AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సెహ్వాగ్ సెంచరీ ఆపాడు.. కెరీర్ సర్వనాశనం చేసుకున్నాడు! పాపం.. ఇప్పుడు బస్ డ్రైవర్‌గా..

2010లో శ్రీలంకతో జరిగిన వన్డేలో వీరేందర్ సెహ్వాగ్ 99 పరుగుల వద్ద ఉన్నప్పుడు భారత్ విజయానికి ఒక్క పరుగు అవసరమైంది. శ్రీలంక బౌలర్ సూరజ్ రండీవ్ నోబాల్ వేయడంతో మ్యాచ్ ముగిసింది. సెహ్వాగ్ సెంచరీ మిస్ కావడంతో తీవ్ర వివాదం చెలరేగింది. రండీవ్‌పై చర్యలు తీసుకున్నారు.

సెహ్వాగ్ సెంచరీ ఆపాడు.. కెరీర్ సర్వనాశనం చేసుకున్నాడు! పాపం.. ఇప్పుడు బస్ డ్రైవర్‌గా..
Virender Sehwag 99, Suraj Randiv
SN Pasha
|

Updated on: Aug 15, 2026 | 3:07 PM

Share

క్రికెట్‌లో కొన్ని సంఘటనలు మ్యాచ్‌ ఫలితాన్ని మించి అభిమానుల జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి. అలాంటి సంఘటనే 2010 ఆగస్టు 16న శ్రీలంకలోని దంబుల్లాలో జరిగిన భారత్-శ్రీలంక వన్డేలో చోటుచేసుకుంది. ఆ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ 99 పరుగులతో నాటౌట్‌గా నిలిచిపోయాడు. మ్యాచ్ గెలవడానికి భారత్‌కు ఒక్క పరుగు మాత్రమే అవసరం కాగా, శ్రీలంక ఆఫ్ స్పిన్నర్ సూరజ్ రందీవ్ వేసిన నోబాల్ కారణంగా సెహ్వాగ్ సెంచరీ మిస్ అయ్యింది.

అసలు మ్యాచ్‌లో ఏం జరిగింది?

శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేసి 46.1 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది. భారత్ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సెహ్వాగ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 100 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 99 పరుగులకు చేరుకున్నాడు. భారత్ స్కోరు 170 వద్ద ఉండగా, జట్టు విజయానికి ఒక్క పరుగు మాత్రమే కావాల్సి వచ్చింది. మరోవైపు సెహ్వాగ్‌కు కూడా సెంచరీకి ఒక్క పరుగు అవసరం. అలాంటి సమయంలో సూరజ్ రందీవ్ బంతి వేయడానికి ముందే క్రీజ్ దాటి నోబాల్ వేశాడు. అంపైర్ నోబాల్ ప్రకటించడంతో భారత్‌కు అదనంగా ఒక పరుగు లభించింది. దీంతో మ్యాచ్ అక్కడే ముగిసిపోయింది. సెహ్వాగ్ ఆ బంతిని భారీ సిక్సర్‌గా కొట్టినా, నోబాల్‌తోనే భారత్ విజయ పరుగు పూర్తయినందున ఆ షాట్ స్కోరులో చేరలేదు. ఫలితంగా సెహ్వాగ్ 99 పరుగులతోనే నాటౌట్‌గా నిలిచిపోయాడు.

కావాలనే నోబాల్ వేశాడా?

ఈ సంఘటనపై వెంటనే తీవ్ర వివాదం చెలరేగింది. సెహ్వాగ్ మ్యాచ్ అనంతరం నోబాల్ కావాలనే వేసినట్లుగా భావిస్తున్నానని చెప్పాడు. స్పిన్నర్ అయినప్పకీ చాలా ముందుకు వచ్చి ఉద్దేశపూర్వకంగా నో బాల్ వేసినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో రందీవ్ సెహ్వాగ్‌కు క్షమాపణలు కూడా చెప్పాడు. శ్రీలంక క్రికెట్ అధికారులు కూడా ఈ ఘటనపై స్పందించారు. అప్పటి శ్రీలంక జట్టు సహచరుడు తిలకరత్నే దిల్షాన్ రందీవ్‌ను నోబాల్ వేయమని ప్రోత్సహించినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి.

రందీవ్‌పై చర్యలు.. ఒక మ్యాచ్ నిషేధం

ఈ వివాదాన్ని శ్రీలంక క్రికెట్ తీవ్రంగా పరిగణించింది. సూరజ్ రందీవ్‌కు మ్యాచ్ ఫీజులో కోత విధించడంతో పాటు ఒక మ్యాచ్ సస్పెన్షన్ కూడా విధించింది. అయితే ఈ ఒక్క సంఘటన కారణంగా అతని అంతర్జాతీయ కెరీర్‌పై తీవ్ర ప్రభావం పడింది. ఆ ఘటనతో ఆత్మవిశ్వాసం కోల్పోయిన రందీవ్ జట్టులోకి వస్తూ పోతూ ఉండే వాడు. ఆ ఘటన తర్వాత అతను కేవలం నాలుగైదు వన్డేలు మాత్రమే ఆడాడు. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

ఐపీఎల్‌లోనూ అవకాశం

శ్రీలంక జట్టుతో పాటు రందీవ్‌కు ఐపీఎల్‌లోనూ అవకాశం లభించింది. 2011లో చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని కొనుగోలు చేసింది. రెండు సీజన్ల పాటు ఆ జట్టులో ఆడిన తర్వాత 2012లో విడుదలయ్యాడు. అనంతరం ఉత్తర ఐర్లాండ్‌లో క్లబ్ క్రికెట్ ఆడిన రండీవ్, ఆస్ట్రేలియాకు వెళ్లి అక్కడి జిల్లా స్థాయి క్రికెట్‌లో కూడా పాల్గొన్నాడు. 2020లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు నెట్స్‌లో బౌలింగ్ చేయడానికి కూడా అతనికి అవకాశం వచ్చింది.

ఇప్పుడు ఆస్ట్రేలియాలో బస్ డ్రైవర్

క్రికెట్ కెరీర్ ముగిసిన తర్వాత సూరజ్ రందీవ్ జీవితం పూర్తిగా మరో మలుపు తిరిగింది. ఆస్ట్రేలియాలో స్థిరపడిన ఆయన మెల్‌బోర్న్‌లో బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు 2021లో పలు మీడియా సంస్థలు వెల్లడించాయి. ఫ్రాన్స్‌కు చెందిన అంతర్జాతీయ ప్రజా రవాణా సంస్థ ట్రాన్స్‌దేవ్‌లో ఆయన బస్ డ్రైవర్‌గా పనిచేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి. అదే సమయంలో స్థానిక క్రికెట్‌లోనూ తన అనుబంధాన్ని కొనసాగించాడు.

Follow Us