AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్యాన్సర్‌తో తల్లి మరణం.. రెస్టారెంట్‌లో రోజుకు 12 గంటలు పని.. బుమ్రా, అక్షర్ బెస్ట్ ఫ్రెండ్ శాడ్ స్టోరీ వింటే కన్నీళ్లే

Monank Patel: ఈ క్లిష్ట సమయంలోనే మోనాంక్ జీవితంలో క్రికెట్ మళ్ళీ ప్రాధాన్యతను సంతరించుకుంది. 2018 సెప్టెంబర్ లో అతను యుఎస్‌ఏ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తన మొదటి యుఎస్‌ఏ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు సాధించి, ఒమన్‌పై సెంచరీ నమోదు చేశాడు.

క్యాన్సర్‌తో తల్లి మరణం.. రెస్టారెంట్‌లో రోజుకు 12 గంటలు పని.. బుమ్రా, అక్షర్ బెస్ట్ ఫ్రెండ్ శాడ్ స్టోరీ వింటే కన్నీళ్లే
Monank Patel
Venkata Chari
|

Updated on: Jul 15, 2025 | 8:46 PM

Share

Monank Patel: క్రికెట్ ప్రపంచంలో ఎందరో ఆటగాళ్లు తమ కలలను నిజం చేసుకోవడానికి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటారు. అటువంటి కోవకే చెందినవాడు అమెరికా క్రికెట్ జట్టు కెప్టెన్ మోనాంక్ పటేల్. భారత గడ్డపై క్రికెటర్‌గా ఎదగాలని కలలు కన్న మోనాంక్, అనుకోని పరిస్థితుల్లో అమెరికాకు వలస వెళ్లి, అక్కడ రెస్టారెంట్‌లో 12 గంటలు కష్టపడి, తల్లి క్యాన్సర్‌తో పోరాడుతున్న సమయంలోనూ తన క్రికెట్ కలను వదులుకోకుండా పోరాడాడు. అతని జీవిత ప్రయాణం ఎందరికో స్ఫూర్తినిస్తుంది.

గుజరాత్‌లోని ఆనంద్‌లో జన్మించిన మోనాంక్ పటేల్‌కు చిన్నతనం నుంచే క్రికెట్ అంటే ప్రాణం. జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ వంటి ప్రస్తుత భారత స్టార్లతో కలిసి అండర్-16, అండర్-18 స్థాయిలో గుజరాత్ తరపున క్రికెట్ ఆడాడు. భారత జట్టుకు ఆడాలనేది అతని చిరకాల స్వప్నం. కానీ, అహ్మదాబాద్, సూరత్ వంటి పెద్ద జిల్లాల ఆటగాళ్ల ఆధిపత్యం కారణంగా గుజరాత్ సీనియర్ జట్టులో చోటు దక్కించుకోవడం అతనికి కష్టమైంది.

2010లో గ్రీన్ కార్డ్ పొందిన మోనాంక్, 2016లో శాశ్వతంగా అమెరికాకు మారాడు. అక్కడ న్యూజెర్సీలో స్థిరపడ్డాడు. క్రికెట్‌కు దూరమైన మోనాంక్, జీవనోపాధి కోసం రెస్టారెంట్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. సౌత్ కరోలినాలో ‘టెరియాకి మ్యాడ్ నెస్’ అనే చైనీస్ రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. దాదాపు రెండేళ్లపాటు రోజుకు 10-12 గంటలు రెస్టారెంట్‌లో కష్టపడ్డాడు. అమ్మకాలు తక్కువగా ఉండటంతో, ఖర్చులు తగ్గించుకోవడానికి మేనేజర్‌గా, చెఫ్‌గా కూడా పనిచేశాడు.

ఒకవైపు వ్యాపారం అంతగా లాభాలు తీసుకురాకపోవడం, మరోవైపు అతని జీవితంలో ఊహించని విషాదం. అతని తల్లికి క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఈ వార్త మోనాంక్‌ను తీవ్రంగా కలచివేసింది. తల్లికి తోడుగా ఉండటానికి, వ్యాపారంలో నష్టాలు రావడంతో రెస్టారెంట్‌ను అమ్మేసి, తన బ్యాంక్ ఖాతాలో కేవలం $3,000 మాత్రమే మిగిలి ఉండగా, న్యూజెర్సీలోని తల్లి వద్దకు తిరిగి వచ్చాడు.

ఈ క్లిష్ట సమయంలోనే మోనాంక్ జీవితంలో క్రికెట్ మళ్ళీ ప్రాధాన్యతను సంతరించుకుంది. 2018 సెప్టెంబర్ లో అతను యుఎస్‌ఏ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తన మొదటి యుఎస్‌ఏ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు సాధించి, ఒమన్‌పై సెంచరీ నమోదు చేశాడు. ఆ సమయంలో అతని తల్లి ఆరోగ్యం క్షీణించి, మాట్లాడలేని స్థితిలో ఉన్నప్పటికీ, మోనాంక్ సెంచరీ చేసినప్పుడు ఆనందంతో విజిల్స్ వేసిందని చెబుతారు. ఒక నెల తర్వాత, మరణశయ్యపై ఉన్న అతని తల్లి, “ఆడుతూ ఉండు, కష్టపడి పని చేయి” అనే చివరి మాటలను మోనాంక్‌కు చెప్పి కన్నుమూసింది.

తల్లి చివరి మాటలు మోనాంక్‌కు గొప్ప ప్రేరణగా నిలిచాయి. “నా తల్లితో నాకు ప్రత్యేక బంధం ఉంది. జీవితంలో, క్రికెట్‌లో అన్ని విషయాలకు ఆమె నాకు ఆశ్రయం. నేను ఇప్పుడు క్రికెట్ ఆడటానికి కారణం ఆమె” అని మోనాంక్ గుర్తు చేసుకుంటాడు. 2019లో నేపాల్‌తో జరిగిన టూర్‌లో పేలవ ప్రదర్శన చేసినప్పుడు, మోనాంక్ నిద్రలేని రాత్రులు గడిపి, ఒక నోట్ ప్యాడ్‌లో నాలుగు పేజీల నిండా “నేను కష్టపడతాను” అని పదేపదే రాసుకున్నాడు.

ఆ తర్వాత, కొత్త కోచ్ జె. అరుణ్ కుమార్ ‌ను సంప్రదించి, కోవిడ్ విరామం తర్వాత యుఎస్‌ఏ ఆడే మొదటి టోర్నమెంట్‌లో టాప్ స్కోరర్‌గా నిలవడానికి ఏదైనా చేస్తానని చెప్పాడు. తన కృషి, పట్టుదలతో మోనాంక్ యుఎస్‌ఏ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఎదిగాడు. పాకిస్తాన్‌పై చారిత్రాత్మక విజయంలో కీలక పాత్ర పోషించాడు.

మోనాంక్ పటేల్ జీవితం కష్టాలు, సవాళ్లు ఎదురైనప్పుడు ఎలా నిలదొక్కుకోవాలి, కలలను ఎలా వదులుకోకూడదు అనేదానికి ఒక గొప్ప ఉదాహరణ. అతని ప్రయాణం నిరంతర కృషి, అంకితభావం, కుటుంబం పట్ల ప్రేమకు నిదర్శనం.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..