AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PKL 2023: లైట్స్, యాక్షన్, లే పంగా.. చరిత్రాత్మక ప్రో కబడ్డీ లీగ్ 10వ సీజన్‌ ఆరంభం.. తొలి మ్యాచ్‌లో తలపడేది ఎవరంటే?

ఈ క్రమంలో తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకున్న ఈ మెగా లీగ్ పదో ఎడిషన్‌లోకి అడుగు పెడుతోంది. ఈ చారిత్రాత్మక సందర్భంలో శుక్రవారం అహ్మదాబాద్‌లోని అక్షర్ రివర్ క్రూజ్‌లో ప్రో కబడ్డీ లీగ్ పదో సీజన్‌ లాంఛనంగా ప్రారంభమైంది. మాషల్ స్పోర్ట్స్, ప్రో కబడ్డీ లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి ఈ ప్రత్యేక సీజన్‌ను తొమ్మిదో ఎడిషన్ విజేత జట్టు జైపూర్ పింక్ పాంథర్స్ కెప్టెన్ సునీల్ కుమార్, పదో సీజన్ తొలి మ్యాచ్‌లో పోటీ పడే కెప్టెన్లు పవన్ సెహ్రావత్ (తెలుగు టైటాన్స్), ఫజెల్ అత్రాచలి (గుజరాత్ జెయింట్స్)తో కలిసి ప్రారంభించారు.

PKL 2023: లైట్స్, యాక్షన్, లే పంగా.. చరిత్రాత్మక ప్రో కబడ్డీ లీగ్ 10వ సీజన్‌ ఆరంభం.. తొలి మ్యాచ్‌లో తలపడేది ఎవరంటే?
Pkl 2023 Full Details
Venkata Chari
|

Updated on: Dec 01, 2023 | 6:59 PM

Share

Pro Kabaddi League 2023: పురాతన ఆట కబడ్డీకి, భారత ప్రజలకు మధ్య ఎన్నో ఏళ్ల నుంచి బలమైన అనుబంధం ఉంది. 2014లో ప్రో కబడ్డీ లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ క్రీడకు ప్రాముఖ్యత పెరిగింది. భారీ ప్రజాదరణ లభించింది. లీగ్ రూపకర్త మాషల్ స్పోర్ట్స్ 30-సెకన్ల రైడ్స్, డూ-ఆర్-డై రైడ్స్, సూపర్ రైడ్స్, సూపర్ ట్యాకిల్స్ వంటి వినూత్న నియమాలను అమలు చేసి ఈ ఆటకు కొత్త ఊపు తీసుకొచ్చింది. దేశంలోని క్రీడాభిమానులను సుపరిచితం అయిన ఆటను లీగ్ ప్రసారకర్తలు ప్రో కబడ్డీ లీగ్‌లో అద్భుతంగా ప్రసారం చేస్తూ దేశ, విదేశాల్లో కోట్లాది మందిని ఈ గేమ్‌ను ఆకర్షించారు.

ఈ క్రమంలో తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకున్న ఈ మెగా లీగ్ పదో ఎడిషన్‌లోకి అడుగు పెడుతోంది. ఈ చారిత్రాత్మక సందర్భంలో శుక్రవారం అహ్మదాబాద్‌లోని అక్షర్ రివర్ క్రూజ్‌లో ప్రో కబడ్డీ లీగ్ పదో సీజన్‌ లాంఛనంగా ప్రారంభమైంది. మాషల్ స్పోర్ట్స్, ప్రో కబడ్డీ లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి ఈ ప్రత్యేక సీజన్‌ను తొమ్మిదో ఎడిషన్ విజేత జట్టు జైపూర్ పింక్ పాంథర్స్ కెప్టెన్ సునీల్ కుమార్, పదో సీజన్ తొలి మ్యాచ్‌లో పోటీ పడే కెప్టెన్లు పవన్ సెహ్రావత్ (తెలుగు టైటాన్స్), ఫజెల్ అత్రాచలి (గుజరాత్ జెయింట్స్)తో కలిసి ప్రారంభించారు.

12 నగరాల్లో పోటీలు: అనుపమ్ గోస్వామి..

సబర్మతి నది ఒడ్డున క్రూయిజ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో అనుపమ్ గోస్వామి మాట్లాడారు. ‘12-నగరాల కారవాన్ మోడల్‌కు తిరిగి వెళ్లడం పదో సీజన్ కు చారిత్రాత్మక సందర్భం కానుంది. 2019 తర్వాత లీగ్‌ను అభిమానులు తమ సొంత నగరాల్లో చూడలేకపోయారు. కానీ, ఈసారి మేం కనీసం తొమ్మిది భౌగోళికాలను తిరిగి ఏకం చేయబోతున్నాం. ఈ సీజన్‌ను 12 నగరాల్లో నిర్వహించడం ద్వారా ఆయా ఫ్రాంచైజీలు తమ సొంత ప్రాంతంలోని ప్రజలు, అభిమానులతో బలమైన అనుసంధానాన్ని ఏర్పరచుకోవడానికి దోహదం అవుతుంది’ అని అన్నారు.

