరెత్తించాడు. వన్డే ఫార్మాట్ మ్యాచ్‌లో టీ20 రేంజ్ బ్యాటింగ్‌తో విరాట్ విరుచుకుపడటం ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది.
బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వేదికగా శుక్రవారం గుజరాత్‌తో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో ఢిల్లీ తరపున కోహ్లీ ఈ విధ్వంసం సృష్టించాడు. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ జట్టు, రెండో ఓవర్లోనే తొలి వికెట్ కోల్పోయింది. దీంతో విరాట్ కోహ్లీకి బ్యాటింగ్ చేయడానికి ఎంతో సమయం దొరికింది. క్రీజులోకి రాగానే ఫోర్‌తో తన ఇన్నింగ్స్ మొదలుపెట్టిన విరాట్, ఆ తర్వాత అసలు గ్యాప్ ఇవ్వలేదు. ఒకవైపు తోటి బ్యాటర్ అర్పిత్ రాణా పరుగులు తీయడానికి కష్టపడుతుంటే, మరోవైపు కోహ్లీ మాత్రం కేవలం బౌండరీలతోనే స్కోర్ బోర్డును ఉరికించాడు.
ఈ ఇన్నింగ్స్‌లో విరాట్ చేసిన మ్యాజిక్ ఏంటంటే.. తను చేసిన మొదటి 53 పరుగులలో ఏకంగా 50 పరుగులు కేవలం బౌండరీల (11 ఫోర్లు, 1 సిక్స్) ద్వారానే వచ్చాయి. అంటే పరుగుల కోసం విరాట్ పెద్దగా కష్టపడకుండానే బంతులను సరిహద్దులు దాటించాడు. కేవలం 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కును అందుకున్న విరాట్, తన లిస్ట్-ఏ కెరీర్లో 85వ ఫిఫ్టీని ఖాతాలో వేసుకున్నాడు. గత మ్యాచ్‌లో 101 బంతుల్లో 131 పరుగులు చేసిన కోహ్లీ, అదే దూకుడును ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించడం విశేషం.
అయితే ఈ ఇన్నింగ్స్‌ను సెంచరీగా మలుస్తాడనుకున్న తరుణంలో విరాట్ అవుట్ అయ్యాడు. మొత్తం 58 బంతుల్లో 77 పరుగులు చేసిన కోహ్లీ, లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ విశాల్ జైస్వాల్ బౌలింగ్‌లో స్టంప్ అవుట్ అయి వెనుదిరిగాడు. తన ఇన్నింగ్స్‌లో మొత్తం 13 ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. సెంచరీ మిస్ అయినప్పటికీ, విరాట్ ఆడిన తీరు చూస్తుంటే ఆయన ఫుల్ ఫామ్‌లో ఉన్నాడని, రాబోయే సిరీస్‌ల కోసం సిద్ధంగా ఉన్నాడని స్పష్టమవుతోంది. రోహిత్ శర్మ రెండో మ్యాచ్‌లో డకౌట్ అవ్వగా, కోహ్లీ మాత్రం తన జోరును కొనసాగించి అభిమానులను ఖుషీ చేశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
