India vs England: కింగ్ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు? లిస్ట్ లో ట్రిపుల్ సెంచరీ వీరుడు ఉన్నాడుగా!
ఇంగ్లాండ్‌తో జరగబోయే టెస్ట్ సిరీస్‌లో నెంబర్ 3 స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్నది హాట్ టాపిక్‌గా మారింది. కరుణ్ నాయర్ తన రంజీ ఫామ్‌తో తిరిగి జట్టులోకి వచ్చాడు, అయితే సుదర్శన్‌కు ఇది తొలి టెస్ట్ ఛాన్స్. కెఎల్ రాహుల్ ఓపెనర్‌గా ఉండే అవకాశం ఉండగా, గిల్ నాలుగో స్థానంలో స్థిరపడేలా కనిపిస్తున్నాడు. యువ క్రికెటర్లకు ఇది తమ ప్రతిభను చూపించే అరుదైన అవకాశం.

ఇంగ్లాండ్‌తో జరగబోయే ఐదు టెస్టుల సిరీస్‌కు భారత జట్టును BCCI ప్రకటించిన తరువాత, అందరి దృష్టి ఇప్పుడు నెంబర్ 3 స్థానం ఎవరు భర్తీ చేస్తారన్న ప్రశ్నపై ఉంది. టెస్ట్ ఫార్మాట్‌లో అత్యంత కీలకమైన స్థానాలలో ఇది ఒకటి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు టెస్టుల నుండి తప్పుకున్న నేపథ్యంలో టాప్ ఆర్డర్‌లో చోటుచేసిన ఖాళీ భారత జట్టుకు సవాల్ అయినప్పటికీ, యువ క్రీడాకారులకు ఇది ఒక గొప్ప అవకాశం కూడా. ప్రస్తుతం నెంబర్ 3 స్థానానికి ప్రధానంగా కరుణ్ నాయర్, సాయి సుదర్శన్ అనే ఇద్దరి మధ్య పోటీ నెలకొంది. ఇద్దరిలో ఒకరు టెస్ట్ క్రికెట్‌లో అద్భుతమైన రికార్డుతో తిరిగి వచ్చే దశలో ఉండగా, మరొకరు మొట్టమొదటి సారి రెడ్-బాల్ ఫార్మాట్‌లో అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నారు.
కరుణ్ నాయర్ టెస్ట్ కెరీర్ ఎంత త్వరగా వెలుగులోకి వచ్చిందో, అంతే వేగంగా వెనక్కి పడిపోయింది. 2016లో ఇంగ్లాండ్‌పై ట్రిపుల్ సెంచరీ చేసి, వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత ఆ ఘనత సాధించిన రెండవ భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అయినప్పటికీ, కొద్దికాలానికే జట్టులో స్థానం కోల్పోయిన అతను ఇప్పుడు ఏడేళ్ల అనంతరం తిరిగి ఎంపికయ్యాడు. దేశవాళీ క్రికెట్‌లో తన సత్తా చాటుతూ 2024-25 రంజీ ట్రోఫీలో 863 పరుగులతో నాలుగో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 32 ఏళ్ల వయసులో ఉండే నాయర్‌కు విదేశీ పరిస్థితులలో ఆడిన అనుభవం, నెమ్మదిగా కానీ స్థిరంగా ఇన్నింగ్స్ నిర్మించగల సామర్థ్యం ఉండటంతో, అతను నెంబర్ 3 స్థానానికి సరైన ఎంపికగా కనిపిస్తున్నాడు.
ఇతర అభ్యర్థిగా ఉన్న సాయి సుదర్శన్, ఐపీఎల్‌లో ముద్రవేసిన యువ క్రికెటర్‌గా పేరు తెచ్చుకున్నాడు. వయసు కేవలం 23 సంవత్సరాలే అయినప్పటికీ, అతను వివిధ ఫార్మాట్లకు తగిన ఆటను ప్రదర్శిస్తూ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఇంగ్లాండ్‌లో సర్రె తరపున కౌంటీ క్రికెట్ ఆడిన అనుభవంతో ఆ పరిస్థితులపై కొంత అవగాహన కలిగి ఉన్నా, టెస్ట్ ఫార్మాట్‌లో అనుభవం లేకపోవడం అతని మైనస్ పాయింట్. ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో సగటు 40 కంటే తక్కువగా ఉండడం అతని స్థిరత్వంపై ప్రశ్నలు రేపుతున్నాయి. సెలెక్టర్లు భవిష్యత్ టెస్టులకు బలమైన టీమ్ నిర్మాణంలో భాగంగా అతనిని ఎంపిక చేసినట్టు అర్థమవుతోంది.
మరోవైపు, నెంబర్ 3 స్థానంపై చర్చలో కెఎల్ రాహుల్ పేరు సహజంగానే ముందుకు వచ్చింది. కానీ భారత్ టెస్ట్ ఓపెనర్‌గా రాహుల్‌ను కొనసాగించే అవకాశమే ఎక్కువ. రోహిత్ శర్మ పదవీ విరమణ తర్వాత రాహుల్ అనుభవం ఓపెనింగ్ స్లాట్‌కు అత్యంత అవసరం. అదే సమయంలో, కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడని అంచనా. గిల్ ఇప్పటికే ఆ స్థానంలో కొన్ని సిరీస్‌లలో ప్రదర్శన చూపించి స్థిరతను చూపాడు. అతనికి ఉన్న ఫుట్‌వర్క్, కాంపాక్ట్ గేమ్ నెంబర్ 4 స్థానానికి అనువైనవిగా ఉన్నాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



