AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PV Sindhu : పీవీ సింధు సంచలనం.. జపాన్ ఓపెన్ 2026 టైటిల్ కైవసం చేసుకున్న భారత షట్లర్

PV Sindhu : టోక్యోలో జరిగిన జపాన్ ఓపెన్ 2026 ఫైనల్లో జపాన్ స్టార్ అకానె యమగూచిని ఓడించి పీవీ సింధు చరిత్ర సృష్టించింది. 19 నెలల తర్వాత అంతర్జాతీయ టైటిల్ గెలిచిన సింధు, తన తొలి బీడబ్ల్యూఎఫ్ సూపర్ 750 ట్రోఫీని సొంతం చేసుకుని ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది.

PV Sindhu : పీవీ సింధు సంచలనం.. జపాన్ ఓపెన్ 2026 టైటిల్ కైవసం చేసుకున్న భారత షట్లర్
Pv Sindhu
Rakesh
|

Updated on: Jul 19, 2026 | 10:35 AM

Share

PV Sindhu : భారత బ్యాడ్మింటన్ దిగ్గజం రెండు సార్లు ఒలింపిక్ పతకాలు సాధించిన పీవీ సింధు అంతర్జాతీయ వేదికపై మరోసారి సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం టోక్యోలో జరిగిన జపాన్ ఓపెన్ 2026 టోర్నమెంట్‌లో మహిళల సింగిల్స్ టైటిల్‌ను సింధు ముద్దాడింది. ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో జపాన్ స్టార్ ప్లేయర్, ప్రపంచ నంబర్ 3 క్రీడాకారిణి అకానె యమగూచిని ఆమె సొంత గడ్డపైనే ఓడించి పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ అద్భుత విజయంతో సింధు తన కెరీర్‌లో మొట్టమొదటిసారిగా జపాన్ ఓపెన్ ఛాంపియన్‌గా నిలిచింది.

ఫైనల్ మ్యాచ్ ఆద్యంతం హోరాహోరీగా సాగింది. ప్రారంభ గేమ్‌లో జపాన్ క్రీడాకారిణి యమగూచి నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ, సింధు తన అనుభవాన్ని ఉపయోగించి అద్భుతంగా పుంజుకుంది. తనదైన శైలిలో అగ్రెసివ్ స్మాష్‌లు, నెట్ దగ్గర అత్యంత చాకచక్యంగా డ్రాప్ షాట్లు కొడుతూ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టింది. కేవలం 50 నిమిషాల వ్యవధిలోనే 21-17, 21-17 అనే తేడాతో యమగూచిపై ఘనవిజయం సాధించి మ్యాచ్‌ను ముగించింది. హోమ్ గ్రౌండ్‌లో ఆడుతున్న ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా సింధు ఆడిన తీరు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఈ విజయం పీవీ సింధుకు అత్యంత కీలకంగా మారింది. గత రెండు సీజన్లుగా వరుస గాయాల బారిన పడటంతో ఆమె తన ఫామ్ కోల్పోయి తీవ్రంగా ఇబ్బంది పడింది. ఈ క్రమంలో దాదాపు 19 నెలలుగా ఆమె ఒక్క అంతర్జాతీయ టూర్ టైటిల్ కూడా గెలవలేకపోయింది. చివరిగా డిసెంబర్ 2024 లో స్వదేశంలో జరిగిన సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టైటిల్ గెలిచిన సింధుకు మళ్లీ ఇన్నాళ్లకు ఆ స్థాయి విజయం దక్కింది. మేజర్ టైటిల్స్ పరంగా చూస్తే 2022 సింగపూర్ ఓపెన్ సూపర్ 500 తర్వాత సింధు సాధించిన అతిపెద్ద సంచలనం ఇదే కావడం విశేషం.

31 ఏళ్ల పీవీ సింధు కెరీర్‌లో ఇదొక మైలురాయిగా నిలిచిపోతుంది. ఎందుకంటే ఆమె బ్యాడ్మింటన్ కెరీర్‌లో ఇదే మొట్టమొదటి బిడబ్ల్యుఎఫ్ సూపర్ 750 సిరీస్ టైటిల్ విజయం. 2019లో వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ టైటిల్ గెలిచిన తర్వాత, గత ఏడేళ్ల కాలంలో సింధు సాధించిన అత్యంత భారీ, ప్రతిష్టాత్మక విజయంగా ఈ జపాన్ ఓపెన్ ట్రోఫీ నిలిచింది. సెమీఫైనల్లో చైనా స్టార్ ప్లేయర్ చెన్ యుఫెయ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరిన సింధు, అదే ఊపును ఆఖరి వరకు కొనసాగించి టైటిల్‌ను కైవసం చేసుకుంది.

పీవీ సింధు, అకానె యమగూచిల మధ్య అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో తలపడటం ఇది 30వ సారి. గత 10 మ్యాచ్‌లలో యమగూచి 7 సార్లు గెలిచి సింధుపై ఆధిక్యం కనబరిచినప్పటికీ, ఈసారి మాత్రం సింధు లెక్క సరిచేసింది. ఈ తాజా విజయంతో యమగూచిపై సింధు తన హెడ్-టు-హెడ్ రికార్డును 16-14 కు మరింత మెరుగుపరుచుకుంది. వచ్చే నెలలో భారతదేశంలోని ఢిల్లీ నగరంలో ప్రతిష్టాత్మక వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ మెగా టోర్నీలో భారత జట్టుకు సింధు నాయకత్వం వహించనుంది. ఈ నేపథ్యంలో జపాన్ ఓపెన్ టైటిల్ విజయం సింధులో సరికొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపిందని ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్ ఆనందం వ్యక్తం చేశారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us