AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sourav Ganguly Birthday: ఆదమరిచి నిద్రపోతున్న గంగూలీ.. గదిని నీళ్లతో నింపిన సచిన్.. కట్ చేస్తే..

జులై 8న సౌరవ్ గంగూలీకి 50వ పుట్టినరోజు. భారత అత్యుత్తమ కెప్టెన్లలో బీసీసీఐ చీఫ్ గంగూలీ పేరు కూడా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తన పుట్టినరోజుకు ముందు, సచిన్ దాదాతో తన స్నేహానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

Sourav Ganguly Birthday: ఆదమరిచి నిద్రపోతున్న గంగూలీ.. గదిని నీళ్లతో నింపిన సచిన్.. కట్ చేస్తే..
Sourav Ganguly Birthday Sachin
Venkata Chari
|

Updated on: Jul 07, 2022 | 4:48 PM

Share

సచిన్ టెండూల్కర్(Sachin), సౌరవ్ గంగూలీ(Sourav Ganguly) ఇద్దరు భారత క్రికెట్‌లో ఎంతో పేరుగాంచారు. అయితే, ఇద్దరి మధ్య స్నేహం కూడా ఎంతో స్ట్రాంగ్‌గా ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత కూడా ఇద్దరి మధ్య స్నేహం కొనసాగుతూనే ఉంది. తాజాగా BCCI ప్రెసిడెంట్ గంగూలీ 50వ పుట్టినరోజుకు ముందు తన ఓపెనింగ్ పార్ట్‌నర్‌తో పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ, టెండూల్కర్ PTIతో పలు అంశాలను పంచుకున్నారు. దాదాపు ఐదేళ్ల పాటు కెప్టెన్‌గా ఉన్న సమయంలో గంగూలీ తనకు ఎంత స్వేచ్ఛ ఇచ్చాడనే ప్రశ్నకు సచిన్ సమాధానమిస్తూ.. సౌరవ్ గొప్ప కెప్టెన్. బ్యాలెన్స్ ఎలా చేయాలో అతనికి తెలుసు. ఆటగాళ్లకు ఎంత స్వేచ్ఛ ఇవ్వాలి, ఎంత బాధ్యతగా ఉండాలి లాంటి విషయాల్లో ఆరితేరాడు. అతను బాధ్యతలు స్వీకరించినప్పుడు, భారత క్రికెట్‌లో మార్పుల కాలం నడుస్తోంది. భారత క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లగల ఆటగాళ్లు కావాలంటూ, నిరంతరం యువత కోసం శోధించేవాడు’ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే, ఈ సందర్భంలో ఓ సరదా సన్నివేశాన్ని సచిన్ గుర్తు చేసుకున్నాడు. గంగూలీ గదిలో నిద్రపోతున్నాడు. ఈ క్రమంలో గంగూలీని ఆటపట్టించేందుకు సచిన్, జతిన్ పరంజ్పే, కేదార్ గాడ్‌బోలే కలిసి గంగూలీ గదిని నీళ్లతో నింపారు. దాంతో గదిలోని ఉన్న వస్తువులన్నీ నీటిపై తేలుతూ ఉన్నాయంట. మెళుకువ వచ్చిన గంగూలీ, అసలేం జరుగుతుందో అర్థం కాక షాక్ అయ్యాడంట. అయితే, కొన్ని సూట్ కేసులు నీటిలో తేలుతూ కనిపించడంతో, ఓపెన్ చేసి చూడగా, అవి వారి ఆహారం అని తెలిసి అంతా అవాక్కయ్యారంట. ఇలాంటి ఎన్నో సన్నివేశాలు జరిగినట్లు సచిన్ తన గతాన్ని గుర్తుచేసుకున్నారు.

ఎందరో ఛాంపియన్లను తయారు చేశాడు..

