FIFA World Cup 2026: చరిత్రలో ఎన్నడూ లేని పరాభవం.. వరుసగా మూడోసారి వరల్డ్ కప్‌కు దూరమైన ఇటలీ
FIFA World Cup 2026: ఫుట్‌బాల్ ప్రపంచంలో పెను సంచలనం నమోదైంది. నాలుగు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఇటలీ జట్టుకు ఊహించని పరాభవం ఎదురైంది. 2026 ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫికేషన్ రేసు నుంచి ఇటలీ అధికారికంగా నిష్క్రమించింది. బుధవారం జరిగిన నిర్ణయాత్మక ప్లే ఆఫ్ ఫైనల్లో బోస్నియా అండ్ హెర్జెగోవినా చేతిలో ఇటలీ ఓటమిపాలవ్వడం క్రీడా లోకాన్ని షాక్‌కు గురిచేసింది.

FIFA World Cup 2026: ఫుట్‌బాల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా పేరుగాంచిన ఇటలీ, ఇప్పుడు ఒక అప్రతిష్టను మూటగట్టుకుంది. ప్రపంచ కప్ గెలిచిన జట్లలో వరుసగా మూడుసార్లు మెగా టోర్నీకి క్వాలిఫై అవ్వలేకపోయిన మొదటి జట్టుగా ఇటలీ రికార్డులకెక్కింది. యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లో అద్భుత విజయాలు సాధిస్తున్న ఈ జట్టు, వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ దగ్గరకు వచ్చేసరికి ఎందుకు తడబడుతోందో అర్థం కాక అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. డిఫెన్స్ శ్రేణికి పెట్టింది పేరైన ఇటలీ, బోస్నియా ముందు మోకరిల్లడం ఎవరూ ఊహించలేదు.
మ్యాచ్ విషయానికి వస్తే.. ఇటలీ ఆటను చాలా జోరుగా ప్రారంభించింది. 15వ నిమిషంలోనే మోయిజ్ కీన్ అద్భుత గోల్‌తో ఇటలీకి 1-0 ఆధిక్యాన్ని అందించాడు. అయితే మొదటి హాఫ్ ముగిసే లోపు మ్యాచ్ మలుపు తిరిగింది. ఇటలీ డిఫెండర్ అలెస్సాండ్రో బాస్తోనీ ఫౌల్ చేయడంతో రిఫరీ అతనికి రెడ్ కార్డ్ చూపించి బయటకు పంపాడు. దీంతో ఇటలీ 10 మంది ఆటగాళ్లతోనే ఆడాల్సి వచ్చింది. ఈ అవకాశాన్ని వాడుకున్న బోస్నియా ప్లేయర్ హారిస్ తబాకోవిచ్ గోల్ చేసి స్కోరును 1-1తో సమం చేశాడు.
🇧🇦: ✅✅✅✅ 🇮🇹: ❌✅❌
BOSNIA BEAT ITALY ON PENALTIES AND WILL PLAY AT THE 2026 @FIFAWorldCup 🎉#WCQ | #EuropeanQualifiers pic.twitter.com/pgfeHWkENU
— beIN SPORTS (@beINSPORTS_EN) March 31, 2026
నిర్ణీత సమయం ముగిసేసరికి ఇరు జట్లు 1-1తో సమానంగా ఉండటంతో మ్యాచ్ అదనపు సమయానికి వెళ్లింది. అక్కడ కూడా ఫలితం తేలకపోవడంతో పెనాల్టీ షూటౌట్ నిర్వహించారు. ఇక్కడే ఇటలీ బ్యాడ్ లక్ మొదలైంది. బోస్నియా ప్లేయర్లు కొట్టిన నాలుగు షాట్లు గోల్‌గా మారగా, ఇటలీ ప్లేయర్లు మొదటి, మూడో పెనాల్టీలను మిస్ చేశారు. బోస్నియా ప్లేయర్ ఎస్మీర్ బజ్రాక్టరెవిక్ కొట్టిన చివరి గోల్‌తో ఆ జట్టు 4-1తో విజయం సాధించి సంబరాల్లో మునిగిపోయింది.
వరుసగా మూడు ప్రపంచ కప్‌లకు (2018, 2022, 2026) దూరమవ్వడం ఇటలీ ఫుట్‌బాల్ బోర్డును ఆత్మరక్షణలో పడేసింది. ఈ ఓటమి కేవలం ఒక మ్యాచ్ ఓటమి మాత్రమే కాదు, ఇటలీ ఫుట్‌బాల్ వ్యూహాల్లో ఉన్న లోపాలను ఎత్తిచూపుతోంది. కోచింగ్ పద్ధతులు, ఆటగాళ్ల ఎంపిక, క్లిష్ట సమయాల్లో ఒత్తిడిని ఎదుర్కోలేకపోవడం వంటి అంశాలపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది. కచ్చితంగా ఇటలీ జట్టులో భారీ మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
