WPL 2026 : సినిమా టికెట్ కంటే తక్కువ ధరకే డబ్ల్యూపీఎల్ మ్యాచ్..ఆన్లైన్ టికెట్ల బుకింగ్ షురూ
WPL 2026 : డబ్ల్యూపీఎల్ 2026 మ్యాచ్‌లు నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం, వడోదరలోని బరోడా క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలలో జరగనున్నాయి. మొత్తం 22 మ్యాచ్‌లకు సంబంధించి ఆన్‌లైన్ టికెట్ల విక్రయాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. సాధారణ స్టాండ్స్ కోసం టికెట్ ధర రూ.100 నుంచి మొదలవుతోంది.

WPL 2026 : మహిళా క్రికెట్ అభిమానులకు అదిరిపోయే వార్త. ఉమెన్ ప్రిమియర్ లీగ్ నాలుగో సీజన్ మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కానుంది. ఈసారి మ్యాచ్‌లను మైదానంలో చూసేందుకు టికెట్ల ధరలను చాలా తక్కువగా నిర్ణయించారు. కేవలం రూ.100 నుంచే టికెట్లు అందుబాటులో ఉన్నాయి. జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5 వరకు సాగే ఈ క్రికెట్ పండుగ కోసం టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.
ఈసారి డబ్ల్యూపీఎల్ 2026 మ్యాచ్‌లు నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం, వడోదరలోని బరోడా క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలలో జరగనున్నాయి. మొత్తం 22 మ్యాచ్‌లకు సంబంధించి ఆన్‌లైన్ టికెట్ల విక్రయాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. సాధారణ స్టాండ్స్ కోసం టికెట్ ధర రూ.100 నుంచి మొదలవుతోంది. ఓపెనింగ్ మ్యాచ్‌లకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో టికెట్లు వేగంగా అమ్ముడవుతున్నాయి.
ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకోవడం ఎలా?
* డబ్ల్యూపీఎల్ అధికారిక టికెటింగ్ భాగస్వామి అయిన డిస్ట్రిక్ట్ బై జోమాటో (District by Zomato) వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా మీరు సులభంగా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
* ముందుగా wplt20.com లేదా District వెబ్‌సైట్‌లోకి వెళ్లండి.
* హోమ్ పేజీలో కనిపించే డబ్ల్యూపీఎల్ బ్యానర్‌పై క్లిక్ చేస్తే మ్యాచ్‌ల జాబితా కనిపిస్తుంది. మీకు కావాల్సిన మ్యాచ్‌ను ఎంచుకోండి.
* స్టేడియం లేఅవుట్ ఆధారంగా మీకు నచ్చిన స్టాండ్, సీట్లను సెలెక్ట్ చేసుకోండి. (ప్రస్తుతం రూ.100 టికెట్లు అందుబాటులో ఉన్నాయి).
* మీ మొబైల్ నెంబర్‌తో లాగిన్ అయి, ఓటీపీ వెరిఫై చేయండి. ఆ తర్వాత యూపీఐ, డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ పూర్తి చేయండి.
* పేమెంట్ పూర్తయ్యాక మీ ఈ-టికెట్ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్‌కు వస్తుంది. మ్యాచ్ రోజున దీనిని చూపించి స్టేడియంలోకి ప్రవేశించవచ్చు.
షెడ్యూల్ ముఖ్యాంశాలు
జనవరి 9న జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. జనవరి 17 వరకు తొలి 11 మ్యాచ్‌లు నవీ ముంబైలో జరుగుతాయి. ఆ తర్వాత జనవరి 19 నుంచి మిగిలిన మ్యాచ్‌లు, ప్లేఆఫ్స్, ఫిబ్రవరి 5న జరిగే గ్రాండ్ ఫినాలే వడోదరలో నిర్వహించనున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
