‘మాతృత్వం వైకల్యం కాదు’.. ఆసియా గేమ్స్ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు స్టార్ రెజ్లర్ వినేశ్‌కు హైకోర్టు అనుమతి
స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పోరాటానికి ఎట్టకేలకు శుభం కార్డు పడింది. మే 30, 31 తేదీల్లో జరగనున్న 2026 ఏషియన్ గేమ్స్ సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు ఢిల్లీ హైకోర్టు శనివారం అనుమతి ఇచ్చింది. వినేశ్‌పై WFI కక్షపూరిత ధోరణిలో కోర్టు తప్పుబట్టింది. ఆసియా క్రీడల కోసం డబ్ల్యూఎఫ్‌ఐ నిర్దేశించిన ఎంపిక ప్రమాణాలు వివక్షపూరితంగా ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది..

న్యూఢిల్లీ, మే 24: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు ఢిల్లీ హైకోర్టులో ఉపశమనం లభించింది. ఆసియా గేమ్స్ సెలెక్షన్ ట్రయల్స్‌లో పాల్గొనడానికి కోర్టు ఆమెకు అనుమతి ఇచ్చింది. మాతృత్వాన్ని ‘వైకల్యం’గా చూపి వృత్తిపరమైన అవకాశాల నుంచి మినహాయింపుకు కారణంగా పరిగణించలేమని తేల్చి చెప్పింది. మాతృత్వ విరామం తర్వాత తిరిగి వస్తున్న ఆమెలాంటి దిగ్గజ రెజ్లర్‌లను పరిగణనలోకి తీసుకోకుండా దూరం పెట్టడం రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) ఎంపిక విధానంలోని లోపాన్ని ఎత్తిచూపుతోందని కోర్టు అభిప్రాయపడింది.
ఈ మేరకు చీఫ్ జస్టిస్ DK ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కారియాతో కూడిన ధర్మాసనం రెజ్లర్ వినేష్ ఫోగాట్‌ను 2026 ఆసియా క్రీడల ఎంపిక ట్రయల్స్‌లో పాల్గొనడానికి అనుమతినిస్తూ తీర్పు వెలువరించింది. అలాగే గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆర్డర్‌ను కొట్టేస్తూ ఫొగాట్ అప్పీల్‌పై కోర్టు శనివారం తీర్పునిచ్చింది.
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) రూపొందించిన అర్హతా ప్రమాణాలలోని వివక్షాపూరిత స్వభావాన్ని ప్రశ్నిస్తూ ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కరియాలతో కూడిన ధర్మాసనం మే 30, 31 తేదీలలో జరగనున్న ట్రయల్స్‌లో ఫోగాట్‌ను పాల్గొనేందుకు అనుమతించాలని, అలాగే సెలెక్షన్ ట్రయల్స్ ప్రక్రిను మొత్తాన్ని వీడియో రికార్డ్ చేయాలని WFIని ఆదేశించింది. సాయ్, ఐఏఓ నుంచి స్వతంత్ర పర్యవేక్షకులు ట్రయల్స్‌ను పర్యవేక్షించాలని కోర్టు సూచించింది. మాతృత్వాన్ని జీవితంలో ఒక సహజమైన, అత్యంత ముఖ్యమైన అంశంగా చూడాలి. అందుకు తగిన సదుపాయాలు కల్పించి, సంస్థాగత సున్నితత్వం ప్రదర్శించాలి. దీనిని కారణంగా చూపి మహిళా క్రీడాకారిణులను దూరం పెట్టడం, అణచివేయడానికి మాతృత్వం కారణంగా మారకూడదని ఢిల్లీ హైకోర్టు ఈ సందర్భంగా పేర్కొంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
