Virat Kohli: విరాట్ కోహ్లీ నిర్ణయం నేపథ్యంలో తదుపరి రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు కెప్టెన్ ఎవరు?
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న విరాట్‌కోహ్లీ క్రికెట్‌లో ఒక్కో పదవికి గుడ్‌బై చెబుతూ వెళ్తున్నాడు.
Royal Challengers Bangalore – Virat Kohli: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న విరాట్ కోహ్లీ క్రికెట్‌లో ఒక్కో పదవికి గుడ్‌బై చెబుతూ వెళ్తున్నాడు. త్వరలో జరగనున్న టీ 20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా టీ20 జట్టు కెప్టెన్‌గా వైదొలుతానని నిర్ణయం ప్రకటించి ఇప్పటికే అభిమానులకు షాక్‌కు గురిచేసిన కోహ్లీ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్ 2021 తర్వాత రాయల్ ఛాలంజెర్స్ బెంగళూరు కెప్టెన్సీ కూడా వదులుకోవాలని డిసైడయ్యాడీ డాషింగ్ బ్యాట్స్‌మన్.
ఈ సీజన్ మ్యాచ్‌లు పూర్తికాగానే కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నట్లు కోహ్లీ వెల్లడించాడు. ఆర్‌సీబీ జట్టులో ఆటగాడిగా మాత్రమే కొనసాగుతానని తెలిపాడు కోహ్లీ. కెప్టెన్‌గా ఇదే తనకు చివరి ఐపీఎల్ సీజన్ అని తెలిపాడు కోహ్లీ. అయితే తన చివరి ఐపీఎల్ వరకు ఆర్‌సీబీ జట్టుతోనే ఉంటానన్నాడు. ఇన్నాళ్లు నమ్మకం ఉంచి, మద్దతు ఇచ్చిన ఆర్‌సీబీ అభిమానులకు, జట్టు యాజమాన్యానికి కోహ్లీ కృతజ్ఞతలు తెలిపాడు. ఆర్‌సీబీ జట్టు తరఫున 2008 నుంచి కోహ్లీ ఆడుతున్నాడు. 2013 నుంచి ఆ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
అయితే, ఇంత హఠాత్తుగా ఆర్‌సీబీ కెప్టెన్సీని ఎందుకు వదులుకుంటున్నాడో కారణం మాత్రం తెలియలేదు. ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అయితే వ్యక్తిగతంగా అత్యధిక పరుగుల చేసిన ఆటగాడిగా రికార్డు ఉన్నప్పటికీ కోహ్లీ సార్థథ్యంలోని ఆర్‌సీబీ జట్టు ఇంతవరకు ఐపీఎల్ కప్పు గెలవలేకపోయింది. 2009, 2011, 2016లో ఆర్‌సీబీ ఫైనల్ చేరినప్పటికీ రన్నరప్‌గానే నిలిచింది. ఇక, కోహ్లీ తర్వాత ఆర్సీబీ పగ్గాలు ఎవరు చేపడతారనే ఉత్కంఠ క్రికెట్ అభిమానుల్లో హాట్ టాపిక్ అయింది.