Pakistan: పాకిస్థాన్ క్రికెట్‌లో మరో సంచలనం.. వన్డే కెప్టెన్‌గా రిజ్వాన్ ఔట్.. కొత్తగా ఎవరొచ్చారంటే..?
Pakistan New Captain Shaheen Afridi: రిజ్వాన్ నాయకత్వంలో జట్టు ఇటీవల అంతగా రాణించకపోవడమే ఈ మార్పునకు ప్రధాన కారణమని తెలుస్తోంది. రిజ్వాన్ కెప్టెన్సీలో పాకిస్థాన్ 20 వన్డేలు ఆడగా, 9 విజయాలు, 11 ఓటములు (విజయాల శాతం 45%) చవిచూసింది.

Shaheen Afridi replaces Mohammad Rizwan as Pakistan ODI Captain: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) మరో కీలక నిర్ణయం తీసుకుంది. వన్డే (ODI) జట్టు కెప్టెన్సీ నుంచి మహమ్మద్ రిజ్వాన్‌ను తప్పించి, స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిదికి జట్టు పగ్గాలు అప్పగించింది. 2027 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగానే ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది.
రిజ్వాన్ స్థానంలో అఫ్రిది..
పాకిస్థాన్‌లో కెప్టెన్ల మార్పు పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా, వికెట్ కీపర్-బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ వన్డే కెప్టెన్సీ పదవి నుంచి తొలగించారు. అతని స్థానంలో ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిదిని కొత్త వన్డే కెప్టెన్‌గా నియమిస్తూ పీసీబీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఎప్పుడు బాధ్యతలు?
షాహీన్ అఫ్రిది తన కొత్త పాత్రలో నవంబర్ 4 నుంచి దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌తో కెప్టెన్‌గా తొలి అడుగు వేయనున్నాడు. ఈ సిరీస్ ఫైసలాబాద్‌లోని ఇక్బాల్ స్టేడియంలో జరగనుంది.
నిర్ణయం వెనుక కారణాలు..
రిజ్వాన్ నాయకత్వంలో జట్టు ఇటీవల అంతగా రాణించకపోవడమే ఈ మార్పునకు ప్రధాన కారణమని తెలుస్తోంది. రిజ్వాన్ కెప్టెన్సీలో పాకిస్థాన్ 20 వన్డేలు ఆడగా, 9 విజయాలు, 11 ఓటములు (విజయాల శాతం 45%) చవిచూసింది. ముఖ్యంగా ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో వైఫల్యం, న్యూజిలాండ్, వెస్టిండీస్‌తో సిరీస్‌లలో ఓటములు బోర్డు ఈ నిర్ణయం తీసుకోవడానికి దారితీశాయి.
ఉన్నత స్థాయి సమావేశంలో ఖరారు..
అఫ్రిది నియామక నిర్ణయం ఇస్లామాబాద్‌లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఖరారైంది. ఈ సమావేశంలో పాకిస్థాన్ వైట్ బాల్ హెడ్ కోచ్ మైక్ హెస్సన్, హై పర్ఫార్మెన్స్ డైరెక్టర్ ఆకిబ్ జావేద్, జాతీయ సెలక్షన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
పీఎస్‌ఎల్ విజయం..
షాహీన్ అఫ్రిది ఇప్పటికే పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)లో లాహోర్ ఖలందర్స్‌కు విజయవంతమైన కెప్టెన్‌గా ఉన్నాడు. అతని సారథ్యంలో జట్టు మూడు టైటిళ్లను గెలుచుకుంది.
రెండో కెప్టెన్సీ అవకాశం:
అఫ్రిదికి జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం ఇది రెండోసారి. గతంలో 2024 జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన ఒక T20I సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించగా, జట్టు 1-4తో ఓడిపోవడంతో అతనిని ఆ బాధ్యతల నుంచి తొలగించి బాబర్ ఆజమ్‌ను తిరిగి కెప్టెన్‌గా నియమించారు.
మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లు..
ఈ మార్పుతో, పాకిస్థాన్ జాతీయ జట్టుకు మూడు వేర్వేరు ఫార్మాట్లలో ముగ్గురు వేర్వేరు కెప్టెన్లు ఉన్నారు. టెస్ట్‌లకు షాన్ మసూద్, వన్డే (ODI)లకు షాహీన్ షా అఫ్రిది, T20Iలకు సల్మాన్ అలీ ఆఘా ఉన్నారు.
పాకిస్థాన్ క్రికెట్‌లో తరచూ కెప్టెన్సీ మార్పులు జరుగుతున్న నేపథ్యంలో, షాహీన్ అఫ్రిది నాయకత్వంలో జట్టు ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందో వేచి చూడాలి. ముఖ్యంగా 2027 ప్రపంచకప్‌కు ముందు జట్టును బలోపేతం చేసే బాధ్యత 25 ఏళ్ల ఈ స్టార్ పేసర్‌పై పడింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








