Virat Kohli: మొత్తానికి కోహ్లీ రిటైర్మెంట్ పై నోరు మెదిపిన BCCI! ఏప్రిల్ లోనే ఇదంతా..
భారత్ టెస్ట్ జట్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. విరాట్ కోహ్లీ టెస్ట్ నుంచి ఏప్రిల్ నెలలోనే రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాడని బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తెలిపారు. రోహిత్ శర్మ కూడా టెస్ట్ కెరీర్‌కు ముగింపు పలికారు. కొత్త జట్టు మే 24న ప్రకటించబడింది, ఇందులో శుభ్‌మాన్ గిల్‌ను కెప్టెన్‌గా, రిషబ్ పంత్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఫిట్‌నెస్ కారణాల వల్ల షమీ, సర్ఫరాజ్ జట్టుకు దూరమయ్యారు. కొత్త నాయకత్వంతో భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు సిద్దమవుతోంది.

భారత టెస్ట్ జట్టులో ఇటీవల చోటుచేసుకున్న కీలక మార్పులు, రిటైర్మెంట్‌లు, నాయకత్వ బాధ్యతల మార్పులు వంటి అంశాలు దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల మధ్య చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా, భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన విషయాన్ని భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మే 12, 2025న కోహ్లీ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ, అతను ఈ నిర్ణయాన్ని ఏప్రిల్‌లోనే తీసుకున్నాడని అగార్కర్ వెల్లడించారు. “ఏప్రిల్ ప్రారంభంలోనే విరాట్ కోహ్లీ నాకు ఫోన్ చేసి టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ కావాలన్న నిర్ణయాన్ని తెలియజేశాడు. అతని నిర్ణయాన్ని మేము గౌరవించాం. BCCI అతని కోరికకు అనుగుణంగా, గౌరవప్రదంగా గుడ్‌బై చెప్పేందుకు అవకాశమిచ్చింది,” అని అగార్కర్ విలేకరుల సమావేశంలో తెలిపారు.
ఇక కోహ్లీ మాత్రమే కాదు, భారత టెస్ట్ జట్టుకు మరో కీలక సీనియర్ ఆటగాడు అయిన రోహిత్ శర్మ కూడా తన టెస్ట్ కెరీర్‌కు ముగింపు పలికాడు. ఈ ఇద్దరు దిగ్గజులు వైదొలగడంతో, భారత టెస్ట్ జట్టులో సరికొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. మే 24న భారత టెస్ట్ జట్టును ప్రకటించిన సందర్భంగా, శుభ్‌మాన్ గిల్‌ను కొత్త టెస్ట్ కెప్టెన్‌గా నియమించారు. రిషబ్ పంత్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. గిల్ ఇప్పటివరకు టెస్ట్ ఫార్మాట్‌లో నాయకత్వ అనుభవం కలిగి లేకపోయినా, అతను వన్డేలు, టీ20లు, ఐపీఎల్‌లో నాయకత్వం వహించిన అనుభవం బీసీసీఐకి ధైర్యం ఇచ్చింది. గిల్‌కు భవిష్యత్ నేతగా తీర్చిదిద్దే లక్ష్యంతో దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అజిత్ అగార్కర్ పేర్కొన్నారు.
జట్టులోని కొన్ని ఇతర కీలక మార్పులు కూడా విశేషంగా చర్చకు తెరతీశాయి. ఫిట్‌నెస్ సమస్యల కారణంగా మహ్మద్ షమీ, సర్ఫరాజ్ ఖాన్ జట్టుకు దూరమయ్యారు. అశ్విన్ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన తర్వాత, కుల్దీప్ యాదవ్‌కు తిరిగి అవకాశమిచ్చారు. అలాగే, రంజీ ట్రోఫీలో అద్భుతంగా రాణించిన కరుణ్ నాయర్, అభిమన్యు ఈశ్వరన్‌లకు జట్టులో చోటు దక్కింది. జట్టులో యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురేల్ లాంటి యువతర ఆటగాళ్లు ఉన్నారు.
ఈ మార్పులతో భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటన కోసం సరికొత్త రూపాన్ని సంతరించుకుంది. గతంలో జట్టుకు నాయకత్వం వహించిన జస్‌ప్రీత్ బుమ్రా, కెఎల్ రాహుల్ లాంటి అనుభవం కలిగిన ఆటగాళ్లు ఉన్నప్పటికీ, బౌలింగ్ లొడ్స్, ఫిట్‌నెస్ సమస్యల నేపథ్యంలో వారిని నాయకత్వ పాత్రల నుండి పక్కనపెట్టారు. గిల్‌కు పూర్తి స్థాయి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తూ, భారత క్రికెట్‌ను కొత్త దిశగా తీసుకెళ్లే ప్రయత్నం బీసీసీఐ చేపట్టింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



