
Rohit Sharma Records: క్రికెట్ చరిత్రలో ఎందరో దిగ్గజ బ్యాట్స్‌మెన్‌లు ఉన్నారు. కానీ, వన్డే అంతర్జాతీయ క్రికెట్‌లో ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ సృష్టించిన ఒక రికార్డు మాత్రం అరుదైనది. ఇది మరో 100 ఏళ్ల వరకు బ్రేక్ చేయడం సాధ్యం కాదనిపిస్తోంది. ఆ రికార్డ్ ఏంటో తెలిస్తే, మీరు కూడా ఇదే మాట అంటారు. రోహిత్ బద్దలవ్వని రికార్డ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. అదే మూడు డబుల్ సెంచరీలు. ఈ ఘనతను సాధించిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. ఈ రికార్డును బద్దలు కొట్టడం దాదాపు అసాధ్యమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
209 vs ఆస్ట్రేలియా (బెంగుళూరు, 2013): రోహిత్ శర్మ తన వన్డే కెరీర్‌లో మొట్టమొదటి డబుల్ సెంచరీని ఆస్ట్రేలియాపై బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సాధించాడు. ఈ మ్యాచ్‌లో అతను 158 బంతుల్లో 209 పరుగులు చేశాడు. ఇందులో 12 ఫోర్లు, 16 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఇది అతని కెరీర్‌లో ఒక మలుపు తిప్పిన ఇన్నింగ్స్.
264 vs శ్రీలంక (కోల్‌కతా, 2014): ఇది రోహిత్ శర్మ సాధించిన అత్యధిక వ్యక్తిగత వన్డే స్కోరు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో శ్రీలంకపై అతను 173 బంతుల్లో 264 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 33 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. వన్డే క్రికెట్ చరిత్రలోనే ఒక బ్యాట్స్‌మెన్ చేసిన అత్యధిక స్కోరు ఇది. ఈ రికార్డు కూడా ఇప్పట్లో బద్దలవడం కష్టం.
208 vs శ్రీలంక (మొహాలీ, 2017):* మొహాలీలో శ్రీలంకపైనే రోహిత్ శర్మ తన మూడవ డబుల్ సెంచరీని సాధించాడు. ఈ మ్యాచ్‌లో అతను 153 బంతుల్లో 208 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 13 ఫోర్లు, 12 సిక్సర్లు ఉన్నాయి. తన వివాహ వార్షికోత్సవం రోజున ఈ అద్భుత ఇన్నింగ్స్ ఆడటం విశేషం.
వన్డే క్రికెట్ ఫార్మాట్‌లో 50 ఓవర్లలో ఒక బ్యాట్స్‌మెన్ డబుల్ సెంచరీ సాధించడమే ఒక అద్భుతం. అలాంటిది మూడు సార్లు డబుల్ సెంచరీలు నమోదు చేయడం అంటే అది మామూలు విషయం కాదు. రోహిత్ శర్మ అద్భుతమైన టైమింగ్, సిక్సర్లు బాదే సామర్థ్యం, సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడే ఓపిక ఈ రికార్డుకు కారణంగా నిలిచింది.
ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో అనేక మంది పవర్‌హిట్టర్లు ఉన్నప్పటికీ, నిలకడగా ఈ స్థాయిలో పరుగులు చేయడం, పెద్ద స్కోర్లుగా మలచడం చాలా కష్టం. క్రికెట్‌లో టీ20 ఫార్మాట్ ప్రభావం పెరగడంతో ఆటగాళ్లు వేగంగా పరుగులు సాధించడానికి మొగ్గు చూపుతున్నారు. దీంతో ఒకే ఇన్నింగ్స్‌లో ఎక్కువ సేపు క్రీజ్‌లో ఉండి డబుల్ సెంచరీ చేయడం అనేది చాలా అరుదైపోయింది.
రోహిత్ శర్మ వన్డేల్లో సాధించిన ఈ మూడు డబుల్ సెంచరీల రికార్డు, అతనిని “హిట్‌మ్యాన్”గా మార్చడమే కాకుండా, క్రికెట్ చరిత్రలో ఒక అరుదైన స్థానాన్ని కల్పించింది. ఈ రికార్డును బద్దలు కొట్టడానికి భవిష్యత్తులో ఏ బ్యాట్స్‌మెన్ వచ్చినా, అతనికి ఒక గొప్ప సవాలు ఎదురవడం ఖాయం.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..