T20 World Cup 2026 : వరల్డ్ కప్ హీరోల రిలాక్స్ మోడ్.. టీ కొట్టు దగ్గర సంజూ శాంసన్, తిరువన్నామలైలో వరుణ్ చక్రవర్తి

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 గెలిచిన తర్వాత సంజూ శాంసన్ లోకల్ టీ కొట్టు దగ్గర, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టర్ సుందర్ తిరువన్నామలై ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ కనిపించారు. కుల్దీప్ యాదవ్ త్వరలో వివాహం చేసుకోబోతున్నారు.

T20 World Cup 2026 : వరల్డ్ కప్ హీరోల రిలాక్స్ మోడ్.. టీ కొట్టు దగ్గర సంజూ శాంసన్, తిరువన్నామలైలో వరుణ్ చక్రవర్తి
Sanju Samson, Varun Chakravarthy

Updated on: Mar 13, 2026 | 8:18 PM

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని ముద్దాడి, దేశానికి గర్వకారణంగా నిలిచిన టీమిండియా ఆటగాళ్లు ఇప్పుడు కాస్త రెస్ట్ మోడ్‌లోకి వెళ్లారు. మార్చి 28 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026 సందడికి ముందు దొరికిన ఈ కొద్దిపాటి విరామాన్ని మన వరల్డ్ ఛాంపియన్లు తమదైన శైలిలో గడుపుతున్నారు. కొందరు పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమవుతుంటే, మరికొందరు ఆధ్యాత్మిక యాత్రలు, లోకల్ షాపుల్లో సామాన్యుల్లా కనిపిస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు.

టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఈ ఐపీఎల్ సీజన్ కంటే ముందే ఒక ఇంటివాడు కాబోతున్నాడు. తన వివాహ పనుల కోసం ఆయన బిజీగా ఉండగా, మరోవైపు వరల్డ్ కప్ హీరో వరుణ్ చక్రవర్తి ఆధ్యాత్మిక బాట పట్టారు. తమిళనాడులోని తిరువన్నామలైలో తన తోటి ఆటగాడు వాషింగ్టన్ సుందర్‌తో కలిసి ఏకంగా 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేశారు. ఈ క్రమంలో వరుణ్ చక్రవర్తి ఒక చిన్న బడ్డీ కొట్టు దగ్గర సాధారణ వ్యక్తిలా కూర్చుని తన మొబైల్ చూసుకుంటున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అంత పెద్ద స్టార్ క్రికెటర్ అలా సామాన్యుడిలా కనిపించడం ఫ్యాన్స్‌కు బాగా నచ్చేసింది.

ఇక కేరళ కుర్రాడు సంజూ శాంసన్ సైతం తన సింప్లిసిటీని చాటుకున్నాడు. వరల్డ్ కప్ గెలిచిన ఆనందంలో ఇంటికి వెళ్లిన సంజూ, కేరళలోని ఒక లోకల్ టీ కొట్టు దగ్గర ప్రత్యక్షమయ్యాడు. అక్కడ కూర్చుని ప్రశాంతంగా టీ తాగుతున్న సంజూని చూసి హోటల్ సిబ్బందితో పాటు స్థానికులు కూడా షాక్ తిన్నారు. తనను చూడగానే చుట్టుముట్టిన అభిమానులను సంజూ అస్సలు నిరాశపరచలేదు. చిరునవ్వుతో అందరికీ సెల్ఫీలు ఇస్తూ వారి రోజును స్పెషల్ గా మార్చేశాడు. ఈ వరల్డ్ కప్‌లో సంజూ బ్యాట్‌తో శివాలెత్తిపోయి 321 పరుగులతో భారత్ తరపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

కేవలం బ్యాటింగ్‌లోనే కాదు, బౌలింగ్‌లోనూ మనవాళ్లు అదరగొట్టారు. వరుణ్ చక్రవర్తి ఈ టోర్నీలో 14 వికెట్లు తీసి అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచాడు. ఇలా మైదానంలో విక్రమార్కుల్లా పోరాడి దేశానికి కప్పు తెచ్చిన ఈ వీరులు, నిజ జీవితంలో మాత్రం చాలా ఒద్దికగా ఉండటం చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఈ చిన్ని విరామం వారిని మానసికంగా మరింత దృఢంగా మారుస్తుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us