
MS Dhoni Will Play Farewell Match at Chepauk: ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మే 18న సోమవారం రాత్రి తమ సొంత మైదానమైన ఎం.ఏ. చిదంబరం స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ సీజన్‌లో చెన్నై జట్టుకు ఇది చివరి హోమ్ మ్యాచ్ కావడంతో స్టేడియం మొత్తం పసుపు వర్ణంగా మారిపోనుంది. అయితే ఈ మ్యాచ్‌లో అందరి కళ్లు చెన్నై మాజీ సారథి ఎంఎస్ ధోనీపైనే ఉన్నాయి. ఈ సీజన్ ప్రారంభం నుంచి గాయం కారణంగా ధోనీ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడంతో, ఈ ఆఖరి హోమ్ మ్యాచ్‌కైనా అతను తుది జట్టులోకి వస్తాడా లేదా అన్నది ఉత్కంఠగా మారింది.
గతంలో 2021లో జరిగిన ఒక సిఎస్‌కె అధికారిక కార్యక్రమంలో ధోనీ మాట్లాడుతూ.. “నేను ఎప్పుడూ నా క్రికెట్‌ను ప్రణాళికాబద్ధంగానే ముగిస్తాను. భారతదేశంలో నేను ఆడిన చివరి వన్డే నా సొంత ఊరైన రాంచీలో జరిగింది. అలాగే నా చివరి టీ20 మ్యాచ్ చెన్నైలోనే జరుగుతుందని ఆశిస్తున్నాను. అది వచ్చే ఏడాది కావొచ్చు లేదా ఐదేళ్ల తర్వాత కావొచ్చు, నాకైతే తెలియదు” అంటూ వ్యాఖ్యానించాడు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ధోనీ ఆడిన ఆనాటి మాటలు నిజమయ్యే సమయం ఆసన్నమైందా అనే చర్చ నడుస్తోంది. ఒకవేళ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించాలనుకుంటే, చెపాక్ మైదానంలో సన్‌రైజర్స్‌తో జరిగే ఈ మ్యాచ్ అతనికి వీడ్కోలు మ్యాచ్ అయ్యే అవకాశం ఉందంటూ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: IND vs AFG: ఆఫ్ఘాన్‌తో సిరీస్‌కు భారత జట్టు.. ఛోటా ప్యాకెట్ రీఎంట్రీ ఫిక్స్..!
ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు జరిగిన వార్మప్ మ్యాచ్‌లలో ధోనీ తీవ్రమైన గాయానికి గురయ్యాడు. దీంతో జట్టు ఫిజియో పర్యవేక్షణలో సుదీర్ఘ కాలం పాటు కోలుకునేందుకు ప్రయత్నించాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో కూడా ధోనీ ఆడతాడని అభిమానులు ఆశించినా, అతను బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఆ మ్యాచ్‌లో చెన్నై ఓటమి చవిచూడటంతో ప్లేఆఫ్స్ రేసు మరింత ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలోని సిఎస్‌కె జట్టు సమతుల్యతను దెబ్బతీయకుండా, కేవలం వీడ్కోలు కోసమే ధోనీని జట్టులోకి తీసుకుంటారా అన్నది మేనేజ్‌మెంట్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంది.
మహేంద్ర సింగ్ ధోనీకి చెన్నై నగరంతో, అక్కడి అభిమానులతో ఉన్న బంధం విడదీయరానిది. ఈ నేపథ్యంలో మే 18న సన్‌రైజర్స్‌తో జరిగే పోరులో ధోనీ మైదానంలోకి అడుగుపెడితే గనక చెపాక్ స్టేడియం హోరెత్తడం ఖాయం. ఒకవేళ అతను ఫిట్‌నెస్ సాధించి బరిలోకి దిగితే, అది అభిమానులకు అతిపెద్ద పండగ లాంటి వార్త అవుతుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..