Olympics : ఒలింపిక్స్ లక్ష్యంగా భారత్..2029 లేదా 2031 ఏదో ఒక ఎడిషన్‌కు ఆతిథ్యంపై భారత్ ఆశలు

భారతదేశం క్రీడా రంగంలో తనదైన ముద్ర వేయడానికి సిద్ధమవుతోంది. 2029, 2031 వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లకు వ్యూహాత్మక బిడ్‌లు వేయాలని నిర్ణయించింది. 2036 ఒలింపిక్స్‌ను లక్ష్యంగా చేసుకుని, జూనియర్ ఛాంపియన్‌షిప్‌లు, రిలేస్‌లకు కూడా భారత్ బిడ్ చేస్తోంది. అంతర్జాతీయ క్రీడా మ్యాప్‌లో భారత్ తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని చూస్తోంది.

Olympics : ఒలింపిక్స్ లక్ష్యంగా భారత్..2029 లేదా 2031 ఏదో ఒక ఎడిషన్‌కు ఆతిథ్యంపై భారత్ ఆశలు
World Athletics Championships

Updated on: Jul 06, 2025 | 5:01 PM

Olympics : భారత్ క్రీడా రంగంలో తనదైన ముద్ర వేయడానికి రెడీ అవుతుంది.క్రీడా ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రపంచ స్థాయి అథ్లెటిక్స్ పోటీలైన వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ల నిర్వహణ హక్కుల కోసం ఇండియా బిడ్ వేయడానికి సిద్ధమవుతోంది. ముఖ్యంగా 2029, 2031 సంవత్సరాల్లో జరిగే ఈ ప్రతిష్టాత్మక పోటీలను మన దేశంలో నిర్వహించుకోవడానికి భారత్ బిడ్‌ను సమర్పించబోతోందని అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధి, వరల్డ్ అథ్లెటిక్స్ ఉపాధ్యక్షుడు అడిల్ సుమరివాలా ఆదివారం వెల్లడించారు. ఈ రెండు ఎడిషన్లలో ఏది వచ్చినా భారత్ ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.

ప్రపంచ అథ్లెటిక్స్ సంస్థ.. 2029, 2031 ఎడిషన్ల ఆతిథ్య దేశాలను 2026 సెప్టెంబర్‌లో అధికారికంగా ప్రకటిస్తుంది. ఈ ప్రక్రియలో భాగంగా సభ్య దేశాలు తమ ఆసక్తిని 2025 అక్టోబర్ 1 లోగా తెలియజేయాలి. 2029, 2031 ఛాంపియన్‌షిప్‌ల కోసం వ్యూహాత్మక బిడ్డింగ్ చేయబోతున్నాం. రెండు ఎడిషన్లను కలిపి కేటాయిస్తారు. ఏది వచ్చినా ఓకే అని సుమరివాలా తెలిపారు.ఈ ప్రక్రియ మొదలు కావడానికి ఇంకా కొంత సమయం ఉంది. ఈ లోగా ఇండియా తరఫున బిడ్స్ సమర్పిస్తామని సుమరివాలా అన్నారు. ఇటీవల జరిగిన ఎన్సీ క్లాసిక్ ఇంటర్నేషనల్ జావెలిన్ ఈవెంట్ కోసం ఆయన వచ్చారు. ఆ పోటీలో జావెలిన్ స్టార్, డబుల్ ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రా గెలిచారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ల కోసం దరఖాస్తును సమర్పించడానికి మొదటి గడువు 2026 ఏప్రిల్ 1. ఆసక్తి ఉన్న దేశాలు ఆ తర్వాత 2026 ఆగస్టు 5 నాటికి తుది బిడ్ దరఖాస్తును సమర్పించాలి. వీటిని పరిశీలించిన తర్వాత వరల్డ్ అథ్లెటిక్స్ కౌన్సిల్ 2029, 2031 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ల ఆతిథ్య నగరాలను అధికారికంగా ప్రకటిస్తుంది.

భారతదేశం 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వాలనే పెద్ద లక్ష్యంతో ఉంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఒక అడుగుగా AFI అనేక హై-ప్రొఫైల్ క్రీడా ఈవెంట్‌లకు బిడ్ చేయాలని నిర్ణయించింది. గతంలో 2029 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ల కోసం మాత్రమే బిడ్ గురించి ఆలోచించారు. అయితే, ఇప్పుడు 2031 ఎడిషన్ కోసం కూడా బిడ్డింగ్ వేయాలని భావించడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే, 2025, 2027 ఎడిషన్లకు ఆసియా ఖండంలోని దేశాలే ఆతిథ్యం ఇస్తున్నాయి. 2025లో టోక్యోలో, 2027లో బీజింగ్‌లో ఈ పోటీలు జరుగుతాయి. ఒకవేళ 2029 ఎడిషన్‌ను కూడా భారత్ పొందితే, ఆసియా వరుసగా మూడుసార్లు ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇచ్చినట్లవుతుంది. ఇది సాధ్యం కాకపోవచ్చు. అందుకే, 2031 ఎడిషన్‌ను పొందే అవకాశం భారత్‌కు మెరుగ్గా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే భారత్ ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఉన్న మరో ముఖ్యమైన ఈవెంట్ 2028 జూనియర్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు. దీని కోసం AFI ఇప్పటికే తమ ఆసక్తిని వ్యక్తం చేసింది. 2024 చివరిలో ప్రపంచ అథ్లెటిక్స్ చీఫ్ సెబాస్టియన్ కో భారత దేశాన్ని సందర్శించినప్పుడు ఈ విషయంపై చర్చ జరిగింది. 2028, 2030 జూనియర్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ల ఆతిథ్య దేశాలను ప్రపంచ అథ్లెటిక్స్ 2025 డిసెంబర్‌లో ప్రకటించనుంది. ఈ దరఖాస్తులను సమర్పించడానికి మొదటి గడువు 2025 సెప్టెంబర్ 22, తుది దరఖాస్తులను 2025 నవంబర్ 7 నాటికి సమర్పించాలి. ఈ వరుస బిడ్‌ల ద్వారా అంతర్జాతీయ క్రీడా మ్యాప్‌లో భారత్ తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని, 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చే అవకాశం కోసం బలమైన పునాది వేయాలని చూస్తోంది.

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..