ఇవి కూడా చదవండి

సచిన్ మాట్లాడుతూ ‘అప్పట్లో వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, ఆశిష్ నెహ్రా వంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్లు ఉన్నారు. వీరంతా చాలా ప్రతిభావంతులైనప్పటికీ, వారి కెరీర్ ప్రారంభంలో వారికి మద్దతు ఎంతో అవసరం. అలాంటి సమయంలో సౌరవ్ వారిని తమదైన రీతిలో ఆడే స్వేచ్ఛను ఇచ్చాడు. 1999లో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా తాను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే తదుపరి కెప్టెన్ ఎవరన్నది నిర్ణయించుకునే, ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాను. కెప్టెన్సీ నుంచి వైదొలగే ముందు, భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో, నేను జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉండాలని సౌరవ్‌ని సూచించాను. నేను అతనిని దగ్గరగా చూశాను. అతనితో క్రికెట్ ఆడాను. అతను భారత క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లగలడని నాకు తెలుసు. అతను మంచి కెప్టెన్. దీని తర్వాత సౌరవ్ వెనుదిరిగి చూసుకోలేదని, అతని విజయాలు మన ముందున్నాయని’ సచిన్ తెలిపాడు. వీరిద్దరి మధ్య అద్భుతమైన సమన్వయం ఫలితంగా 26 సెంచరీ భాగస్వామ్యాలు వచ్చాయి.

U-15 రోజుల నుంచే స్నేహం..

సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ, ‘జట్టు మ్యాచ్ గెలవడానికి సౌరవ్, నేను మా అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి ప్రయత్నించాం. ఇంతకు మించి మేం ఏమీ ఆలోచించలేదు. గంగూలీ తొలిసారిగా 1992లో భారత్ తరపున ఆడిన తర్వాత 1996లో తిరిగి వచ్చాడు. ఆ సమయంలో మొబైల్ ఫోన్లు లేవు. కానీ, ఇద్దరూ ఒకరితో ఒకరు సన్నిహితంగా ఉండేవారు. టెండూల్కర్ మాట్లాడుతూ, “మేం 1991 పర్యటనలో ఒకే గదిలో నివసించాం. ఒకరితో ఒకరు సరదాగా గడిపాం. మేం ఒకరినొకరు 15 రోజులలోపు బాగా క్లోజ్ అయ్యాం. ఆ పర్యటన తర్వాత కూడా మేం కలుసుకున్నాం. కానీ, అప్పుడు మొబైల్ ఫోన్లు లేవు. మేము నిరంతరం టచ్‌లో ఉండలేదు. కానీ స్నేహం మాత్రం ఏమాత్రం తగ్గలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు.

కాన్పూర్‌లో బీసీసీఐ నిర్వహించిన జూనియర్ టోర్నమెంట్‌లో వీరిద్దరు తొలిసారి కలిశారు. దీని తరువాత, ఇండోర్‌లో దివంగత వాసు పరంజ్‌పే పర్యవేక్షణలో జరిగిన వార్షిక శిబిరంలో ఇద్దరూ కలిసి చాలా సమయం గడిపారు. టెండూల్కర్ మాట్లాడుతూ, “మేం ఇండోర్‌లోని అండర్ 15 క్యాంప్‌లో కలిసి చాలా సమయం గడిపాం. ఒకరినొకరు పరిచయం చేసుకున్నాం. అక్కడి నుంచి మా స్నేహం మొదలైందంటూ మాస్టర్ బ్లాస్టర్ తెలిపాడు.

ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. గంగూలీ కూడా ఇంగ్లండ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్ చేసిన 5వ టెస్టులో భారత్ ఓడిపోయింది. ప్రస్తుతం ఆతిథ్య జట్టుతో వన్డేలు, టీ20ల్లో టీమిండియా తలపడనుంది.

గంగూలీ, టెండూల్కర్ ఇద్దరూ ఇంగ్లండ్‌లో క్రికెట్ ఆడారు. ఎన్నో మంచి జ్ఞాపకాలను కలిగి ఉన్నారు. వీరిద్దరు ఇంగ్లిష్ గడ్డపై టెస్టులు, ODIలు రెండింటిలోనూ చాలా పరుగులు చేశారు. ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలో 2007లో ఇంగ్లాండ్‌లో భారత్ చివరి టెస్ట్ సిరీస్‌ను గెలుచుకున్న జట్టులో భాగంగా ఉన్నారు.

2002లో ఇంగ్లండ్‌లో నాట్‌వెస్ట్ ట్రోఫీని గెలుచుకున్న జట్టులో సచిన్, గంగూలీ భాగమయ్యారు. గంగూలీ, టెండూల్కర్ కలిసి వన్డేల్లో అత్యధిక భాగస్వామ్య పరుగుల ప్రపంచ రికార్డును పంచుకున్నారు. వీరిద్దరూ 176 ఇన్నింగ్స్‌ల్లో 47.55 సగటుతో 8227 పరుగులు చేశారు. వీరి మధ్య 26 సెంచరీ భాగస్వామ్యాలు ఉన్నాయి.