IPL 2025: అబ్బా సాయిరాం.. మొత్తానికి చీటీ బయటకి తీసాడు! కాటేరమ్మ చిన్నోడి బాగోతం బయటపెట్టిన పెద్దొడు!
ఐపీఎల్ 2025లో పంజాబ్‌పై విజయంలో అభిషేక్ శర్మ అసాధారణ సెంచరీతో మాంచి జోష్ తెచ్చాడు. 55 బంతుల్లో 141 పరుగులు చేసి SRH గెలుపు సాధించాడు. ఈ సందర్భంగా “This one is for Orange Army” అనే నోటును చూపించి అభిమానులకు అంకితంగా సెంచరీని అందించాడు. ఈ గెస్ట్‌చర్‌తో అభిషేక్ క్రేజ్ మరింత పెరిగింది.

ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ అసాధారణమైన ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. 246 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన SRH తరఫున 55 బంతుల్లోనే 141 పరుగుల దూకుడుతో చెలరేగిన అభిషేక్, మ్యాచ్‌ను కేవలం 18.3 ఓవర్లలో ముగించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో SRH 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. గత నాలుగు మ్యాచ్‌ల్లో ఓటముల పరంపరతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న జట్టుకు అభిషేక్ తుఫాను ఇన్నింగ్స్ ఊపిరి పీల్చేలా చేసింది. ఆతిథ్య హైదరాబాద్ వేదికపై పంజాబ్ కింగ్స్ 245 పరుగుల భారీ స్కోరు నమోదు చేసిన తర్వాత, అటు బ్యాటింగ్‌లో, ఇటు ఫామ్ లో కాస్త వెనుకబడిన అభిషేక్ నుంచి ఇంతటి ప్రదర్శన ఊహించనిది.
ఇన్నింగ్స్‌లో మూడు అంకెల స్కోరుకు చేరుకున్న తర్వాత అభిషేక్ తన జేబులోంచి తీసిన ఓ నోట్ అందరి దృష్టిని ఆకర్షించింది. “This one is for Orange Army” అని ఆ నోట్‌లో రాసి ఉండగా, ఆ క్షణం అతడిని చూస్తూ స్టేడియం మొత్తం మార్మోగిపోయింది. తర్వాత ఆ నోట్ గురించి ఆసక్తికర విషయాన్ని అభిషేక్ సహచరుడు, ఓపెనింగ్ పార్ట్నర్ అయిన ట్రావిస్ హెడ్ వెల్లడించాడు. ఆ నోట్ ఏకంగా 6 మ్యాచ్లుగా అభిషేక్ జేబులోనే ఉండేది. “ఈ నోట్ ఆయన జేబులో 6 మ్యాచ్ల నుంచి ఉంది. ఈ రోజు అది బయటకు వచ్చినందుకు సంతోషంగా ఉంది,” అని హెడ్ మీడియా సమావేశంలో చెప్పాడు. అంటే అభిషేక్ శర్మ తన తొలి సెంచరీను ఆరెంజ్ ఆర్మీకి అంకితమిస్తూ ముందుగానే తలపోయాడన్నమాట.
ఆ మ్యాచ్ తర్వాత అభిషేక్ తన భావోద్వేగాలను వ్యక్తపరిచాడు. “ఇది చాలా ప్రత్యేకమైన రోజు. నాలుగు మ్యాచ్‌లు ఓడిన తర్వాత జట్టును గెలిపించాలనే తపనతో నిలబడ్డాను. ఈ రోజు నేను లేవగానే రాసుకున్నాను… ఏమైనా చేస్తే అది ఆరెంజ్ ఆర్మీ కోసం అని. అదే జరగడం నా అదృష్టం. ఇది నా రోజు,” అని అన్నాడు. అభిషేక్ మాట్లాడుతూ యువరాజ్ సింగ్, సూర్యకుమార్ యాదవ్ లాంటి క్రికెటర్లతో టచ్‌లో ఉండటం తనకు ప్రేరణగా మారిందని కూడా వెల్లడించాడు.
ఈ ఇన్నింగ్స్‌లో అభిషేక్ ఏకంగా 14 ఫోర్లు, 10 సిక్సర్లు బాదుతూ 250కి పైగా స్ట్రైక్‌రేట్‌ను నమోదు చేశాడు. అతనికి తోడుగా ఆస్ట్రేలియా పవర్‌హౌస్ ట్రావిస్ హెడ్ 37 బంతుల్లో 66 పరుగులతో రాణించడంతో లక్ష్య ఛేదన సులభతరమైంది. ఈ విజయం ద్వారా SRH పాయింట్ల పట్టికలో క్రితం నుంచి పైకి చేరడం సాధ్యమైంది. ముఖ్యంగా గత నాలుగు ఓటముల తర్వాత వచ్చిన ఈ విజయం జట్టుకు మళ్లీ నమ్మకాన్ని, ఉత్సాహాన్ని నింపింది.
మొత్తంగా ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ చూపించిన ఆటతీరే కాదు, ఆ నోటుతో చేసిన చిన్న గెస్టర్‌కి ఎంతో అర్థం ఉంది. అది కేవలం ఓ సెంచరీ కాదు, అది SRH అభిమానులైన ఆరెంజ్ ఆర్మీకి గెలుపు గుండె నుంచి వచ్చిన అంకితం. ఈ ఘటనతో అభిషేక్ క్రేజ్ మరింత పెరిగింది. అతడి ప్రదర్శన ఇప్పటికి కాదు, భవిష్యత్తులో కూడా SRH విజయంలో కీలకంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Travis Head said, "the note has been in the pocket of Abhishek Sharma for 6 games, glad it came out tonight". 🤣❤️ pic.twitter.com/OdUMBJSjRM
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 12, 2025
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..