AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thomas Cup: థామస్‌ కప్‌లో చరిత్ర సృష్టించిన భారత బ్యాడ్మింటన్‌ జట్టు.. ఆ రెండూ అవసరం లేకుండానే..!

Thomas Cup: థామస్‌ కప్‌లో భారత బ్యాడ్మింటన్‌ జట్టు చారిత్రక విజయం సృష్టించింది. ఫైనల్లో ఇండోనేషియాను చిత్తుగో ఓడించింది. తొలిసారి గోల్డ్‌మెడల్‌ నెగ్గడంతో..

Thomas Cup: థామస్‌ కప్‌లో చరిత్ర సృష్టించిన భారత బ్యాడ్మింటన్‌ జట్టు.. ఆ రెండూ అవసరం లేకుండానే..!
Thomas Cup 2022
Shiva Prajapati
|

Updated on: May 16, 2022 | 5:50 AM

Share

Thomas Cup: థామస్‌ కప్‌లో భారత బ్యాడ్మింటన్‌ జట్టు చారిత్రక విజయం సృష్టించింది. ఫైనల్లో ఇండోనేషియాను చిత్తుగో ఓడించింది. తొలిసారి గోల్డ్‌మెడల్‌ నెగ్గడంతో.. ప్రభుత్వం ప్లేయర్లకు కోటిరూపాయల నజరానా ప్రకటించింది.

బ్యాడ్మింటన్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. 73 ఏళ్ల థామస్‌ కప్‌ చరిత్రలో భారత పురుషుల బ్యాడ్మింటన్‌ జట్టు తొలిసారి విజేత‌గా నిలిచింది. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరిగిన థామస్‌ కప్‌ టోర్నీ ఫైనల్లో పటిష్ట ఇండోనేషియాను భార‌త్ 3-0 తేడాతో చిత్తుచేసి స్వర్ణాన్ని ముద్దాడింది. 14 సార్లు ఛాంపియ‌న్‌గా నిలిచిన‌ ఇండోనేషియా.. ఫైనల్లో భారత ఆటగాళ్ల అద్భుత ప్రదర్శన ముందు తలవంచక తప్పలేదు. ఆటగాళ్ల సమిష్టి ప్రదర్శనతో బ్యాడ్మింటన్‌లో భారత్ తొలిసారి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.

ఫైనల్లోని తొలి మ్యాచ్‌లో యువ ఆటగాడు లక్ష్య సేన్ 8-21, 21-17, 21-16 తేడాతో ఒలింపిక్స్‌ పతక విజేత ఆంథోనీ గింటింగ్‌పై విజయం సాధించాడు. తొలి సెట్‌ను కోల్పోయినా.. లక్ష్య సేన్ జయకేతనం ఎగురవేసి భారత్‌కు 1-0 ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత జరిగిన డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్ శెట్టి ద్వయం 18-21, 23-21, 21-19తో మహ్మద్‌ అహసన్‌-సంజయ సుకమౌల్జో జోడిపై గెలుపొందారు. దీంతో భారత్ 2-0 తేడాతో ఇండోనేషియాపై ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.ఫైనల్లోని ఆఖరిదైన మూడో గేమ్‌లో తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్‌ 21-15, 23-21 తేడాతో వరుస సెట్లలో జొనాతన్‌ క్రిస్టీని ఓడించాడు. దాంతో 3-0 ఆధిక్యంతో థామస్‌ కప్‌ను భారత్‌ కైవసం చేసుకుంది.

ఇవి కూడా చదవండి

థామ‌స్ క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్‌లో మొత్తం రెండు డ‌బుల్స్, మూడు సింగిల్ మ్యాచ్‌లు ఉండ‌గా.. వ‌రుస‌గా మూడింటిలోనూ గెలిచిన భార‌త్ కప్ కైవసం చేసుకుంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో భారత్ తలపడాల్సిన అవసరం లేకుండా పోయింది. సింగిల్స్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్.. డబుల్స్‌లో ఎంఆర్ అర్జున్, ధృవ్ కపిల జోడీ రంగంలోకి దిగాల్సిన అవసరం లేకుండా పోయింది. తొలిసారి థామస్‌కప్‌ను అందుకున్న భారత బ్యాడ్మింటన్‌ జట్టు ఆనందంతో పరవశించిపోయంది.