AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TV9 CBC 2026 : హైదరాబాద్‌లో టీవీ9 బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ సీజన్ 2 షురూ..

TV9 Badminton : హైదరాబాద్‌లో టీవీ9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ సీజన్ 2 నేడు ప్రారంభమైంది. గోపీచంద్ అకాడమీలో జరిగే ఈ మెగా ఈవెంట్‌లో దిగ్గజ కంపెనీలు పాల్గొంటున్నాయి. నేటి నుంచి మే 17 వరకు మూడు రోజుల పాటు ఈ క్రీడా సంబరం కొనసాగనుంది.

TV9 CBC 2026 : హైదరాబాద్‌లో టీవీ9 బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ సీజన్ 2 షురూ..
Tv9 Badminton
Rakesh
|

Updated on: May 15, 2026 | 12:38 PM

Share

TV9 CBC 2026: సాధారణంగా ఏసీ గదుల్లో, కంప్యూటర్ స్క్రీన్ల ముందు కుస్తీ పట్టే కార్పొరేట్ ఉద్యోగులు ఇప్పుడు బ్యాడ్మింటన్ కోర్టులో తమ సత్తా చాటబోతున్నారు. టీవీ9 నెట్‌వర్క్ ఆధ్వర్యంలో కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ సీజన్ 2 నేడు (మే 15, 2026) హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో అట్టహాసంగా ప్రారంభమైంది. నేటి నుంచి మే 17 వరకు మూడు రోజుల పాటు ఈ క్రీడా సంబరం కొనసాగనుంది.

ఈ టోర్నమెంట్‌లో ప్రపంచ ప్రఖ్యాత ఐటీ, ఇతర రంగాలకు చెందిన దిగ్గజ కంపెనీలు పాల్గొంటున్నాయి. మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఇన్ఫోసిస్ వంటి అగ్రగామి సంస్థల ప్రతినిధులు కోర్టులోకి దిగబోతున్నారు. గత సీజన్‌లో గూగుల్, డెల్, ఉబెర్, మై హోమ్, ఐకియా, డెలాయిట్, డాక్టర్ రెడ్డీస్ వంటి దాదాపు 64కు పైగా జట్లు పాల్గొని 1,000కి పైగా మ్యాచ్‌లతో అలరించాయి. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో భారీ స్పందన లభిస్తోంది. ఈ రోజు ఉదయం నుంచే ఉద్యోగులు ఇందులో పాల్గొనేందుకు భారీగా తరలి వచ్చారు. ఈ పోరులో 300 మందికి పైగా క్రీడాకారులు  తలపడుతున్నారు.

Tv9 Badminton

భారత బ్యాడ్మింటన్ దిగ్గజం, పద్మభూషణ్ అవార్డు గ్రహీత పుల్లెల గోపీచంద్ మార్గదర్శకత్వంలో ఈ టోర్నమెంట్ జరుగుతోంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గోపీచంద్ అకాడమీలో ఆడే అవకాశం రావడం కార్పొరేట్ ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. కేవలం పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడమే కాకుండా, క్రీడా స్ఫూర్తిని చాటేందుకు ఇదొక గొప్ప వేదికగా నిలిచింది.

రూ. 5 లక్షల ప్రైజ్ మనీ.. కేటగిరీలు ఇవే

* ఈ ఛాంపియన్‌షిప్‌లో గెలుపొందిన విజేతలకు ట్రోఫీలతో పాటు మొత్తం రూ.5 లక్షల ప్రైజ్ మనీని అందించనున్నారు. ఇందులో ప్రధానంగా రెండు కేటగిరీలు ఉన్నాయి.

Tv9 Badminton

* టీమ్ ఛాంపియన్‌షిప్: పురుషుల టీమ్ ఈవెంట్‌లో రెండు సింగిల్స్, ఒక డబుల్స్ మ్యాచ్ ఉంటుంది. ఒక టీమ్‌లో కనీసం ముగ్గురు, గరిష్టంగా ఐదుగురు సభ్యులు ఉండాలి. వీరంతా ఒకే సంస్థకు చెందిన వారై ఉండాలి.

* ఓపెన్ కేటగిరీ: ఇందులో పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్, మిక్స్‌డ్ డబుల్స్ ఉంటాయి. ఈ కేటగిరీలో వేర్వేరు సంస్థలకు చెందిన వారు కూడా జంటగా పాల్గొనవచ్చు.

 

Follow Us