Vaibhav Sooryavanshi : లంక గొడవ మరవకముందే.. అఫ్గన్‌తో మ్యాచ్‌లో మరో వివాదంలో వైభవ్ సూర్యవంశీ
Vaibhav Sooryavanshi : అఫ్గానిస్తాన్-ఏతో జరిగిన కీలక మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ మరోసారి వివాదంలో నిలిచాడు. క్యాచ్‌పై థర్డ్ అంపైర్ నాటౌట్ నిర్ణయం ఇవ్వడంతో అఫ్గాన్ ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. చివరకు 38 పరుగుల వద్ద వైభవ్ అవుట్ కాగా, మ్యాచ్ ఉత్కంఠగా సాగుతోంది.

Vaibhav Sooryavanshi : శ్రీలంకలోని దంబల్లా వేదికగా జరుగుతున్న ట్రై సిరీస్ 2026లో భారత యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ బుధవారం మరోసారి హాట్ టాపిక్‌గా మారాడు. ఇండియా-ఎ, అఫ్గానిస్తాన్-ఎ జట్ల మధ్య జరుగుతున్న కీలకమైన మ్యాచ్‌లో ఒక వివాదాస్పద క్యాచ్ డ్రామా నడిచింది. ఐపీఎల్ 2026లో పరుగుల వరద పారించి స్టార్‌గా మారిన ఈ 15 ఏళ్ల బ్యాటర్.. మొన్ననే శ్రీలంక ప్లేయర్లతో ఆన్‌ఫీల్డ్ ఫైట్ ఆడి వార్తల్లో నిలిచాడు. ఆ వేడి చల్లారకముందే అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఒక వివాదాస్పద అంపైరింగ్ నిర్ణయంతో మరోసారి సూర్యవంశీ లైమ్‌లైట్‌లోకి వచ్చాడు.
మైదానంలో క్యాచ్ వివాదం.. ఏం జరిగిందంటే?
ఇండియా ఇన్నింగ్స్ 2వ ఓవర్ లో అఫ్గాన్ బౌలర్ షామ్స్ ఉర్ రెహ్మాన్ వేసిన ఒక షార్ట్ డెలివరీని వైభవ్ గాల్లోకి కట్ షాట్ ఆడాడు. ఆ సమయంలో పాయింట్ ఫీల్డర్ ఫరిదూన్ దావూద్‌జాయ్ ఎడమవైపునకు అద్భుతంగా డైవ్ చేస్తూ ఒక సూపర్ క్యాచ్ అందుకున్నాడు. అఫ్గాన్ ప్లేయర్స్ సంబరాల్లో మునిగిపోగా.. వైభవ్ నిరాశగా పెవిలియన్ వైపు అడుగులు వేశాడు. అయితే సరిగ్గా అదే సమయంలో ఆన్‌ఫీల్డ్ అంపైర్లు అతడిని ఆపారు. క్యాచ్ క్లీన్‌గా పట్టుకున్నారా లేదా అని తెలుసుకోవడానికి థర్డ్ అంపైర్ ప్రగీత్ రాంబుక్వెల్లాకు రిఫర్ చేశారు. రీప్లేలను క్షుణ్ణంగా పరిశీలించిన థర్డ్ అంపైర్.. ఫీల్డర్ క్యాచ్ పూర్తిగా అందుకోవడానికి ముందే బంతి భూమిని తాకినట్లు తేల్చారు.
అంపైర్ నిర్ణయంపై అఫ్గానిస్తాన్ ఆగ్రహం
థర్డ్ అంపైర్ స్క్రీన్ పై నాటవుట్ అని ప్రకటించడంతో వైభవ్ సూర్యవంశీ ఊపిరి పీల్చుకుని మళ్లీ క్రీజులోకి వచ్చాడు. అయితే అంపైర్ తీసుకున్న ఈ నిర్ణయంపై అఫ్గానిస్తాన్ ఆటగాళ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అది పర్ఫెక్ట్ క్యాచ్ అంటూ అంపైర్లతో కాసేపు వాదనకు దిగారు. ఈ అంపైరింగ్ వివాదం సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చకు దారితీసింది. ఆ వెంటనే జరిగిన తరువాతి ఓవర్ లో వైభవ్‌కు మరో లైఫ్‌లైన్ దక్కింది. ఈసారి క్యాచ్ పట్టిన ఫీల్డర్ ఫరిదూన్ దావూద్‌జాయ్ బౌలింగ్ వేయగా.. షార్ట్ ఫైన్ లెగ్ ఫీల్డర్ చాలా ఈజీ క్యాచ్‌ను నేలపాలు చేశాడు.
— crictalk (@crictalk7) June 17, 2026
వైల్డ్ సెలబ్రేషన్స్‌తో పగ తీర్చుకున్న అఫ్గాన్ బౌలర్
రెండుసార్లు అదృష్టం కలిసివచ్చినప్పటికీ వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్‌లో పెద్ద స్కోరు చేయలేకపోయాడు. క్రీజులో ఉన్నంతసేపు కాస్త దూకుడుగా ఆడిన అతడు 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 28 బంతుల్లో 38 పరుగులు చేశాడు. అయితే ఏ బౌలర్ క్యాచ్‌ను అయితే అంపైర్ తిరస్కరించాడో.. అదే ఫరిదూన్ దావూద్‌జాయ్ వేసిన ఓవర్ లో వైభవ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వైభవ్ వికెట్ పడగొట్టిన ఆనందంలో అఫ్గాన్ బౌలర్ దావూద్‌జాయ్ మైదానంలో ఎగిరి గంతేస్తూ చాలా అగ్రెసివ్‌గా వైల్డ్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. దీనితో వైభవ్ ఇన్నింగ్స్ ముగిసింది.
భారత జట్టుకు చావో రేవో మ్యాచ్
మరోవైపు ఈ త్రైపాక్షిక సిరీస్ ప్రస్తుతం అత్యంత ఉత్కంఠభరితమైన దశకు చేరుకుంది. తిలక్ వర్మ కెప్టెన్సీ వహిస్తున్న ఇండియా-ఎ జట్టుకు ఈ మ్యాచ్ సెమీఫైనల్ లాంటిది. ఒకవేళ భారత్ ఈ మ్యాచ్‌లో ఓడిపోతే టోర్నమెంట్ నుంచి పూర్తిగా నిష్క్రమిస్తుంది. అందువల్ల ఈ మ్యాచ్ లో విజయం సాధించడం జట్టుకు ఎంతో కీలకం. వైభవ్ అవుట్ అయినప్పటికీ.. భారత జట్టు మొదటి 10 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 91 పరుగులు చేసి మంచి టెంపోను కొనసాగిస్తోంది. ప్రస్తుతం క్రీజులో ప్రియాంశ్ ఆర్య 48 పరుగులతో, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 4 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
