వర్షంలో తడిసిన కరెన్సీ నోట్లను ఆరబెట్టడానికి సులువైన చిట్కాలు.. ఇలా చేస్తే కడక్ అవ్వాల్సిందే..!
వర్షాకాలంలో బయటకు వెళ్లినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ, కొన్నిసార్లు వర్షంలో తడవకుండా ఉండలేం. అలాంటప్పుడు వర్షం నీరు జేబుల్లోకి లేదా బ్యాగుల్లోకి చేరి డబ్బులు, ముఖ్యమైన కాగితాలు తడిసిపోతుంటాయి. అలాంటప్పుడు నోట్లు పాడైపోతాయేమో అని చాలామంది కంగారు పడుతుంటారు. కానీ, కొన్ని చిన్నచిన్న ఇంటి చిట్కాలను పాటిస్తే తడిసిన కరెన్సీ నోట్లను సురక్షితంగా ఆరబెట్టుకోవడమే కాకుండా, వాటిని మళ్లీ కొత్తవాటిలా కరకరలాడేలా మార్చవచ్చు. అదేలాగో ఇప్పుడు చూద్దాం..

వర్షాకాలంలో అనుకోకుండా జేబులు లేదా బ్యాగుల్లో ఉన్న కరెన్సీ నోట్లు నీటిలో తడిసిపోవడం సహజం. నోట్లు తడిసినప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. తడిసిన నోట్లను సులభంగా, సురక్షితంగా ఆరబెట్టడానికి కొన్ని సింపుల్ చిట్కాలు పాటించవచ్చు. ఈ ట్రిక్స్ ట్రై చేశారంటే, మీ తడిసిపోయిన కరెన్సీ నోట్లు తిరిగి మునుపటిలా కొత్తగా తయారవుతాయి. ఇందుకోసం ఏం చేయాలో వివరంగా చూద్దాం..
సీలింగ్ ఫ్యాన్ కింద ఆరబెట్టడం:
నోట్లు తడిసిన వెంటనే ముందుగా వాటిని తెరవడానికి ప్రయత్నించకుండా గాలి బాగా తగిలే ప్రదేశానికి తీసుకెళ్లాలి. గదిలోని సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ పెంచి, తడిసిన నోట్లను విడివిడిగా కింద పరిచి ఆరబెట్టాలి. ఫ్యాన్ గాలికి నోట్లలోని తేమ త్వరగా ఆవిరైపోతుంది.
ఒకదానికొకటి అతుక్కున్న నోట్లను వేరు చేయడం:
నోట్లు బాగా తడిసినప్పుడు ఒకదానికొకటి గట్టిగా అతుక్కుపోతాయి. వాటిని బలవంతంగా వేరు చేయడానికి ప్రయత్నిస్తే నోట్లు చిరిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి, వాటిని అలాగే గాలికి వదిలేయాలి. నోట్లలో తేమ తగ్గి పూర్తిగా ఆరిపోయిన తర్వాత, అవి తమంతట తామే సులభంగా వేరుపడతాయి.
పెనం ఉపయోగించి ఆరబెట్టడం:
తేమను వేగంగా తొలగించడానికి ఇంట్లోని దోసెల పెనం లేదా తవాను ఉపయోగింవచ్చు. స్టవ్ వెలిగించి పెనంను కాస్త వేడి చేయాలి. పెనం గోరువెచ్చగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, దానిపై తడి నోటును ఉంచాలి. ఒక వైపు ఆరిన తర్వాత నోటును తిరగేసి రెండో వైపు కూడా ఆరబెట్టాలి. అయితే పెనం ఎక్కువగా వేడిగా ఉండకుండా జాగ్రత్తపడాలి.
ఇస్త్రీ పెట్టె సహాయంతో కొత్తవిలా మార్చడం:
నోట్లు తడిసి ముడతలు పడినప్పుడు వాటిని మళ్లీ కొత్తవాటిలా మార్చడానికి ఐరన్ బాక్స్ చక్కగా పనిచేస్తుంది. ముందుగా ఒక కాటన్ గుడ్డను పరిచి, దానిపై తడి నోట్లను ఉంచాలి. ఇస్త్రీ పెట్టెను తక్కువ వేడిలో ఉంచి, నోట్లపై చాలా తేలికగా తిప్పాలి. లేదా ఐరన్ బాక్స్‌ను నోటుపై కాసేపు వత్తి పట్టి మళ్లీ పైకి లేపాలి. ఇలా చేయడం వల్ల నోట్లు వేగంగా ఆరడమే కాకుండా, మునుపటిలా కరకరలాడుతూ కొత్తగా తయారవుతాయి. ఈ సులువైన జాగ్రత్తలు పాటిస్తే వర్షంలో తడిసిన కరెన్సీ నోట్లను ఎలాంటి నష్టం లేకుండా సురక్షితంగా పూర్వస్థితికి తీసుకురావచ్చు.




