PKL 2024: బెంగళూర్‌ బుల్స్‌ రెండో విక్టరీ.. తమిళ్‌ తలైవాస్‌పై ఉత్కంఠ విజయం

Pro Kabaddi League 2024 Season 11: ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌లో ఆడిన తొలి ఆరు మ్యాచుల్లో ఐదింట పరాజయాలు చవిచూసిన బెంగళూర్‌ బుల్స్‌.. ఎట్టకేలకు సీజన్లో రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కెప్టెన్‌ పర్దీప్‌ నర్వాల్‌ బరిలో లేకపోయినా.. బలమైన తమిళ్‌ తలైవాస్‌పై 36-32తో నాలుగు పాయింట్ల తేడాతో బెంగళూర్‌ బుల్స్‌ ఉత్కంఠ విజయం సాధించింది.

PKL 2024: బెంగళూర్‌ బుల్స్‌ రెండో విక్టరీ.. తమిళ్‌ తలైవాస్‌పై ఉత్కంఠ విజయం
Bengaluru Bulls Beats Tamil Thalaivas
Follow us

|

Updated on: Nov 04, 2024 | 10:25 PM

హైదరాబాద్‌, 4 నవంబర్‌ 2024 : ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌లో ఆడిన తొలి ఆరు మ్యాచుల్లో ఐదింట పరాజయాలు చవిచూసిన బెంగళూర్‌ బుల్స్‌.. ఎట్టకేలకు సీజన్లో రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. కెప్టెన్‌ పర్దీప్‌ నర్వాల్‌ బరిలో లేకపోయినా.. బలమైన తమిళ్‌ తలైవాస్‌పై 36-32తో నాలుగు పాయింట్ల తేడాతో బెంగళూర్‌ బుల్స్‌ ఉత్కంఠ విజయం సాధించింది. సోమవారం గచ్చిబౌలిలోని జిఎంసి బాలయోగి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన పీకెఎల్‌ 11 లీగ్‌ దశ మ్యాచ్‌లో తమిళ్‌ తలైవాస్‌ తడబాటుకు గురైంది. సీజన్లో ఆరు మ్యాచులు ఆడిన తమిళ్‌ తలైవాస్‌కు ఇది రెండో పరాజయం. బెంగళూర్‌ బుల్స్‌ ఆటగాళ్లలో అజింక్య పవార్‌ (6 పాయింట్లు), అక్షిత్‌ (6 పాయింట్లు), సురిందర్‌ దెహల్‌ (5 పాయింట్లు) రాణించారు. తమిళ్ తలైవాస్‌ తరఫున నరందర్‌ (6 పాయింట్లు), సచిన్‌ (5) రాణించారు.

బెంగళూర్‌ పైచేయి :

వరుస పరాజయాలు చవిచూసిన బెంగళూర్‌ బుల్స్‌.. సోమవారం తమిళ్‌ తలైవాస్‌తో మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన చేసింది. డిఫెండర్లు అంచనాలకు మించి రాణించటంతో ప్రథమార్థం ఆటలో తమిళ్‌ తలైవాస్‌పై బెంగళూర్‌ బుల్స్‌ ఓ పాయింట్‌ ఆధిక్యం సాధించింది. రెయిడర్లు అజింక్య పవార్‌, జై భగవాన్‌ కూతలో మెప్పించారు. డిఫెండర్లు సౌరభ్‌ నందల్‌, సురిందర్‌ దెహల్‌ మెరుపు ట్యాకిల్స్‌ చేశారు. తమిళ్ తలైవాస్‌ సైతం రెయిడ్‌లో కాస్త నిరాశపరిచినా.. డిఫెన్స్‌లో మెప్పించింది. ఉత్కంఠగా సాగిన తొలి 20 నిమిషాల ఆటలో బెంగళూర్‌ బుల్స్‌ 14-13తో పైచేయి సాధించింది.

సెకండ్‌హాఫ్‌లో తమిళ్‌ తలైవాస్‌ పుంజుకుంది. డిఫెండర్ల జోరుకు.. రెయిడర్లు సైతం జత కలిశారు. దీంతో తమిళ్‌ తలైవాస్‌ వేగంగానే కోలుకుంది. చివరి పది నిమిషాల ఆటలో ఏకంగా మూడు పాయింట్ల ముందంజలో నిలిచిన తమిళ్‌ తలైవాస్‌.. ఆ తర్వాత నిరాశపరిచింది. 36వ నిమిషంలో 26-26తో స్కోరు సమం చేసింది బెంగళూర్‌ బుల్స్‌. ఆఖరు ఐదు నిమిషాల్లో తలైవాస్‌ను ఆలౌట్‌ చేసి 29-26తో మూడు పాయింట్ల ఆధిక్యం సాధించింది బుల్స్‌. ఆఖరు వరకు అదే జోరు కొనసాగించిన బెంగళూర్‌ బుల్స్‌ 36-32తో తమిళ్‌ తలైవాస్‌ను బోల్తా కొట్టించింది.