ఏడో నెంబర్‌లో వచ్చి తుఫాన్ సెంచరీ.. చివరి ఓవర్‌లో ధోనిలా మ్యాచ్ గెలిపించిన తెలుగు ప్లేయర్..
నెదర్లాండ్స్, జింబాబ్వే మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ తొలి మ్యాచ్‌లో..
నెదర్లాండ్స్, జింబాబ్వే మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్ విజయం సాధించింది. ఆ జట్టు తరపున 7వ స్థానంలో బరిలోకి దిగిన తెలుగు క్రికెటర్ ఆల్‌రౌండర్ తేజ నిడమనూరు అద్భుత సెంచరీతో తన జట్టుకు అపూర్వ విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 50 ఓవర్లకు 249 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టుకు ఆరంభం అంతగా అచ్చిరాలేదు. 70 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ క్లైవ్ మదానే(74) హాఫ్ సెంచరీతో అదరగొట్టి.. జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించడంలో సహాయపడ్డాడు.
ఇక లక్ష్యచేధనలో భాగంగా బరిలోకి దిగిన నెదర్లాండ్స్ జట్టును ఆల్‌రౌండర్ తేజ నిడమానూరు కాపాడాడు. 64 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి.. పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆ జట్టును అకేర్‌మెన్(50) అర్ధ సెంచరీతో రాణించగా.. తేజ ఏడో నెంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి.. 96 బంతుల్లో అజేయంగా 110 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. తేజకు ఇదే తొలి వన్డే సెంచరీ కాగా.. ఇప్పటివరకు అతడు తన కెరీర్‌లో ఆడింది కేవలం 9 వన్డేలు మాత్రమే.
నెదర్లాండ్స్ విజయానికి చివరి రెండు బంతుల్లో ఒక పరుగు కావాల్సి ఉండగా.. వాన్ మీకెరెన్(21) ఓవర్ ఐదో బంతికి సిక్సర్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. కాగా, ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 3 వికెట్లు తేడాతో అద్భుత విజయం సాధించగా.. తేజ నిడమానూరు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.