Goli Syamala MLC Kavitha : భారత్ – శ్రీలంకల మధ్యనున్న పాక్ జలసంధిని ఈది రికార్డు సృష్టించిన గోలి శ్యామలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను గోలి శ్యామల హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. 30 మైళ్ల పాక్ జలసంధిని ఈదిన ప్రపంచ రెండవ మహిళగా గోలి శ్యామల రికార్డు సృష్టించడం గర్వకారణమని ఈ సందర్భంగా కవిత చెప్పుకొచ్చారు. ఇక, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన రోల్ మోడల్ అన్నారు గోలి శ్యామల. మధ్య తరగతి కుటుంబానికి చెందిన తనను, ఎమ్మెల్సీ కవిత అన్ని విధాలుగా ప్రోత్సహించారన్నారామె. తన కలలను సాకారం చేసుకోవడానికి ఆర్థికంగా చేయూతనిచ్చారని తెలిపారు. అంతేకాదు ఎమ్మెల్సీ కవిత కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని గోలి శ్యామల పేర్కొన్నారు.
కాగా, మన హైదరాబాద్‌కు చెందిన 47 ఏళ్ల శ్రీమతి జి. శ్యామల ఈతలో చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. 30 కిలోమీటర్ల మేర శ్రీలంక నుండి భారతదేశానికి జలసంధిలో విజయవంతంగా ఈదారు. సముద్రంలో ఇంత దూరం ఈత కొట్టిన తొలి తెలుగు మహిళగా రికార్డు క్రియేట్ చేయడమేకాదు, ప్రపంచంలో రెండవ మహిళగా నిలిచారు. శుక్రవారం తెల్లవారుజామున 4:15 గంటలకు శ్రీలంక తీరం నుంచి ప్రారంభమైన ఆమె, 13 గంటల 43 నిమిషాల పాటు నిరంతరంగా ఈత కొట్టిన తరువాత రామేశ్వరంలోని ధనుష్కోడికి చేరుకున్నారు.