తొలి పోరుకు టైటాన్స్ సిద్ధం: పవన్ సెహ్రావత్..

శనివారం అహ్మదాబాద్ ఈకేఏ ఏరీనాలో జరిగే పదో సీజన్ తొలి బ్లాక్‌బస్టర్ మ్యాచ్‌కు తెలుగు టైటాన్స్‌, గుజరాత్ జెయింట్స్ సిద్ధమయ్యాయి. టైటాన్స్ కెప్టెన్, ప్రో కబడ్డీ లీగ్ లో అత్యంత ఖరీదైన ఆటగాడైన పవన్ సెహ్రావత్ తన జట్టు మొదటి గేమ్‌కు సిద్ధమైందని తెలిపాడు. ‘నేను మ్యాట్‌పై అడుగు పెట్టడానికి చాలా ఉత్సాహంగా ఉన్నా. గత సీజన్‌ కు దూరంగా ఉండటం నిరాశ కలిగించింది. అయితే, కొత్త సీజన్ కోసం నా శక్తిని దాచుకున్నా. మొదటి గేమ్‌లో ఫజెల్‌ను ఎదుర్కోవడానికి నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. కోచింగ్ క్యాంప్‌ లో పాల్గొన్న మా ఆటగాళ్లు ఈ సీజన్ కోసం చాలా బాగా శిక్షణ పొందారు. గుజరాత్ జెయింట్స్‌తో మొదటి మ్యాచ్‌కు మేం పూర్తిగా సిద్ధంగా ఉన్నాం’ అని చెప్పుకొచ్చాడు.

కొత్త సీజన్ కోసం ఆతృతగా ఉన్నాం: ఫజెల్..

ప్రో కబడ్డీ లీగ్‌లో అత్యంత ఖరీదైన డిఫెండర్, గుజరాత్ జెయింట్స్ కెప్టెన్ ఫజెల్ అత్రాచలి మాట్లాడుతూ.. ‘ప్రో కబడ్డీ లీగ్ పదో సీజన్ లో భాగమైనందుకు నేను చాలా సంతోషిస్తున్నా. ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ కబడ్డీ టోర్నీ. మేం కొత్త సీజన్ కోసం ఆతృతగా ఉన్నాం. ఈ ఏడాది గుజరాత్ జెయింట్స్ తరఫున ఆడడం చాలా సంతోషంగా ఉంది. మా జట్టులో చాలా మంది యువ ప్రతిభావంతులతో పాటు మంచి కోచ్ ఉన్నారు. ఈ సీజన్‌ లో మెరుగైన ప్రదర్శన చేసేందుకు ఎదురుచూస్తున్నాం’ అని పేర్కొన్నాడు.

ట్రోఫీ మాతోనే ఉండేలా చూసుకోవాలి: సునీల్ కుమార్

గత సీజన్‌లో ఫైనల్‌లో పుణెరి పల్టన్‌ను ఓడించి జైపూర్ పింక్ పాంథర్స్ ప్రొ కబడ్డీ లీగ్ ట్రోఫీని కైవసం చేసుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా పదో సీజన్‌ కు రావడం గురించి ఆ జట్టు కెప్టెన్ సునీల్ కుమార్ మాట్లాడాడు. ‘ప్రస్తుతానికి ట్రోఫీ మా దగ్గరే ఉంది. అది మాతోనే ఉండేలా చూసుకోవాలి. ఈ సీజన్‌లో మరింత కష్టపడి శిక్షణ తీసుకున్నాం. జట్టు పరంగా గతేడాది మేం గొప్ప కాంబినేషన్‌ను అమలు చేశాం. ఈసారి కూడా అదే కాంబినేషన్‌ను కొనసాగిస్తాం. టోర్నీ కోసం మేం మెరుగ్గా సన్నద్ధమయ్యాం’ అని తెలిపాడు.

ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10 అహ్మదాబాద్ లెగ్ ఈ నెల 2 నుంచి 7 వరకు జరుగుతుంది. ఆ తర్వాత లీగ్ ఆయా నగారాల్లో జరుగుతుంది. బెంగళూరు (డిసెంబర్ 8-13), పూణే (డిసెంబర్ 15-20), చెన్నై (డిసెంబర్ 22-27), నోయిడా (డిసెంబర్29 – జనవరి 3), ముంబై (జనవరి 5-10), జైపూర్ (జనవరి 12-17), హైదరాబాద్ (జనవరి 19-24 జనవరి), పాట్నా (జనవరి 26- 31), ఢిల్లీ (ఫిబ్రవరి 2-7), కోల్‌కతా (ఫిబ్రవరి 9-14), పంచకుల (ఫిబ్రవరి 16-21).

ప్రో కబడ్డీ లీగ్ పదో సీజన్‌ 10 స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఉచితంగా ప్రసారం అవుతుందని నిర్వాహకులు తెలిపారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..