IND vs ENG: విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్‌తో చారిత్రాత్మక సిరీస్‌ను గెలించేందుకు సిద్ధమయ్యాడు. భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆగస్టు నుంచి జరగనుంది. ఐదు టెస్టుల సిరీస్‌లో మొదటి మ్యాచ్ ఆగస్టు 4 నుంచి ప్రారంభమవుతుంది. కానీ, దీనికి ముందు ఈ రెండు జట్ల మధ్య ఓ చారిత్రాత్మక మ్యాచ్ గురించి మాట్లాడుకోవాలి. లార్డ్స్‌లో జరిగిన ఈ తొలి టెస్టులో టీమిండియా 196 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. దాంతో టీమిండియా ఈ సిరీస్‌లో వెనుకంజలో పడిపోయింది. భారత్, ఇంగ్లండ్‌ల మధ్య జరిగిన 100 వ టెస్ట్ మ్యాచ్ కావడం విశేషం. అలాగే డంకన్ ఫ్లెచర్ కోచ్‌గా 100 వ టెస్ట్ మ్యాచ్ కూడా ఇదే కావడం, క్రికెట్ చరిత్రలో 2000 వ టెస్ట్ మ్యాచ్ కావడం మరో విశేషం.
2011 జులై 21 నుంచి 25 వరకు జరిగిన ఈ మ్యాచ్‌లో, మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 8 వికెట్ల నష్టానికి 474 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌ను ప్రకటించింది. ఇంగ్లండ్ దిగ్గజ ఆటగాడు కెవిన్ పీటర్సన్ డబుల్ సెంచరీ చేశాడు. ఇందులో 21 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 326 బంతుల్లో అజేయంగా 202 పరుగులు సాధించాడు. అలాగే మరో బ్యాట్స్‌మెన్ జోనాథన్ ట్రోట్ 70 పరుగులు చేయగా, వికెట్ కీపర్ కం బ్యాట్స్ మెన్ మాట్ ప్రియర్ 71 పరుగులు చేశారు. ఇయాన్ బెల్ కూడా 45 పరుగులు సాధించి ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసేందుకు సహాయపడ్డారు. టీమిండియా తరపున ప్రవీణ్ కుమార్ ఐదు వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు 286 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇందులో రాహుల్ ద్రావిడ్ 103 పరుగులు చేయగా, అభినవ్ ముకుంద్ 49 పరుగులు, సచిన్ టెండూల్కర్ 34 పరుగులు సాధించారు. ఇంగ్లండ్ తరఫున స్టువర్ట్ బ్రాడ్ 4 వికెట్లు, క్రిస్ ట్రెంలెట్ 3 వికెట్లు, జేమ్స్ అండర్సన్‌కు 2 వికెట్లు పడగొట్టారు.
ఇంగ్లండ్ రెండవ ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మన్ మాట్ ప్రియర్ అజేయంగా 103 పరుగులు, స్టువర్ట్ బ్రాడ్ 74 పరుగులు, కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్ 32 పరుగులు సాధించారు. టీమిండియా తరఫున ఇషాంత్ శర్మ 4 వికెట్లు పడగొట్టాడు. భారత జట్టు 261 పరుగులకు చేతులెత్తేసింది. సురేష్ రైనా 78 పరుగులు చేయగా, వీవీఎస్ లక్ష్మణ్ 56 పరుగులు చేశాడు. జేమ్స్ అండర్సన్ 5 వికెట్లు, స్టువర్ట్ బ్రాడ్ 3 వికెట్లతో టీమిండియా నడ్డి విరిచారు. దీంతో భారత జట్టు ఈ మ్యాచ్‌ను 196 పరుగుల తేడాతో ఓడిపోయింది.
Also Read: Tokyo Olympics 2020: బికినీలతోనే జిమ్నాస్టిక్స్ చేయాలా..? ఈ అథ్లెట్ చేసిన పనికి సలాం అంటోన్న జనం