12 మ్యాచ్‌ల్లో 85 పరుగులు.. 4 సార్లు డకౌట్‌లు.. పంజాబ్ ఆశలను ముంచాడు.. టీ20 ప్రపంచ కప్‌లో మాత్రం దంచేస్తానంటోన్న ప్లేయర్..!
T20 World Cup 2021: పంజాబ్ కింగ్స్ తరపున ఆడిన ఈ బ్యాట్స్‌మెన్‌పై జట్టు చాలా ఆశలు పెట్టుకుంది. కానీ, ఈ ఆటగాడు వారి అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోయాడు. ఈ ఆటగాడు తన ప్రదర్శనతో నిరాశ చెందాడు.
వెస్టిండీస్ జట్టు రెండుసార్లు టీ 20 ప్రపంచకప్ గెలిచింది. ఈసారి కూడా ఆజట్టు బలమైన పోటీదారుగా ఉంది. వెస్టిండీస్ టీం ఎప్పుడైనా ఏదైనా చేయగలదు. ఆ జట్టులో ముఖ్యమైన ఆటగాడు నికోలస్ పూరన్.. వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే, పూరన్ ప్రస్తుత ఫాం అంత బాగోలేదు. ఐపీఎల్ 2021 (IPL 2021)లో పంజాబ్ కింగ్స్‌తో తరపును ఆడాడు. అయితే అతని బ్యాట్ నుంచి మాత్రం పరుగులు రాలేదు. ఎంతో దారుణంగా విఫలమయ్యాడు. కానీ, పూరన్ దీని గురించి ఆందోళన చెందడం లేదంట. టీ 20 ప్రపంచకప్‌కు ముందు అతని ఫామ్ తనకు ఎలాంటి సమస్య కాదని అతను పేర్కొన్నాడు. ఈ సీజన్‌లో పూరన్ 12 మ్యాచ్‌లు ఆడి, మొత్తం 85 పరుగులు మాత్రమే చేశాడు.
“ఐపీఎల్ ముగిసింది. నేను నా దృష్టిని టీ20 ప్రపంచ కప్‌పై ఉంచాను. నేను నిరాశపరిచానని నాకు తెలుసు. ఫలితాన్ని పొందడానికి నేను చాలా తొందరపడ్డాను. అందుకు తగిన మూల్యం చెల్లించాను. మీరు దీన్ని నా స్కోర్‌లో చూడవచ్చు. అయితే ప్రస్తుతం నేను దృష్టి పెట్టాల్సిన విషయం అదికాదు. పొట్టి క్రికెట్‌లో మాజట్టు ప్రదర్శనపై ఫోకస్ పెట్టాం. నేను కష్టపడి పనిచేస్తాను. అలాగే ప్లాన్ చేస్తాను. ఇది సాధారణ విషయం” అని ఈఎస్‌పీఎన్‌తో పేర్కొన్నాడు.
దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన రికార్డులతో ఆకట్టుకున్నాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL)లో గయానా అమెజాన్ వారియర్స్‌తో ఆడిన తుఫాన్ ఇన్నింగ్స్‌తో పంజాబ్ జట్టులోకి వచ్చాడు. కానీ, ఐపీఎల్‌లో మాత్రం పరుగులు సాధించలేకపోయాడు. అయితే ఇది ఒక చిన్న సంఘటన అంటూ పూరన్ తెలిపాడు. పూరన్ ఐపీఎల్‌లో తాను తక్కువ బంతులు ఆడానని, అందుకే ఇది ఫామ్ అని పిలవలేమని చెప్పాడు. “నేను దేని గురించి ఆందోళన చెందను. నా క్రికెట్ ఆటపై విశ్వాసం ఉంది. నేను మొదటి సీజన్‌లో ఆరు-ఏడు మ్యాచ్‌లలో 20 పరుగులు చేశాను. నేను వెస్టిండీస్ తరఫున ఆడిన చివరి మూడు సిరీస్‌లలో బాగా స్కోర్ చేశాను. ఆపై సీపీఎల్లో కూడా బాగానే ఆడాను. నా మనసులో ఎలాంటి సందేహాలు లేవు” అంటూ చెప్పుకొచ్చాడు.
అయితే ఇలాంటి దశ చాలా మంది ఆటగాళ్లకు ఉంటుందని పూరన్ తెలిపాడు. “ఇది ఒక గేమ్. చాలా మంది ఆటగాళ్లు, క్రికెటర్లకు చెడ్డ దశ అనేది చూస్తారు. ఇలాంటి వాటినుంచి అందరూ బయటకు వస్తారు. ఇది నా ప్యాచ్ అని నేను చెప్పను. నేను ఐపీఎల్ రెండవ భాగంలో ఆడలేదు. కానీ, సీపీఎల్‌లో బాగా బ్యాటింగ్ చేశాను. అయితే ఐపీఎల్‌లో నేను ఎక్కువ బంతులు ఆడలేకపోవడం కూడా ఓ కారణం కావొచ్చు” అని పేర్కొన్నాడు.
Also Read: Big News: టీమిండియాకు దూరం కానున్న విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ.. కారణం ఏంటంటే?